దోపిడీ సొమ్ముకు రాచబాట! | Strategy to pull back the Hawala money | Sakshi
Sakshi News home page

దోపిడీ సొమ్ముకు రాచబాట!

Published Tue, Dec 4 2018 5:21 AM | Last Updated on Tue, Dec 4 2018 5:21 AM

Strategy to pull back the Hawala money  - Sakshi

సాక్షి, అమరావతి :ఊరూ పేరు లేని ఓ అనామక కంపెనీ..లక్ష రూపాయల మూలధనంతో మొదలైన సంస్థ. ఎలాంటి ట్రాక్‌ రికార్డూ లేదు..అలాంటి కంపెనీ 70 వేల కోట్లతో ఓ భారీ రిఫైనరీ పెట్టడానికి ముందుకొచ్చింది.దానికి 5,000 ఎకరాలు కేటాయించబోతున్నారు..అంత పెట్టుబడి ఎక్కడిదంటే.. దుబాయ్‌ కంపెనీ సర్దుబాటు చేస్తోందని చెబుతోంది..అది ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ.. రిఫైనరీ పెట్టడమేమిటి? అయినా దానికంత సామర్థ్యం లేదు.. అలాంటి కంపెనీకి ఏం చూసి దుబాయ్‌ కంపెనీ సొమ్ము సర్దుబాటు చేస్తుంది?అసలు దుబాయ్‌ కంపెనీకైనా అంత సామర్థ్యం ఉందా మరి సర్కారు పెద్దలెందుకు అంత ఆసక్తి చూపిస్తున్నారు..?ఎందుకు హడావిడిగా ఎంఓయూ కుదుర్చుకుని భూములు సిద్ధం చేస్తున్నారు?ఇదంతా ఏదో మాయలా కనిపించడంలేదూ..అమరావతిలో కాజేసిన అవినీతి సొమ్ము హవాలా మార్గంలో దుబాయ్‌కి పంపించి తిరిగి ఇక్కడికి తీసుకొచ్చేందుకు సర్కారు పెద్దలు రంగం సిద్ధం చేస్తున్నారని, ఆ పేరుతో మరో ఐదువేల ఎకరాలకు టెండర్‌ పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి..

రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మరో భారీ కుంభకోణానికి రంగం సిద్ధం చేశారు. నాలుగున్నరేళ్లపాటు లక్షల కోట్లు వెనకేసిన సర్కారు పెద్దలు హవాలా మార్గంలో దుబాయ్‌ నుంచి ఓ 70 వేల కోట్లు వెనక్కి తెచ్చుకునేందుకు ‘రిఫైనరీ’ నాటకానికి తెరలేపారు. దాంతోపాటు అత్యంత విలువైన ప్రాంతంలో ఐదు వేల ఎకరాల భూమిని కాజేయడానికి స్కెచ్‌ వేశారు. ఎవరికీ పెద్దగా తెలియని, చిన్నచిన్న రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు చేసుకునే సంస్థలో దుబాయ్‌కి చెందిన అరబ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ వేలాది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం ఇప్పుడు అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ ఒప్పందం ఎన్నో అనుమానాలకు ఆస్కారం కల్గిస్తోంది. కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలో భారీ రిఫైనరీ ఏర్పాటు పేరుతో జరుగుతున్న తంతు ఇది..
బందరు వేదికగా..

కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని (బందరు) ప్రతిపాదిత ఓడరేవుకు దగ్గర్లో ఉన్న అత్యంత విలువైన ప్రాంతంలో ఐదువేల ఎకరాల భూములను నొక్కేయడానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పథక రచన చేశారు. ఇందులో భాగంగా పెద్దగా ప్రాచుర్యంలేని.. చిన్నచిన్న రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు చేసుకునే ఐరా ఇన్‌ఫ్రా వెంచర్స్‌ భారీ రిఫైనరీ కర్మాగారాన్ని నిర్మించేందుకు నిర్ణయించింది. ఈ సంస్థలో దుబాయ్‌కి చెందిన అరబ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ రూ. 70వేల కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. రిఫైనరీ రంగంలో ఏమాత్రం అనుభవంలేని ఐరా ఇన్‌ఫ్రాతో ఈ అరబ్‌ సంస్థ ఒప్పందం చేసుకోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దురుద్దేశాలు బట్టబయలయ్యాయి. అంతేకాదు.. ఈ ఒప్పందాన్ని నిశితంగా పరిశీలిస్తే అనేకానేక అనుమానాలకు ఆస్కారం కలిగించేలా ఉంది. రూ.వేల కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో రోజుకు 4,00,000 బ్యారెల్స్‌ సామర్థ్యం గల రిఫైనరీ ఏర్పాటుచేసే విధంగా ఏపీ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఏపీఈడీబీ)తో హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఐరా ఇన్‌ఫ్రా వెంచర్స్‌ జూలై 31, 2018లో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రిఫైనరీ వస్తే 1,50,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని, అందుకోసం 5,000 ఎకరాల భూమి అవసరమవుతుందని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. ఈ రిఫైనరీ కోసం ఐరా గ్రూపు, ఐకాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఎల్‌ఎల్‌సీ అనే సంస్థతో కలిసి ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయనుంది. అలాగే, ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధులను దుబాయ్‌కు చెందిన అరబ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథార్టీ (ఏఐడీఏ) సమకూర్చనున్నట్లు ఒప్పందంలో పేర్కొన్నారు. కానీ, అందులో పేర్కొన్న ఈ మూడు సంస్థలను పరిశీలిస్తే రిఫైనరీ పేరుతో జరుగుతున్న కుంభకోణాన్ని సులభంగానే అర్థం చేసుకోవచ్చు.

