రాజకీయాల్లోకి రావాల్సి వస్తుందేమో.. అశోక్‌బాబు | We consider enter into politics, says Ashok Babu | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి రావాల్సి వస్తుందేమో.. అశోక్‌బాబు

Published Sat, Nov 2 2013 5:01 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM

We consider enter into politics, says Ashok Babu

స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటున్న బీజేపీ.. సమైక్యరాష్ట్రంపై వైఖరేమిటి
 అసెంబ్లీ తీర్మానం లేకుంటే  మిలియన్ మార్చ్ చేస్తాం: అశోక్‌బాబు

 

సాక్షి, గుడివాడ, విజయవాడ: జీతాల కోసం కాదు.. మా బిడ్డల జీవితాల కోసం ఉద్యమిస్తున్నామన్న సంగతిని తాము రుజువు చేయడంతో అనేక ప్రాంతాల్లోని ప్రజలు తనను రాజకీయాల్లోకి రావాలని కోరారని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు  అశోక్‌బాబు చెప్పారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు, అవకాశవాద నాయకులను చూస్తుంటే రాజకీయాల్లోకి రావాలన్న ప్రజల సూచనను మన్నించాల్సి వస్తుందేమోనని పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో శుక్రవారం రాత్రి జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరక్కుండా అడ్డుకోవాల్సిన ఎంపీలు, రాజకీయ పార్టీల చేతకానితనం వలనే రైతుల కోసం, ప్రజల కోసం ఉద్యోగులు ఉద్యమబాట పట్టాల్సి వచ్చిందని చెప్పారు. విభజన ప్రక్రియను తాము 2014 వరకు ఆపగలమని, ఎన్నికల్లో ఓటేసేటప్పుడు మీరు తప్పుచేస్తే వందమంది అశోక్‌బాబులు వచ్చినా రాష్ట్ర విభజన అడ్డుకోలేరని హెచ్చరించారు. ఈసారి జరిగే పీపుల్స్ రివల్యూషన్ (ప్రజల తిరుగుబాటు) ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తుందని, రాజకీయ పార్టీల చరిత్రనే మార్చేస్తుందని అన్నారు. చంద్రబాబు సమైక్యాంధ్రకు సై అనకపోతే రాజకీయ భవిష్యత్ ఉండదని హెచ్చరించారు. విభజనపై అసెంబ్లీలో తీర్మానం తేకపోతే కోటిమందితో హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ నిర్వహించి ఢిల్లీ పెద్దలనే ఇక్కడికి రప్పిస్తామని సవాల్ చేశారు.
 
 హైదరాబాద్ తెలంగాణకిస్తే.. ఢిల్లీని యు.పి.కి ఇస్తారా..
 రాష్ట్ర విభజనను తెలంగాణ ప్రజాప్రతినిధులు కోరుకుంటున్నారని, అంతమాత్రాన రాజధాని హైదరాబాద్ అక్కడుందని ఆ ప్రాంతానికి ఇస్తారా.. అని ప్రశ్నించారు. అలాంటప్పుడు ఢిల్లీని ఉత్తరప్రదేశ్‌కు ఇచ్చేస్తారా అని నిలదీశారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటూ బీజేపీ నినదిస్తోందని, సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని ముక్కలు చేయడమేనా మీ యూనిటీ నినాదం అని ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి మోడీని ప్రశ్నించారు. సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యే రాజకీయ పార్టీలు సమైక్య రాష్ట్రం ఉంచాలన్న ఏకవాక్య తీర్మానాన్ని ఇవ్వాలని కోరారు. ఈ నెల 10, 11, 12 తేదీల్లో  ఉద్యోగ సంఘాల జె.ఎ.సి. నేతలంతా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని, జాతీయ పార్టీల నాయకులను కలిసి విభజన వలన కలిగే నష్టాన్ని మరోమారు వివరిస్తామని చెప్పారు.  
 
 విభజన అంశాన్ని రోడ్డుపై తేలుస్తారా?:‘అఖిలపక్షం మంచి సంప్రదాయం కాదు. పార్టీల అభిప్రాయాన్నే పరిగణనలోకి తీసుకునేటట్లయితే పార్లమెంట్, అసెంబ్లీలు ఎందుకు, వాటిని రద్దు చేస్తే సరిపోతుంది’ అని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ అశోక్‌బాబు పేర్కొన్నారు. పార్లమెంట్, అసెంబ్లీలను కాదని సమస్యను రోడ్డుపై సెటిల్ చేస్తారా అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement