అదనపు బలగాల రాక
సూచనప్రాయంగా సర్కారు అంగీకారం
సీఎం రాగానే ఫైలుకు కదలిక
అధికారుల ఆశాభావం పోలీస్ కష్టాలు తీరినట్టే
రాజధాని పోలీస్ కష్టాలు త్వరలో తీరనున్నాయి. విజయవాడ పోలీసు కమిషనరేట్‌కు అదనపు బలగాలు సమకూరనున్నాయి. ఇందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని కమిషనరేట్ అధికారులకు వర్తమానం అందింది. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే అదనపు బలగాల ప్రతిపాదన ఫైలు కదిలే అవకాశం ఉన్నట్టు తెలిసింది. దీనికి ఆమోదం లభించిన పక్షంలో రాజధాని పోలీసింగ్‌ను పకడ్బందీ చేసేందుకు అవకాశం ఉంటుంది.
విజయవాడ సిటీ : విజయవాడ రాజధానిగా మారిన తర్వాత పోలీసు అధికారులు, సిబ్బంది తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. ఉన్న అధికారులు బందోబస్తు సహా అన్ని విధులను నిర్వర్తించాల్సివస్తోంది. ముఖ్యమంత్రి ఇక్కడే ఉంటున్నారు. రోజుకు అరడజను మందికి పైగా మంత్రుల రాకపోకలు జరుగుతున్నాయి. వీరు పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో బందోబస్తు, ట్రాఫిక్ విధుల నిర్వహణ పోలీసులకు కత్తిమీద సాములా మారింది. పైగా నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా పోలీసులకు తీరిక లేకుండా చేస్తున్నాయి. వీఐపీలు, వీవీఐపీలు వచ్చిన సమయాల్లో ముందు, తర్వాత బందోబస్తు విధులు పెద్ద సంఖ్యలో చేపట్టాల్సి వస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయం భద్రత కోసం పొరుగు జిల్లాల పోలీసులు ఉన్నప్పటికీ.. నగరంలో జరిగే కార్యక్రమాలకు ముఖ్యులు, అతి ముఖ్యులు వెళ్లినప్పుడు పోలీసులే విధులు నిర్వహిస్తున్నారు. పైగా రోజువారీ విధులు కూడా ఉండడంతో సిబ్బంది తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. బందోబస్తు తదితర విధులను సమన్వయం చేసుకోవడం సిటీ స్పెషల్ బ్రాంచి అధికారులకు తలకుమించిన భారంగా పరిణమించింది.
ముగ్గురే ఐపీఎస్‌లు
అదనపు డీజీ హోదాలో నగర పోలీసు కమిషనర్‌తోపాటు ఇద్దరు డీసీపీలు మాత్రమే ఐపీఎస్ అధికారులు. అదనపు ఎస్పీలు ముగ్గురు, 12మంది ఏసీపీలు, 45 మంది ఇన్‌స్పెక్టర్లు, 120 మంది ఎస్‌ఐలు ఉండగా, ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్ సహా హోంగార్డులతో కలుపుకొని ఉన్న సిబ్బంది సంఖ్య 3000 మాత్రమే. పెరుగుతున్న జనాభా, పెరిగిన వాహనాలు, రాజధాని సమస్యల నేపథ్యంలో ఇప్పుడున్న పోలీసు అధికారులు, సిబ్బంది ఏమాత్రం సరిపోరు. ఉన్న సిబ్బందితోనే అధికారులు ప్రయాసపడి విధులు నెట్టుకొస్తున్నారు.
మరికొందరు ఐపీఎస్‌లు కావలెను
రాజధాని ప్రతిపాదనల్లో భాగంగా కనీసం మరో ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులు కావాలి. ఇదే సమయంలో అదనపు ఎస్పీలు, డీఎస్పీల సంఖ్యతో పాటు పోలీసు సిబ్బందిని పెంచాలి. అదనంగా సిటీ సెక్యూరిటీ వింగ్‌ను ఏర్పాటుచేయాలి. గత కొన్ని నెలలుగా నగర పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయమై పలుమార్లు ప్రతిపాదనలు పంపారు. కారణాలు ఏమైనప్పటికీ ప్రతిపాదనల అమలులో జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలోనే కమిషనరేట్ అధికారుల ప్రతిపాదనలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిసి అధికారులు ఉత్సాహంగా ఉన్నారు. సిటీ స్పెషల్ బ్రాంచి, క్రైం, ట్రాఫిక్ విభాగాలను పటిష్టం చేయడంతో పాటు వీఐపీలు, వీవీఐపీల భద్రత సులభ సాధ్యమవుతుందనేది కమిషనరేట్ అధికారుల అభిప్రాయం.
కమిషనరేట్ బలోపేతం
Published Thu, Jan 21 2016 1:55 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement