పార్వతీపురం టౌన్: డివిజన్‌లో మలేరియా నివారణకు పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సమగ్ర గిరిజనాభివృధ్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ జి.లక్ష్మీషా ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం సబ్‌ప్లాన్ మండలాల వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఎంపీడీఓలతో మలేరియా నివారణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ గతేడాది దోమలపై దండయాత్ర చేసినా మలేరియా అదుపులోకి రాలేదని చెప్పారు. ఈ ఏడాది ముందుగానే మేల్కొవాలని ఆదేశించారు. ప్రతీ శనివారం డ్రై డే గా ప్రకటించామన్నారు.
గ్రామ స్థాయిలో ఏఎన్‌ఎం, ఆశవర్కర్, అంగన్‌వాడీ కార్యకర్త, పంచాయతీ సెక్రెటరీ, వెలుగు సిబ్బంది, వెటర్నరీ అసిస్టెంట్ లేదా గోపాలమిత్రలతో కూడిన కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ బృందాలు గ్రామాల్లో పర్యటించి దోమల వ్యాప్తి కారకాలను గుర్తించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. మురికినీరు, నీటి నిల్వలు, ఖాళీ కొబ్బరి చిప్పలు, టైర్లలో దోమలు వ్యాప్తి చెందుతాయని వాటి నివారణపై గ్రామస్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.
మొదటి విడత దోమల మందు పిచికారి వేగంగా పూర్తిచేయాలన్నారు. గ్రామంలో ఉన్న పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు సందర్శించి దోమల ఆవాసాలను గుర్తించాలని చెప్పారు. గత ఏడాది 27వేల దోమ తెరలు పంపిణీ చేశామని, అవి వినియోగిస్తున్నారో లేదో లబ్ధిదారులను అడిగి తెలుసుకోవాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు.
విస్తృతంగా వైద్య శిబిరాలు
మలేరియా గ్రామాలను గుర్తించి దోమల మందు పిచికారీ చేయాలని చెప్పారు. ముందస్తుగా వైద్య శిబిరాలు నిర్వహించాలనీ, అవసరమైన మందుల నిల్వలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఈ ఏడాది మలేరియా మరణాలు జరగకుండా వైద్యాధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.
తప్పుడు నివేదికలిస్తే కఠిన చర్యలు :
అనంతరం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులపై సబ్‌ప్లాన్ మండలాల అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉపాధి కూలీల వేతనాలు పెంచడంతో తప్పుడు నివేదికలు సమర్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధి కూలీలకు తప్పని సరిగా వేతనాలు పెంచడానికి కృషిచేయాలన్నారు. పని ప్రదేశంలో కూలీలకు మజ్జిగ పంపిణీ చేయాలని ఆదేశించారు.
ఈ మేరకు ఫొటోలను పంపించాలని చెప్పారు. గతవారం క్షేత్ర సహాయకులకు నిర్దేశించిన లక్ష్యాలు వచ్చే వారంలోగా పూర్తిచేయకపోతే విధులనుంచి తొలగిస్తామని హెచ్చరించారు.
మలేరియా నివారణకు పటిష్ట చర్యలు
Published Tue, Jun 6 2017 10:29 PM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM
Advertisement
Advertisement