కాసులు పండే శాఖే కానీ....
ఏ మంత్రైనా కోరుకునేది వాణిజ్య శాఖ లాంటి కాసులు కురిపించే శాఖ. ఆ శాఖ దక్కిందంటే ఇక ఆ లక్కే వేరంటారు తెలిసినవారు. అయితే ఆ శాఖ మంత్రిగా ఉన్న అప్పుడు ఉండే లక్కు, కిక్కు ఆ తర్వాత ఉండటం లేదు. దాంతో ఆ శాఖ మంత్రిగా పని చేసిన సదరు మంత్రిపుంగవులకు రాజకీయ జీవితం పుల్ స్టాప్ పడటమో లేక చాలా సుదీర్ఘమైన కామా పడటమో జరుగుతోంది గత రెండు దశాబ్దాలుగా వాణిజ్య మంత్రులుగా పని చేసిన వారి వివరాలు తీసుకుంటే ఆ సంగతి స్పష్టమైపోతుంది.....
చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో ప్రకాశం జిల్లాకు చెందిన జాగర్లమూడి లక్ష్మి పద్మావతి వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. కొద్ది కాలంలో ఆమెపై ఆరోపణలు రావడంతో ఆమె ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఆమె అయిపే లేకుండా పోయారు. ఆ తర్వాత ఐపీఎస్ అధికారిగా పదవి విరమణ పొంది...తెలుగుదేశంలో చేరి ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు తొలిసారి ఎన్నికైయ్యారు. ఆ వెంటనే చంద్రబాబు తన కేబినెట్లో ఆయనకు వాణిజ్య పన్నుల శాఖను కట్టబెట్టారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన అదే నియోజకవర్గం నుంచి ఓటమి పాలైయ్యారు. ప్రస్తుతం ఆయన సోదిలోకి లేకుండా పోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రాజశేఖరరెడ్డి తన మంత్రి వర్గంలో ఆ శాఖను కొణతాల రామకృష్ణకు కేటాయించారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన వైఎస్ ఆ శాఖను ఎవరికి కేటాయించలేదు. ఆయన అకస్మిక మరణానంతరం వచ్చిన సీఎంలు కె.రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు కూడా వాణిజ్యపన్నుల శాఖను తమ వద్ద ఉంచుకున్నారు. కిరణ్ రాజకీయ జీవితంలో వెలుగు కిరణాలే లేకుండా పోయాయి. రోశయ్య పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాణిజ్యపన్నుల శాఖను టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడికి కేటాయించారు. యనమల రామకృష్ణుడు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో జస్ట్ అయిదేళ్లాగితే తెలిసిపోతుంది.