panchayatiraj
-
పశ్చిమబెంగాల్ మంత్రి సుబ్రతా ముఖర్జీ కన్నుమూత
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి సుబ్రతా ముఖర్జీ (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎస్ఎస్కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. వారం రోజుల క్రితం శ్వాస సంబంధమైన సమస్య తలెత్తడంతో ఆస్పత్రికి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విన్న వెంటనే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆస్పత్రికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. మమత మంత్రి వర్గంలో ఆయన కీలక మంత్రిగా పనిచేశారు. పంచాయతీరాజ్ శాఖ సహా పలు ఇతర శాఖలను బాధ్యతలను కూడా నిర్వర్తించారు. ఆయన మరణం పట్ల మమత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ముఖర్జీ మరణం తమకు తీరని లోటని మమతా బెనర్జీ అన్నారు. చదవండి: (అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం) -
‘స్థానిక’ పగ్గాలు అదనపు కలెక్టర్లకే..
సాక్షి, హైదరాబాద్: కొత్తగా సృష్టించిన అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు) విధుల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. స్థానిక సంస్థల నిర్వహణ బాధ్యతను పూర్తిగా వీరికి కట్టబెట్టింది. మండల, జిల్లా పరిషత్ మినహా గ్రామ పంచాయతీలు, పురపాలికలపై పూర్తిస్థాయి అజమాయిషీ అప్పగించిన ప్రభుత్వం.. విధానపరమైన నిర్ణయాలు, సిబ్బంది, పాలకవర్గాలపై చర్యలు తీసుకునే అధికారం మాత్రం కలెక్టర్లకు సంక్రమింపజేసింది. మండల, జిల్లా పరిషత్‌లు ప్రస్తుతం ఉన్న తరహాలోనే జిల్లా పరిషత్ సీఈవో పర్యవేక్షణలో పనిచేస్తాయి. పంచాయతీరాజ్, పురపాలక చట్టాలను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రతి రోజూ గ్రామాలు, మున్సిపాలిటీల్లో పర్యటించాలని జాబ్ చార్ట్ లో పొందుపరిచింది. దీనిపై అధికారికంగా ఇప్పటివరకు ఉత్తర్వులు రానప్పటికీ, మంగళవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్ ఈ మేరకు వెల్లడించినట్లు తెలిసింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణ, పారిశుద్ధ్యం, హరితహారం, నర్సరీల నిర్వహణ, మొక్కల సంరక్షణ బాధ్యతలను వీరికి అప్పగించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఉద్యోగులపై వచ్చే ఫిర్యాదులపై విచారణ జరపడం వరకే పరిమితం చేసిన ప్రభుత్వం.. చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు కట్టబెట్టింది. ఇకపై పంచాయతీ కార్యదర్శి మొదలు డీపీవో, మున్సిపల్ కమిషనర్లు కూడా అదనపు కలెక్టర్ పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది. కలెక్టరంటే రాజమణిలా ఉండాలి... పంచాయతీరాజ్, పురపాలక చట్టాలను ఆకళింపు చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అదనపు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించడం ద్వారా ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. ‘నా చిన్నతనంలో రాజమణి అనే కలెక్టర్ ఉండేవారు. ఆయనకు ప్రజలు దండం పెట్టేవారు. ఆయన సేవలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. మీరు కూడా వినూత్నంగా పనిచేసి గొప్ప అధికారిగా రాణించాలి’అని సీఎం సూచించారు. -
పీఆర్ ఇంజనీరింగ్ సంఘం రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