మూడూ అనామక కంపెనీలే..
కాగా, 2014లో ఐరా ఇన్‌ఫ్రా వెంచర్స్‌ లిమిటెడ్‌ను జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 56, హైదరాబాద్‌ చిరునామాతో ఏర్పాటుచేశారు. ముగ్గురు డైరెక్టరులు కలిసి లక్ష రూపాయల మూలధనంతో దీనిని స్థాపించారు. కానీ, ఈ  కంపెనీ ఏర్పాటుచేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా వార్షిక సర్వసభ్య సమావేశం జరిగిన దాఖలాల్లేవు.. బ్యాలెన్స్‌ షీటు వివరాలు లేవు.. ఆర్వోసీ దగ్గరా వివరాల్లేవు.. అసలు ఈ ఐరా గ్రూపు ఇంతవరకు ఎటువంటి భారీ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టును సైతం చేపట్టలేదు. ఇలాంటి చరిత్ర ఉన్న ఐరా, రిఫైనరీ రంగంలో ఇంత భారీ ప్రాజెక్టును ఏ విధంగా చేపడుతోందో అర్థం కావడంలేదని పరిశ్రమ శాఖ అధికార వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. ఐరా గ్రూపునకు రియల్‌ ఎస్టేట్, మైనింగ్, ఇన్‌ఫ్రా, పారిశ్రామిక పార్కులు, ఎనర్జీ రంగాల్లో అనుభవం ఉన్నట్లు ఒప్పందంలో పేర్కొన్నారని.. కనీసం ఈ సంస్థకు తమ అసోసియేషన్‌లో కూడా సభ్యత్వంలేదని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (‘క్రెడాయ్‌) అధికారులు స్పష్టం చేస్తున్నారు. అలాగే, ఒప్పందంలో పేర్కొన్న మరో కంపెనీ ఐకాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఎల్‌ఎల్‌సీకి సంబంధించి ఆర్వోసీలోగానీ, బయటగానీ ఎక్కడా ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. మరి ఇలా ఊరూ.. పేరు లేని సంస్థతో ఇంత భారీ ప్రాజెక్టుకు ఏర్పాటుచేయడానికి ఎస్పీవి (స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌) ఏర్పాటుచేస్తా అనగానే ఈడీబీ (ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు) ఎలా ఒప్పందం కుదుర్చుకుందో అర్థంకావడంలేదని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు నివ్వెరపోతున్నారు. 

ఏఐడీఏ కంపెనీకి అంత సీన్‌ ఉందా!?
భారీ రిఫైనరీ ప్రాజెక్టుకు అవసరమైన వేల కోట్ల రూపాయలను ఐరా ఇన్‌ఫ్రా వెంచర్స్‌కు సమకూర్చేందుకు  ముందుకొచ్చిన దుబాయ్‌కు చెందిన ఏఐడీఏ కంపెనీ పరిస్థితి అయితే మరింత ఘోరం. ఇంత భారీ పెట్టుబడులు పెట్టే కంపెనీ ఏఐడీఏ వెబ్‌సైట్‌ను ‘సాక్షి’ పరిశీలిస్తే ‘అండర్‌ రివిజన్‌’ అన్న మెసేజ్‌ దర్శనమిస్తోంది. సాధారణంగా ఏదైనా సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలు పంపితే ఆ సంస్థ పూర్వాపరాలు పరిశీలించిన తర్వాతే ఎంవోయూ కుదుర్చుకుంటారు. పైస్థాయి నుంచి ఒత్తిడి ఉండటంతో పూర్తి వివరాలు పరిశీలించలేదని, ఇంకా ఈ సంస్థ డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) సమర్పించలేదని అధికారులు చెబుతున్నారు. డీపీఆర్‌ ఇవ్వకపోయినా త్వరితగతిన భూ కేటాయింపులు చేయాలంటూ పైనుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోందంటూ అధికారులు వాపోతున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే.. హవాలా మార్గంలో ఇక్కడ నుంచి విదేశాలకు తరలించిన సొమ్మును దుబాయి ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీల పేరుతో డొల్ల కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో వెనక్కి తీసుకువస్తున్నట్లు అర్థమవుతోందని పలువురు చార్టర్డ్‌ అకౌంటెంట్లు స్పష్టంచేస్తున్నారు. 

ఈ ఏడాది జూలై 31న ఏపీ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డుకు, ఐరా ఇన్‌ఫ్రా వెంచర్స్‌కు మధ్య జరిగిన ఎంవోయూ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement