'నారా'యణ మంత్రం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తారక మంత్రాన్ని తత్కాలికంగా పక్కనపెట్టి... నారాయణ మంత్రాన్ని జపిస్తున్నారు. అటు శాసనసభలో, ఇటు శాసన మండలిలో సభ్యుడు కానీ ప్రముఖ విద్యాసంస్థల అధినేత పి. నారాయణను చంద్రబాబు ఏకంగా తన కేబినెట్లోకి తీసుకున్నారు. అంతేనా ప్రభుత్వశాఖలలో అత్యంత ముఖ్యమైన శాఖ మున్సిపల్, పట్టణాభివృధ్దిని నారాయణకు అప్పగించేశారు. టీడీపీ స్థాపించిన నాటి నుంచి పార్టీలో ఉన్న తమకు రాకుండా ఏ సభలో సభ్యుడు కానీ నారాయణ పార్టీలోకి ఇలా వచ్చి అలా మంత్రి పదవి ఎలా ఎగరేసుకుపోయాడా అని తెలుగు తమ్ముళ్లు తెగ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారని సమాచారం.
అసలు విషయానికి వస్తే.... 90వ దశకంలో క్రియటీవ్ డైరెక్టర్ దర్శకత్వంలో వచ్చిన ఓ చిత్రంలో చేపల కృష్ణలా ఏదో చట్ట సభలో అధ్యక్ష అని పిలిపించుకోవాలని ఎన్నాళ్ల నుంచో నారాయణ ఎంతో ఆశగా ఉన్నారు. ఇటీవల జరిగిన పెద్దల సభ ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్ష అనిపించుకోని తన ముచ్చట తీర్చుకోవాలని నారాయణ ఆశించారు. అంతే ఇంకా ఆలస్యం చేయకుండా తాను రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగితానంటూ చంద్రబాబు చెవిలో ఊదారు. సామదానభేదోపాయలు ఉపయోగించి అయినా గెలుస్తానని చెప్పుకొచ్చారు. అయితే నారాయణ అధ్యక్ష ఆశలపై.... అప్పట్లో బాబు నీళ్లు చల్లారు.
దాంతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలో టీడీపీని గెలిపిస్తే ఏ సభలో సభ్యుడు కాకపోయినా మంత్రి పదవి కట్టబెడతానంటూ నారాయణకు చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతే నారాయణ రంగంలోకి దిగారు. నారాయణమంత్రంతో... ఉత్తరాంధ్రలోని మొత్తం 34 అసెంబ్లీ స్థానాలకు గాను 24 అసెంబ్లీ స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది.
అంతేకాకుండా విశాఖపట్నం,అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంట్ సీట్లు సైతం ఆ పార్టీ కైవసం చేసుకుంది. దాంతో నారాయణకు చంద్రబాబు తన కేబినెట్లో మంత్రి పదవి కట్టబెట్టారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఓ దశలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవికి నారాయణను చంద్రబాబు ఎంపిక చేశారంటూ పుకార్లు షికారు చేసిన సంగతి తెలిసిందే.