16 నుంచి సమ్మె ఉధృతం: అశోక్బాబు
హైదరాబాద్: సమైక్యాంధ్ర కోసం ఈనెల 16 నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఎపి ఎన్జిఓల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు హెచ్చరించారు. ఈనెల 13న 13 జిల్లాల్లో కేంద్రప్రభుత్వ కార్యాలయాల దిగ్బంధం చేస్తామన్నారు. 15న ఏపీఎన్జీవోల సమావేశం, 16న హైదరాబాద్‌లో ఉద్యోగ సంఘాల విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
ఒకటీ రెండు ఘటనలు మినహా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతమైందన్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం ద్వారా సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదని చెప్పారు. తిరిగి వెళ్తున్న ఉద్యోగులపై ప్రణాళిక ప్రకారమే దాడులు జరిగాయన్నారు. పోలీస్ ఎస్కార్ట్ వాహనం ఉన్నప్పటికీ ఉద్యోగులపై దాడులు చేశారని చెప్పారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కలుస్తామన్నారు.
తెలంగాణపై కేంద్ర మంత్రి మండలి నోట్ శాసనసభకు రావాల్సిందేనని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్ర, తెలంగాణ ఎమ్మెల్యేలను కలుస్తామన్నారు. మరోసారి ఢిల్లీ వెళ్లి జాతీయస్థాయి నేతలను కలుస్తామని చెప్పారు. వ్యంగ్యంగా మాట్లాడటం టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు అలవాటేనన్నారు. తెలంగాణలో కూడా సమైక్యాంధ్రకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. విప్ జారీ చేయకుంటే వాళ్లందరూ బయటకు వస్తారని అశోక్‌బాబు చెప్పారు.