
సమ్మె కొనసాగింపు : అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా సమ్మె యథావిధిగా కొనసాగించాలని ఉద్యోగ, కార్మిక సంఘాలతో కూడిన జేఏసీ నిర్ణయించింది. ఈనెల 19 వరకు కార్యాచరణ నిర్ణయించింది. ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు అధ్యక్షతన సంఘ కార్యాలయంలో ఆదివారం జేఏసీ సమావేశం జరిగింది. భేటీ అనంతరం ఏపీఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఈయూ సమైక్యాంధ్ర పోరాట కమిటీ చైర్మన్ సి.హెచ్.చంద్రశేఖరరెడ్డి, కన్వీనర్ దామోదరరావు, ఎన్‌ఎంయూ నేతలు ప్రసాద్, రమణారెడ్డి, జూనియర్ లెక్చరర్ల జేఏసీ చైర్మన్ రవి తదితరులతో కలిసి అశోక్‌బాబు విలేకరులతో మాట్లాడారు. సమ్మె చేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు పూర్తి మద్దతు ప్రకటించారు. రాజీనామాలు చేయకుండా విభజనను అడ్డుకుంటామంటూ ప్రగల్భాలు పలికిన సీమాంధ్ర ఎంపీల నిజ స్వరూపాలు ప్రజలకు తెలిశాయని, ఎంపీలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలను సాంఘిక బహిష్కరణ చేయాలన్న న్యాయవాదుల జేఏసీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అన్ని పార్టీల ఎంపీలు ప్రజలను మోసం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ప్రజలకు విధేయులుగా ఉండకుండా, అధిష్టానానికి విధేయులుగా ఉన్నారని విమర్శించారు.
ఎమ్మెల్యేలు హామీ ఇవ్వాలి
‘ఎంపీలు ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేల వంతు వచ్చింది. శాసనసభలో తెలంగాణ తీర్మానానికి వ్యతిరేకంగా వారు అభిప్రాయం చెప్పాలి. రాజకీయాలను పక్కనబెట్టి ప్రజల ఆకాంక్షల మేరకు నడుచుకుంటామని భరోసా ఇవ్వాలి. ఉద్యోగులు నిర్వహించే సమావేశాల్లో ఈమేరకు బహిరంగంగా హామీ ఇవ్వాలి’ అని అశోక్‌బాబు కోరారు. రాజమండ్రిలో ఉద్యోగులపై దాడి చేసిన కేసులో ఎంపీ హర్షకుమార్ కుమారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయనగరంలో రాజకీయ అరాచకం ఆపకపోతే ఎదురుదాడి తప్పదని హెచ్చరించారు. రాజమండ్రి, విజయనగరం ఘటనలపై విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంను కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ దసరా పండుగ చేసుకోకూడదని ఉద్యోగులు నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆహ్వానం మేరకు మంత్రివర్గ ఉపసంఘం భేటీకి వెళతాం.. కానీ చర్చలు జరపమని చెప్పారు. ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తామన్నారు. ఉద్యమంలో అసువులు బాసినవారి కుటుంబాలను ఆదుకుంటామన్నారు. రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన బాపయ్య చిత్రపటానికి ఉద్యోగ సంఘాల నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఇదీ కార్యాచరణ..
8, 9 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల దిగ్బంధం
10, 11, 12న ఎమ్మెల్యేల నుంచి బహిరంగ హామీ తీసుకోవడానికి సీమాంధ్ర జిల్లాల్లో సభలు, సమావేశాలు
13,14ల్లో దసరా పండుగ ఉన్నందున కార్యక్రమాలేమీ లేవు
15న విభజన వల్ల జరిగే నష్టాలను వివరించడానికి అన్ని మండలాల్లో రైతులతో సదస్సులు
16న బక్రీద్ సందర్భంగా కార్యక్రమాలు లేవు
17, 18, 19న కేంద్ర కార్యాలయాలు, బ్యాంకుల దిగ్బంధం