సాక్షి, హన్మకొండ: తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోషియేషన్ రాష్ట్ర కొత్త కార్యవర్గం ఎన్నికైంది. హన్మకొండలో శనివారం రాత్రి రాష్ట్ర సర్వసభ్య భేటీ తర్వాత రాష్ట్ర కమిటీ ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ అనంతరం అర్ధరాత్రి ఫలితాలు ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా డి.సూర్యప్రకాశ్, ఉపాధ్యక్షులుగా జి.నరేంద్రప్రసాద్, ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా డి.వెంకట్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా ఎ.శ్రీదేవి, వి.సుధీర్‌కుమార్, టెక్నికల్ సెక్రటరీగా కె.విద్యాసాగర్, జోనల్ సెక్రటరీలుగా కె.ప్రకాశ్, ఎం.బి.రేణుక, కోశాధికారిగా కె.రాజశేఖర్ ఎన్నికయ్యారు. -
3,285 కిలో మీటర్లు
సాక్షి, అమరావతి: ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)లో కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 3,285 కిలో మీటర్ల పొడవున కొత్తగా గ్రామీణ లింకు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అయ్యే వ్యయంలో 60 శాతం కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. పీఎంజీఎస్‌వై మూడో దశ అమలులో భాగంగా కేంద్రం దేశవ్యాప్తంగా లక్షా 25 వేల కిలోమీటర్ల గ్రామీణ లింకు రోడ్ల నిర్మాణానికి ముందుకొచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి 3,285 కిలోమీటర్ల పొడవు రోడ్లను మంజూరు చేసింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ జిల్లాల వారీగా పనులు గుర్తించే ప్రక్రియ మొదలైందని ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సుబ్బారెడ్డి చెప్పారు. పనుల గుర్తింపు ప్రక్రియతో పాటు ఆయా పనుల నిర్మాణానికి అయ్యే అంచనాలను కూడా సిద్దం చేయాలని జిల్లా ఎస్ఈలను ఆదేశించినట్టు తెలిపారు. 13 జిల్లాల్లో దాదాపు 650 కొత్త రోడ్లు ఈ కార్యక్రమంలో చేపట్టే అవకాశం ఉందన్నారు. మొత్తం రూ.1,971 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేస్తున్నామని.. ఇందులో రూ.1,314 కోట్లు కేంద్రం మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. అక్టోబరు 15 కల్లా పనుల అంచనాలతో కూడిన ప్రతిపాదనలను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ కేంద్రానికి పంపనుంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మరో 535 కిలోమీటర్ల పనులు రాష్ట్రంలో తీవ్రవాద ప్రభావిత జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో మరో 535 కిలోమీటర్ల రోడ్డు పనులు కూడా మంజూరయ్యాయి. ఈ ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా 4 జిల్లాల్లో 62 రోడ్డు పనులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ కొత్తగా చేపడుతుంది. ఇందులో విశాఖ జిల్లాకే 44 పనులు మంజూరయ్యాయి. రూ.320 కోట్లు ఖర్చు అవుతుందని పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ఇందులో రూ.192 కోట్లు కేంద్రం రాష్ట్రానికి నిధులిస్తోంది. -
పదోన్నతుల్లో 20 ఏళ్లుగా అవమానం
– జెడ్పీ ఏఓగా అవకాశం కల్పించాలని మహిళా ఎంపీడీఓలు ఆవేదన కర్నూలు సిటీ: పంచాయతీరాజ్ శాఖలో 20 ఏళ్లుగా పదోన్నతులు, బదిలీలలో అవమానాలకు గురవుతున్నామని మహిళా ఎంపీడీఓలు మంగళవారం జెడ్పీ చైర్మెన్ మల్లెల రాజశేఖర్, సీఈఓ బీఆర్ ఈశ్వర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటి వరకు జెడ్పీ ఏఓగా పని చేసిన భాస్కర్ నాయుడు ఇటీవల నంద్యాల మున్సిపల్ కమిషనర్‌గా డిప్యూటేషన్‌పై బదిలీ కాగా ఆయన స్థానంలో ఆలూరు ఎంపీడీఓ మధు భూషణ్‌రావుకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఈ నియమాకంపై మహిళా ఎంపీడీఓలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 1996లో నేరుగా నియామకమైన ఎంపీడీఓలను వదిలేసి ఈఓఆర్డీ నుంచి ఎంపీడీఓగా పదోన్నతిపై పొందిన వారిని ఏఓగా ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. సీనియార్టీ జాబితా తయారు చేయడంలో చోటుచేసుకున్న అవకతవకలతో మహిళలకు అన్యాయం జరుగుతుందన్నారు. పంచాయతీరాజ్ శాఖ నిబంధనల ప్రకారమే ఏఓను నియమించామని చైర్మెన్ తెలిపారు. మరోసారి పీఆర్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి క్లారిటీ తీసుకుని అర్హులకు న్యాయం చేస్తామని హామినిచ్చారు. చైర్మెన్, సీఈఓను కలిసిన వారిలో ఎంపీడీఓలు వరలక్ష్మి, సువర్ణలత, క్యాథరిన్, విజయలక్ష్మి, మల్లేశ్వరి ఉన్నారు. -
