పల్లె ప్రజలపై ‘వీధి’ పోటు
* పంచాయతీల్లో ప్రజల నుంచి వసూలుకు ప్రభుత్వ నిర్ణయం
* ఇంటి పన్నుతో కలిపి రాబట్టాలని ప్రతిపాదనలు
* పంచాయతీరాజ్ ప్రతిపాదనలకు సీఎం ఆమోదం
* ఈ ఏడాది వసూలు లక్ష్యం... 78కోట్లు
* బిల్లు నిర్ణయం ఇలా... ఇంటి విస్తీర్ణం, పంచాయతీ స్థాయిలను బట్టి
* ఇప్పటివరకు బకాయిలు 800 కోట్లు
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లోని ప్రజలపై మరో విద్యుత్ భారం పడనుంది. గ్రామ పంచాయతీల్లోని వీధి దీపాల విద్యుత్ చార్జీలను ప్రజల నుంచే వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటి పన్నుతో కలిపి వీధి దీపాల విద్యుత్ పన్నును కూడా వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వ సూచన మేరకు పంచాయతీరాజ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పంచాయతీల్లో ఆదాయ వనరుల సమీకరణపై జరిగిన సమీక్షలో వీధి విద్యుత్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయం మేరకు ఇక నుంచి గ్రామ పంచాయతీలు వీధి దీపాల కరెంట్ బిల్లును గ్రామస్తుల నుంచి వసూలు చేయనున్నారు. ఇంటి విస్తీర్ణం, పంచాయతీ స్థాయిలను బట్టి ఒక్కో ఇంటికి ఎంత బిల్లు చెల్లించాలనేది నిర్ణయిస్తారు. దీనిని ఇంటి పన్నులోనే కలుపుతారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల నుంచి వీధి దీపాల చార్జీల పన్ను రూపేణా ఈ ఏడాది దాదాపు రూ. 78 కోట్లు వసూలు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇప్పటి వరకు ఏం జరుగుతోంది..
చిన్న పంచాయతీల్లోని వీధి దీపాలకు, మంచినీటి పథకాల నిర్వహణ కోసం వినియోగించే కరెంట్‌కు ఎలాంటి చార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయిస్తూ 1987లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం 44ను జారీ చేసింది. పెద్ద పంచాయతీల్లో వీధి దీపాల కరెంట్ చార్జీలను చాలా ఏళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తూ వస్తోంది. రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి గ్రామాలకు విడుదల చేయాల్సిన నిధులను ప్రభుత్వం నేరుగా విద్యుత్ శాఖకు చెల్లిస్తూ పంచాయతీలపై కరెంట్ బిల్లుల భారం లేకుండా చేస్తూ వస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తిరిగి బాధ్యతలు చేపట్టాక.. విద్యుత్ శాఖ 1987 జీవోకు భిన్నంగా మైనర్ పంచాయతీలలో వీధి దీపాల కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ చేసింది.
దాదాపు రూ. 612 కోట్లు బకాయిగా పేర్కొంది. దీంతోపాటు పెద్ద పంచాయతీల విద్యుత్ బిల్లు బకాయిలను కలిపి దాదాపు రూ. 800 కోట్లు వసూలుకు ఆయా గ్రామ పంచాయతీలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కొన్ని గ్రామ పంచాయతీల్లో మంచినీటి పథకాలకు విద్యుత్ శాఖ సరఫరా నిలిపివేసింది. ఈ వివాదం నేపథ్యంలో పాత బకాయిల వసూలుకు పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల మధ్య చర్చలు నడుస్తుండగానే.. ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి గ్రామ పంచాయతీ వీధి దీపాలకు వినియోగించే కరెంట్ బిల్లులను తప్పనిసరిగా చెల్లించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత నాలుగు నెలలుగా పంచాయతీ సర్పంచ్‌లు ఇతర అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సిన నిధులను మళ్లించి వీధి దీపాల చార్జీల కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.