కారు నుంచి మంటలు వస్తున్న దృశ్యం, (ఇన్‌సెట్‌లో) మృతి చెందిన ఇస్మాయిల్
⇒ కొడుకును సౌదీ పంపేందుకు వెళుతూ తండ్రి మృతి
⇒ మేడ్చల్ ఓటర్ రింగ్‌రోడ్డుపై ఘటన
⇒ 10 మందికి తీవ్రగాయాలు
⇒ ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమం
నిజామాబాద్ క్రైం: సౌదీ వెళ్తున్న కొడుకు అతడి కుటుంబానికి వీడ్కోలు చెప్పేందుకు వెళ్తున్న ఓ తండ్రికి ఆ కుటుంబమే శాశ్వతంగా వీడ్కోలు పలకాల్సి వచ్చింది. మరో గంటలో క్షేమంగా శంషాబాద్‌కు చేరుకోవాల్సిన ఆ కుటుంబం ఆస్పత్రి పాలై చికిత్స పొందుతోంది. ప్రమాదంలో ఇంటిపెద్ద మృతిచెందగా, కొడుకు, అతడి భార్య, వారి ముగ్గురు పిల్లలకు గాయాల పాలయ్యారు.
వారిలో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద వార్తను తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని ‘యూ అల్లాహ్..ఎంత పనిచేశావంటూ’ రోదించిన తీరు స్థానికుల చేత కంటతడి పెట్టించింది. జిల్లా కేంద్రంలోని దారుగల్లి (అజాంరోడ్డు)లో లారీడ్రైవర్‌గా పనిచేసే ఎండీ ఇస్మాయిల్ (60) కొడుకు మహమ్మద్ అన్వర్‌ఖాన్ కుటుం బంతో సహా సౌదీలో కొంతకాలంగా ఉంటున్నాడు.
కొద్ది రోజుల క్రితం సౌదీ నుంచి ఇంటికి వచ్చిన అన్వర్ బుధవారం రాత్రి తిరిగి వెళ్లేందుకు భార్యాపిల్లలతో పాటు తండ్రి ఇస్మాయిల్‌ను తీసుకుని ఎపీ 25 ఏక్యూ 8419 నంబరు గల క్వాలీస్‌లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు పయనమయ్యారు. ఇంటి నుంచి బయలుదేరిన వారు మేడ్చల్ వద్ద ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డుపైకి రాగానే శంషాబాద్ నుంచి హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన వ్యాపార వేత్త వెంకటేశ్వర్లు తన ఐ 20 కారులో వేగంగా వస్తూ డివైడర్‌ను ఢీకొట్టాడు.
దీంతో కారు రోడ్డు అవతలివైపు వచ్చి అన్వర్ కుటుంబ సభ్యులు వెళ్తున్న క్వాలీస్‌ను ఢీకొట్టింది. అంతేకాకుండా కారులో మంటలు చెలరేగి కారులో ఉన్న వెంకటేశ్వర్లుకు అంటుకున్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకుని అతడిని కారులోంచి బయటికి లాగారు. కారు ఢీకొనడంతో క్వాలీస్‌లో ఉన్న ఇస్మాయిల్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందా డు. అన్వర్ భార్యతో పాటు కుమార్తెలు షాహిస్తా(5), అయూషా దానియా(18 నెలలు), జునేదా ఫాతిమా( నెలన్నర వయస్సు)కు తీవ్ర గాయాలవగా, డ్రైవర్ అయూబ్‌కాన్‌కు స్వల్ప గాయూలయ్యూయి. గమనించిన స్థానికులు వీరిని హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇస్మాయిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
భర్త ఫోన్ చేస్తాడని...
కొడుకు కోడలు, మనుమరాళ్లను తీసుకెళ్లిన తన భర్తఫోన్ చేస్తాడెమోనని ఎదురు చూస్తున్న ఇస్మాయిల్ భార్య తన భర్త ఇక లేడని వార్త తెలిసే సరికి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పిల్లలు విమానం ఎక్కిన తర్వాత ఫోన్ చేస్తాడని భర్త ఫోన్ కోసం ఎదురు చూస్తున్న ఆమెకు ఇస్మాయిల్ చనిపోయాడనే వార్తను ఫోన్‌లో వినే సరికి కన్నీరుమున్నీరుగా విలపించింది. కడసారి చూపు కోసం ప్రైవేట్ వాహనంలో గాంధీ ఆస్పత్రికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. మేడ్చల్ సిఐ శంశాక్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. గురువారం ఇస్మాయిఅంత్యక్రియలు నిర్వహించనున్నారు.