పల్లె ప్రజలపై ‘వీధి’ పోటు
* పంచాయతీల్లో ప్రజల నుంచి వసూలుకు ప్రభుత్వ నిర్ణయం * ఇంటి పన్నుతో కలిపి రాబట్టాలని ప్రతిపాదనలు * పంచాయతీరాజ్ ప్రతిపాదనలకు సీఎం ఆమోదం * ఈ ఏడాది వసూలు లక్ష్యం... 78కోట్లు * బిల్లు నిర్ణయం ఇలా... ఇంటి విస్తీర్ణం, పంచాయతీ స్థాయిలను బట్టి * ఇప్పటివరకు బకాయిలు 800 కోట్లు సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లోని ప్రజలపై మరో విద్యుత్ భారం పడనుంది. గ్రామ పంచాయతీల్లోని వీధి దీపాల విద్యుత్ చార్జీలను ప్రజల నుంచే వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటి పన్నుతో కలిపి వీధి దీపాల విద్యుత్ పన్నును కూడా వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వ సూచన మేరకు పంచాయతీరాజ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పంచాయతీల్లో ఆదాయ వనరుల సమీకరణపై జరిగిన సమీక్షలో వీధి విద్యుత్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయం మేరకు ఇక నుంచి గ్రామ పంచాయతీలు వీధి దీపాల కరెంట్ బిల్లును గ్రామస్తుల నుంచి వసూలు చేయనున్నారు. ఇంటి విస్తీర్ణం, పంచాయతీ స్థాయిలను బట్టి ఒక్కో ఇంటికి ఎంత బిల్లు చెల్లించాలనేది నిర్ణయిస్తారు. దీనిని ఇంటి పన్నులోనే కలుపుతారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల నుంచి వీధి దీపాల చార్జీల పన్ను రూపేణా ఈ ఏడాది దాదాపు రూ. 78 కోట్లు వసూలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఏం జరుగుతోంది.. చిన్న పంచాయతీల్లోని వీధి దీపాలకు, మంచినీటి పథకాల నిర్వహణ కోసం వినియోగించే కరెంట్‌కు ఎలాంటి చార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయిస్తూ 1987లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం 44ను జారీ చేసింది. పెద్ద పంచాయతీల్లో వీధి దీపాల కరెంట్ చార్జీలను చాలా ఏళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తూ వస్తోంది. రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి గ్రామాలకు విడుదల చేయాల్సిన నిధులను ప్రభుత్వం నేరుగా విద్యుత్ శాఖకు చెల్లిస్తూ పంచాయతీలపై కరెంట్ బిల్లుల భారం లేకుండా చేస్తూ వస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తిరిగి బాధ్యతలు చేపట్టాక.. విద్యుత్ శాఖ 1987 జీవోకు భిన్నంగా మైనర్ పంచాయతీలలో వీధి దీపాల కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. దాదాపు రూ. 612 కోట్లు బకాయిగా పేర్కొంది. దీంతోపాటు పెద్ద పంచాయతీల విద్యుత్ బిల్లు బకాయిలను కలిపి దాదాపు రూ. 800 కోట్లు వసూలుకు ఆయా గ్రామ పంచాయతీలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కొన్ని గ్రామ పంచాయతీల్లో మంచినీటి పథకాలకు విద్యుత్ శాఖ సరఫరా నిలిపివేసింది. ఈ వివాదం నేపథ్యంలో పాత బకాయిల వసూలుకు పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల మధ్య చర్చలు నడుస్తుండగానే.. ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి గ్రామ పంచాయతీ వీధి దీపాలకు వినియోగించే కరెంట్ బిల్లులను తప్పనిసరిగా చెల్లించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత నాలుగు నెలలుగా పంచాయతీ సర్పంచ్‌లు ఇతర అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సిన నిధులను మళ్లించి వీధి దీపాల చార్జీల కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.