వీడ్కోలు విందు సొమ్ము స్వాహా
ఆనక వేడుకకు ఇండెంట్లు
కమిషనరేట్‌లో చర్చ
విజయవాడ సిటీ : చెయ్యి తడిపితే చాలు ఎంతటి పనైనా చిటికెలో చేసేసే నగరంలోని కొందరు పోలీస్ అధికారులు చివరకు విందు భోజనాల ఇండెంట్ సొమ్మునూ వదల్లేదు. బదిలీపై వెళ్లే పోలీ సుల వీడ్కోలు ‘విందు’ కోసం ఉన్నతాధికారులు మంజూరుచేసిన సొమ్మును భోంచేశారు. చివరికి ఉన్నతాధికారుల ఆదేశాల అమలుకు తమ పరిధిలోని కొందరికి ‘ఇండెంట్లు’ వేసి (చోటామోటా నాయకులు, వ్యాపారుల నుంచి డబ్బు వసూలు చేయడం) విందు భోజ నాలు ఏర్పాటుచేసినట్టు తెలిసింది. అదేమంటే అసలు డబ్బులు ఇవ్వలేదని కొందరు.. ఇచ్చిన సొమ్ము చాల్లేదని మరికొందరు ఇండెంట్ల బాట పట్టి విందు భోజనాలు ముగించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా తమ కు ఇష్టులైన (జనరల్ డ్యూటీ) కానిస్టే బుళ్లతో వ్యవహారం నడిపించారు. బాస్ చెప్పిందే తడువు వసూళ్లకు తెగబడటంతో సిబ్బందికి విషయం తెలిసి ముక్కున వేలేసుకున్నారు. సొంత సిబ్బందికి ఖర్చు పెట్టమంటూ అధికారులు ఇచ్చిన సొమ్మును జేబులో వేసుకున్న అధికారుల వైనంపై పోలీసులు చర్చించుకుంటున్నారు. ఒకరిద్దరు అధికారులు మినహా మెజారిటీ అధికారులు విందు కోసం ఇచ్చిన సొమ్మును స్వాహా చేశారనేది పోలీస్ వర్గాల సమాచారం.
ఇదీ జరిగింది
గతనెల ఆఖరి వారంలో కమిషనరేట్‌లో పనిచేస్తున్న 18మంది ఎస్‌ఐలు సహా 280మంది బదిలీ అయ్యారు. వీరిలో ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. వీరందరికీ చిరు సత్కరాలు చేసి పంపాలని, వచ్చే వారిని సాదరంగా ఆహ్వానించాలని పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు ఆదేశించారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బందికి భోజనాలు కూడా ఏర్పాటు చేయాలంటూ ఒక్కో పోలీస్‌స్టేషన్‌కి రూ.20వేలు మంజూరు చేశారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ వల్ల స్టేషన్లలో సుహృద్భావ పరిస్థితులు నెలకొని సిబ్బందిలో ఐక్యత ఉంటుందనేది ఆయన అభిప్రాయం. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని శాంతిభద్రతలు, ట్రాఫిక్, క్రైం సహా అన్ని విభాగాలకు ఈ మొత్తాలను అందించారు.
మరేం జరిగింది
పోలీస్ ఉన్నతాధికారులు ఇచ్చిన మొత్తాలను కొందరు ఎస్‌హెచ్‌వో (స్టేషన్ అధికారులు) గుట్టుచప్పుడు కాకుండా జేబులో వేసుకున్నారు. బదిలీ జరిగిన వాళ్లు వెళ్లకపోవడం, రావాల్సిన వాళ్లు రాకపోవడం వంటి కారణాలను సాకుగా చూపించి రోజులు నెట్టుకొచ్చారు. ఉన్నతాధికారులు ఆగ్రహించడంతో కొందరు హడావుడి చేసి విందు భోజనాలను ‘మమ..’ అనిపించారు. మరికొం దరు అధికారులు సీపీ బదిలీపై వెళ్లేంత వరకు కాలయాపన చేశారు. ఆ తర్వాత తమకు డబ్బులు ఇవ్వలేదని కొందరు అధికారులు ప్రచారం చేసి స్థానికంగా పోలీసుల అవసరాలు ఉండే చోటామోటా నేతలు, వ్యాపారులకు ఇండెంట్లు వేసి వసూళ్లకు పాల్పడ్డారు. సెంట్రల్ జోన్‌లోని ఓ స్టేషన్ అధికారి డబ్బులు ఇవ్వలేదని ప్రచారం చేశాడు. ఆ కారణం చూపించి తన అనుచరుడి ద్వారా భారీగానే వసూలు చేయించినట్టు చెబుతున్నారు. విష యం చర్చకు దారితీయడంతో తనకు రూ.10వేలు మాత్ర మే ఇచ్చారంటూ సన్నాయి నొక్కులు ప్రారంభించారు. ఇదే రీతిలో మరికొందరు అధికారులు కూడా ఉన్నారు. ఇంకొందరు మాత్రం కమిషనరేట్ నుంచి వచ్చిన మొత్తాన్ని సిబ్బందికి అందజేసి మరికొంత తామివ్వడం ద్వారా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.
మింగేశారు!
Published Fri, Jul 17 2015 1:05 AM | Last Updated on Mon, Oct 1 2018 5:14 PM
Advertisement