ఖమ్మం : అధికారి మందలించారనే అవమాన భారంతో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కాలేజీలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... వరంగల్ జిల్లా మహబూబాబాద్ పరిధిలోని పోచారం గ్రామానికి చెందిన డి.శ్రీధర్ ఇక్కడి కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.
సోమవారం ఉదయం కళాశాలలో పరీక్ష ప్రారంభం కాగానే ప్రశ్నలను ఓ చిన్న పేపర్‌పై రాసుకుంటూ అధికారికి పట్టుబడ్డాడు. దాంతో ఆయన మందలించి విద్యార్థిని బయటకు పంపారు. అనంతరం కొద్దిసేపట్లోనే తిరిగి పరీక్ష రాసేందుకు శ్రీధర్‌ను అనుమతించారు. అయితే పరీక్ష పూర్తయ్యాక శ్రీధర్ కళాశాల ఆవరణలో పెట్రోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రశ్నలను రాసుకుని మూత్రవిసర్జనకు అని బయటకు వెళ్లి జవాబులు రాసుకుని తిరిగి రావాలనేది శ్రీధర్ ఆలోచనగా తెలిసింది.