
విశాఖలో వింత !
విశాఖపట్నం: సాదారణంగా ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేక అధికారులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తారు. ధర్నాలు చేస్తారు. కానీ విశాఖలో వింతగా అధికారులు నిరసన తెలుపుతున్నారు. అదీ తమ సమస్యల పరిష్కారం కోసం కాదు. పన్నులు చెల్లించనందుకు ఈ నిరసన తెలిపారు. బకాయిలు చెల్లించకపోతే రిలేనిరాహార దీక్ష కూడా చేస్తామని హెచ్చరించారు.
లక్ష్మీపురం ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సిఐ) గోడౌన్ల వద్ద గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పోరేషన్ (జివిఎంసి) రెవెన్యూ అధికారులు వినూతన రీతిలో నిరసన తెలిపారు. ఎఫ్సిఐ 2 కోట్ల రూపాయల ఆస్తి పన్ను ఎగవేసిందని అధికారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పన్ను బకాయిలు చెల్లించకపోతే త్వరలో రిలే దీక్షలు చేస్తామని జీవీఎంసీ రెవెన్యూ అధికారులు హెచ్చరించారు.
పన్నులు ఎగవేసినందుకు రెవెన్యూ అధికారులు నిరసన తెలపడం, బకాయిల కోసం రిలేదీక్ష చేస్తామని హెచ్చరించడం వింతగాలేదూ! అధికారులు ఈ విధంగా పన్నులు వసూలు చేయడం శుభపరిణామమే.