పోరాటాలతోనే ప్రత్యేక హోదా
- రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేవరకు పోరాటం
- వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి
కంభం : ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటాలు తప్పవని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక్ ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో కంభం, అర్ధవీడు మండలాల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తోందన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిసి కూడా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్న టీడీపీ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పెట్టుబడిదారులు ముందుకొస్తారని, నిరుద్యోగులు, కార్మికులకు ఉపాధి దొరుకుతుందన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరులో తలపెట్టిన దీక్షకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడం సిగ్గుచేటన్నారు. ఉద్యమాలను ఉధృతం చేస్తే ప్రభుత్వాలు వాటంతట అవే దిగొస్తాయని పేర్కొన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా జాయింట్ సెక్రట రీ సయ్యద్ ఖమర్, అర్ధవీడు మండల కన్వీనర్ ఏరువు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.