చదలవాడ ... తిరుమలకా? తిరుపతికా?
తిరుమల వెంకన్నకు సేవ చేసుకునే మహాభాగ్యం తెలుగు తమ్ముళ్లకు ఇప్పుడప్పుడే ఉన్నట్లు కనిపించడం లేదు. టీటీడీ చైర్మన్ పోస్ట్కు 'ఎంతో మంది తమ్ముళ్ల' పేరు వినపడిన చివరకు తిరుమల మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి పేరు ఖరారైంది. అందుకు సంబంధించిన ఫైలు సీఎం బాబుగారి టేబుల్పై చేరింది... ఇంకేముంది రేపోమాపో బాబుగారు సంతకం చేస్తే ప్రకటన వచ్చేస్తుందని చైర్మన్తో పాటు సభ్యులుగా తమకు చోటు దక్కిందని సమాచారం ఉన్న వారు తెగ ఖుషీఖుషి పడిపోయారు.
అయితే తిరుమల ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎం.వెంకటరమణ అకస్మాత్తుగా మృతి చెందటంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. ఈ ఏడాది ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ టికెట్ కోసం చదలవాడ కృష్ణమూర్తి తీవ్రంగా ప్రయత్నించిన విషయం తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ రాజీనామా చేసి టీడీపీలో చేరిన వెంకటరమణ కూడా అంతే తీవ్రంగా ప్రయత్నించారు.
బాబు మాత్రం వెంకటరమణకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి... నీకు మాత్రం టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తానని చేతిలో ఒట్టు వేసి మరీ చెప్పినట్లు సమాచారం. ఆ ఎన్నికల్లో వెంకటరమణ విజయం సాధించడం.... ఆ తర్వాత ఆయన ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కానుంది. దాంతో ఆ స్థానం నుంచి మళ్లీ చదలవాడనే ఎన్నికల బరిలో నిలబెడితే ఎలా ఉంటుందనే ఆలోచన స్థానిక పచ్చ తమ్ముళ్లకు వచ్చిందని తెలుస్తోంది. అదే విషయం బాబు గారి చెవిన వేయాలని సొంత జిల్లాలో సీఎం గారి సొంత మనుషుల చెవిలో వారు ఊదారంటా.
అదే జరిగితే చదలవాడకు తిరుపతి ప్రజలకు సేవ చేసుకునే అవకాశం దక్కుతుంది కానీ కొండపైన శ్రీవారి సేవ చేసుకునే భాగ్యం మాత్రం దక్కే పరిస్థితి లేదు. అదికాక ఇప్పటికే జిల్లాలోని సీనియర్ నేతలు, మాజీ మంత్రులు గాలి ముద్దుకృష్ణమ్మనాయుడు, గల్లా అరుణకుమారి టీటీడీ ఛైర్మన్ గిరితో శ్రీవారి సేవ చేసుకోవాలని తెగ ముచ్చట పడుతున్నారు. అలాగే టీటీడీ ఛైర్మన్గిరి తన జీవితాశయమంటూ ఎలుగెత్తి చాటుతున్న నరసారావు పేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తన జీవితాశయాన్ని నెరవేర్చుకుని పనిలో ఉన్నారు. మరి వెంకన్నకు సేవ చేసుకునే భాగ్యం చివరికి ఎవరికి దక్కుతుందో అనేది వేచి చూడాల్సిందే.