ఎం.గౌరారం(కనగల్), న్యూస్‌లైన్: ఎందరికో వెలుగులు పంచాల్సిన ఆ విద్యాకుసుమం మధ్యలోనే ఆరిపోయింది. తమ కుమారుడు మంచి స్థితిలో ఉండాలని కూలినాలి చేసి ఉన్నత చదువు చదివిస్తున్న ఆ తల్లిదండ్రుల ఆశ నెరవేరకుండానే ఈ లోకాన్ని వీడాడు. ఉన్నత ఉద్యోగంలో స్థిరపడి మిమ్మల్ని మంచిగా చూసుకుంటానని అమ్మానాన్నలతో ఫోన్లో చెప్పిన కొన్ని గంటల్లోనే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. ఆదిలాబాద్ జిల్లా బాసర ఐఐటీలో చదువుతున్న ఎం.గౌరారం విద్యార్థి శనివారం రాత్రి హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అతని మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు.. కనగల్ మండలం ఎం. గౌరారానికి చెందిన బొమ్మపాల వెంకటయ్య-జయమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. కూలినాలి చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరిలో పెద్దకొడుకు నాగరాజు(21) 2008లో కనగల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివి అత్యున్నత మార్కులు సాధించడంతో బాసర ఐఐటీలో సీటు వచ్చింది. ప్రస్తుతం బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. శనివారం రాత్రి ఐఐటీలోని హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన నాగరాజును చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మేనత్త కూతురితో పెళ్లి నిశ్చయం
నాగరాజుకు ఇటీవల మేనత్త కూతురితో పెళ్లి కుదిరింది. ఈ నెల 26న వివాహం నిశ్చయమై నప్పటికీ అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది. ఇదే విషయమై శనివారం రాత్రి 8 గంటల సమయంలో తల్లిదండ్రులతో మాట్లాడాడు. వచ్చే నెల 5న లగ్నం పెట్టుకోవాలని నాగరాజు తమతో చెప్పినట్లు అతని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కూలినాలి చేసుకుంటూ కొడుకును చదివించామని, అతని ఇష్టప్రకారమే పెళ్లి నిశ్చయం చేశామని వారు రోదించారు. ఇంతలోనే తమ కుమారుడు కనిపంచని లోకాలకు వెళ్లిపోయాడని వారు కన్నీరుమున్నీరయ్యారు.
మృతిపై అనుమానాలు
నాగరాజు మృతిపై అతని కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి సంఘటన జరిగితే ఆదివారం ఉదయం వరకు తమకు చెప్పలేదన్నారు. కళాశాల యాజమాన్యం సరైన సమాచారం ఇవ్వడం లేదని వారు తెలిపారు.
ఆరిన విద్యాకుసుమం
Published Mon, Feb 24 2014 3:47 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
Advertisement