ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
- ప్రత్యేకహోదా వచ్చే వరకు వైఎస్సార్ సీపీ పోరాటం
- జగన్ దీక్షకు ప్రతి ఒక్కరూ తరలిరావాలి
- వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల
ఒంగోలు అర్బన్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా..నిరుద్యోగ సమస్య తీరాలన్నా ప్రత్యేక హోదా తప్పనిసరి అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదాపై ఇప్పటికే మంగళగిరి, ఢిల్లీలో దీక్షలు చేశారని..ఇటీవలే రాష్ట్రబంద్ నిర్వహించి కేంద్రానికి సైతం రాష్ట్ర ప్రజల వాణి వినిపించామన్నారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం రాకపోవడంతో వైఎస్ జగన్ గుంటూరులో ఈనెల 26వ తేదీన నిరవధిక దీక్షకు దిగుతారన్నారు. దీక్షకు అన్నివర్గాల ప్రజలు, మహిళలు, విద్యార్థులు, అన్ని రాజకీయ పార్టీలవారు మద్దతు తెలపాలని కోరారు.
14న వైఎస్సార్ సీపీ విసృ్తత స్థాయి సమావేశం :
ఈనెల 14వ తేదీన జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ విసృ్తత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు ముత్తుముల తెలిపారు. సమావేశానికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా పార్టీ పరిశీలకుడు గోవిందరెడ్డి, జిల్లాలోని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు హాజరవుతారన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు వేమూరి సూర్యనారాయణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు గంగాడ సుజాత, నాయకుడు శింగరాజు వెంకట్రావు, గిద్దలూరు, బేస్తవారిపేట మండల పార్టీ అధ్యక్షులు కడప వంశీధరరెడ్డి, వేగినాటి ఓసూరారెడ్డి పాల్గొన్నారు.