మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు, బంధువులు
చీపురుపల్లి : ఇంతవరకు డెంగీ మహమ్మారి ప్రజలను బలిగొంటుంటే... తాజాగా స్క్రబ్ అనే మరో వింత వ్యాధి దానికి తోడయ్యింది. ఈ రెండు వ్యాధులతో పట్టణంలోని ఆంజనేయపురానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి ఎస్.సాయినివాస్(14) గురువారం మృతి చెందాడు. నిండు నూరేళ్లు జీవించాల్సిన కొడుకు కళ్లముందే అకస్మాత్తుగా మృతి చెందడాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
అన్నపూర్ణ కాలనీలో నివాసం ఉంటున్న ఎస్.లక్ష్మాజీ కుమారుడు సాయి నివాస్ గరివిడిలో గల ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఆ బాలునికి ఈ నెల 14న జ్వరం రాగా స్థానికంగా చికిత్స అందించిన అనంతరం విజయనగరంలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా డెంగీగా నిర్థారించారు. అంతేకాకుండా క్లినికల్ పాతాలజీలో స్క్రబ్ అనే వైరస్ కూడా పాజిటివ్ వచ్చినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు.
వెంటనే అక్కడి నుంచి విశాఖపట్నంలోని మైక్యూర్ ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించగా డెంగీ వీక్ పాజిటివ్‌గా పరీక్షల్లో నిర్థారించారు. ఇదంతా జరుగుతుండగానే గురువారం తెల్లవారు ఝామున సాయి నివాస్ ప్రాణాలు పోయాయి. దీంతో స్వగ్రామమైన చీపురుపల్లికి సాయి నివాస్ మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment