సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు చేసిన సమ్మె కాలాన్ని ప్రత్యేక సాధారణ సెలవుగా పరిగణిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2013 ఆగస్టు 13 నుంచి అక్టోబర్ 17 వరకు, 2014 ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు రెండు విడతల్లో ఉద్యోగులు సమ్మె చేసిన విషయం విదితమే. అయితే సమ్మె కాలానికి సమానమైన ఆర్జిత సెలవులను ఉద్యోగుల నుంచి తీసుకుని, సమ్మె కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఉత్తర్వులు ఇచ్చింది. అయితే సమ్మె కాలాన్ని ప్రత్యేక సాధారణ సెలవుగా గుర్తించాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి.
ఎన్నికల సమయంలో టీడీపీ ఉద్యోగులకు ఈ మేరకు హామీ ఇచ్చింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉద్యోగ సంఘాలు పలుమార్లు విజ్ఞప్తి చేసిన మీదట.. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మె కాలం క్రమబద్ధీకరణతో గతంలో ఆర్జిత సెలవులు కోల్పోయిన ఉద్యోగులకు, తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఆర్జిత సెలవులను తిరిగి వారి సెలవుల ఖాతాలకు జమ చేయనున్నారు. అయితే సమ్మెలో పాల్గొన్నన్ని రోజులకే సెలవులు జమ చేయనున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే సమ్మెకాలంలో సెలవులో ఉన్న ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తించవని తెలిపారు.
6న తిరుపతిలో సీఎంకు సన్మానం
43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రిని 6న తిరుపతిలో సన్మానించనున్నామని ఉద్యోగుల జేఏసీ తెలిపింది.