.... మాకేది సం'క్రాంతి'
అంతా భ్రాంతియేనా జీవితాన సం'క్రాంతి' ఇంతేనా అని తెలుగు తమ్ముళ్లు తెగ ఇదయి పోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సంక్రాంతి పండుగ సందర్బంగా రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులను పట్టించుకున్నట్లుగా కూడా తమను పట్టించుకోవడం లేదని 'పచ్చ కార్డుదారులు' (పచ్చ తమ్ముళ్లు) పడుతున్న ఆవేదన అంతా ఇంతాకాదు. నేడో రేపో నామినేటేడ్ పోస్టులు భర్తీ చేస్తారని ఆశపెట్టుకున్న తమ్ముళ్ల ఆశలు ఇప్పడే తీరేలా కనిపించడం లేదు. ఎందుకంటే చిత్తూరు జిల్లా తిరుపతి ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దాంతో ఎన్నికల కోడ్ కూసేసింది. దాంతో దసరా, దీపావళి, క్రిస్మస్ పండగలు ఒకదాని వెంట ఒకటి వరుసగా వెళ్లినా తమకు మాత్రం చంద్రన్న కానుక ఇప్పుడు అప్పుడే తమకు దక్కేలా లేదని తమ్ముళ్లు భావిస్తున్నారు.
ఒకటా రెండో... ఏకంగా 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే అధినేత చంద్రన్న నామినేటేడ్ పోస్టులు భర్తీ చేస్తారని తమ్ముళ్ల ఆశలు పెట్టుకున్నారు. పరిస్థితి చూస్తుంటే తమ్ముళ్ల ఆశలు రోజురోజుకు ఆవిరి అవుతున్నాయి. రాష్ట్ర విభజన దెబ్బ తిన్న ఆంధ్రప్రదేశ్పై హుదూద్ తుపాన్ బీభత్సం సృష్టించడం... ఆ వెంటనే బాబు రాజధాని నిర్మాణం అంటూ బాబుగారు దృష్టి కేంద్రీకరించడంతోపాటు సింగపూర్, జపాన్ ప్రయాణాలు... ఆ వెంటనే శూన్యమాసం తరుముకు వచ్చాయి.
సమస్యల సుడిగుండం నుంచి తేరుకున్న బాబు నామినేటేడ్ పోస్టుల భర్తీకి జాబితా సిద్దం చేయాలంటూ పార్టీ సీనియర్ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. ఇంకే కొత్త సంవత్సరం.. సంక్రాంతి పండగకు తమ పంట పండి చంద్రన్న కానుక ఇంటి వచ్చేస్తుందని తమ్ముళ్లు గంపెడాశతో ఎదురు చూశారు. చంద్రన్న కానుక తెల్లరేషన్ కార్డు దారుల ఇళ్లుకే చేరింది కానీ... తమ ఇంటికి రాలేదని తమ్ముళ్లు ఫీలైపోతున్నారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కాలం నేల మీద గోళీకాయి దొరినట్లు దొర్లిపోయాయి.. నామినేటేడ్ పోస్టులు ఇప్పుడే తమను వరించేలా లేవని పాపం తమ్ముళ్లు వాళ్లలో వాళ్లు సర్థి చెప్పుకుంటున్నారు.