సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి శాసన మండలికి జరిగే ద్వైవార్షిక ఎన్నికలకు సంబంధించిన ఆశావహులు హైదరాబాద్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. తమ తమ సన్నిహితులు, గాడ్‌ఫాదర్లను తోడ్కొని ఎమ్మెల్యేలు, మంత్రులను కలుస్తున్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వారంతా హైదరాబాద్‌లోనే ఉండటంతో ఆశావహులు అక్కడికి పయనమవుతున్నారు. తమ బయోడేటాతోపాటు పార్టీకి ఇంత కాలం చేసిన సేవలతో కూడిన నివేదిక, ఇతర ఆశావహుల అరాచకాలను తెలిపే జాబితాలనూ తమ వెంట తీసుకువెళుతున్నారు. పార్టీ పేరు చెప్పి పోలీస్‌స్టేషన్లలో చేసిన సెటిల్‌మెంట్లు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల బదిలీలు, టెండర్ల సమయంలో నెరపిన పైరవీలు ఇలాంటి వాటిని ఆధారాలతో సహా తీసుకువెళుతున్నట్టు తెలుస్తోంది.
ఎమ్మెల్యేల కోటాలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతు ండగా, తెలుగుదేశంపార్టీకి మూడు, వైఎస్సార్ సీపీకి రెండు స్థానాలు లభించే అవకాశం ఉంది. తెలుగుదేశంకు సంబంధించిన మూడు ఏ ప్రాంతానికి, ఏ సామాజికవర్గానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేటాయిస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. బాబు అంతరంగం అంతుపట్టక ఆశావహులు కలవరపడుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు అధినేత ముఖ్యమైన నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయలేదు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్టీకి పనిచేసిన వారికి సీటు కేటాయిస్తారని అంతా భావించారు.
చివరకు పార్టీతో సంబంధం లేని విద్యా సంస్థల అధినేత ఏఎస్ రామకృష్ణకు సీటు కేటాయించడంతో మిగిలిన ఆశావహులంతా నీరుగారిపోయారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ ఉండటంతో ఆశావహులు సీటుపై పూర్తిగా నమ్మకం పెట్టుకోలేదు. అయితే ఈ కష్టం ఊరికేపోదని, భవిష్యత్‌లో అధినేత తమకు ఎక్కడో ఒకచోట ప్రాధాన్యత ఇస్తారనే ఆశతో ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ రెండు ఎమ్మెల్సీ సీట్లకు తమ అభ్యర్థులను ఖరారు చేసింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పిల్లి సుభాస్‌చంద్రబోస్, విజయనగరం జిల్లాకు చెందిన కోలగట్ల వీరభద్రస్వామిని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించారు.
వీరిద్దరూ వైఎస్ మరణానంతరం చోటుచేసుకున్న పరిణామాల్లో తమ పదవులను వదిలి జగన్ వెంట నడిచారు. ఆ అభ్యర్థుల సామాజిక నేపథ్యం, ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు తమ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని ఆశావహులు భావిస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒకటి ఓసీ, మరొకటి బీసీలకు కేటాయించిన నేపథ్యంలో ఆ వర్గాలకు చెందిన టీడీపీ ఆశావహులుకొండంత ఆశతో ఉన్నారు.
సీటు కోసం ప్రయత్నిస్తున్న నేతల్లో కొందరు సోమ, మంగళవారాల్లో సీఎం చంద్రబాబు, జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కలిసినట్టు సమాచారం. గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఎం జియావుద్దీన్ మంగళవారం ముఖ్యమంత్రిని కలిసి గతంలో ఆయన ఇచ్చిన మాటను గుర్తుచేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో తూర్పు సీటును మద్దాళి గిరిధర్‌కు కేటాయిస్తూ భవిష్యత్‌లో జియావుద్దీన్‌కు అవకాశం కల్పిస్తామని బాబు హామీ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు ఇప్పుడు తనకు సీటు కేటాయించాలని సీఎంను కోరినట్టు ఆయన ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు.
పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కలిసి పార్టీకి తాను చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని తనకు సీటు వచ్చే విధంగా చూడాలని కోరారు. సీఎం చంద్రబాబును కూడా కలిసి పరిస్థితులను వివరిస్తానని ఆయన చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ సోదరుడు ఎంపీ రాయపాటి సాంబశివరావుతో కలిసి మంగళవారం హైదరాబాద్‌లోనే ఉన్నారు. సీఎంను కలిసి సీటు కోసం ప్రయత్నిస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
సీటు కోసం పాట్లు
Published Wed, Mar 11 2015 4:21 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement
Advertisement