మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు (అంతరచిత్రం) అల్లూరి గంగాదుర్గారావు (ఫైల్)
ఘంటసాల (అవనిగడ్డ) : నూతన సంవత్సరం వేడుకల ఆనందంలో ఉన్న మండల ప్రజలు, అధికారులు ఓ విద్యార్థి హత్య ఘటనతో ఉలిక్కిపడాల్సి వచ్చింది. పోలీసులు అందించిన వివరాల మేరకు.. ఘంటసాల మండలం చిట్టూర్పు వద్ద దేవరకోట – వక్కలగడ్డ జెడ్పీ డొంక రోడ్డులో ఎవరో హత్యకు గురైనట్లు ఎస్‌ఐ ఎంవీకే షణ్ముఖసాయికి సమాచారం అందింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని చల్లపల్లి సీఐ ఎన్.వెంకటనారాయణ, డీఎస్పీ వి.పోతురాజులకు సమాచారం అందించారు. చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామానికి చెందిన అల్లూరి గంగాదుర్గారావు (17) ఘంటసాల ఐటీఐ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
రోజు వక్కలగడ్డ నుంచి సైకిల్‌పై కళాశాలకు వచ్చి వెళ్తుంటాడు. అలాగే సోమవారం కళాశాలలో నూతన సంవత్సర వేడుకలను ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పాల్గొని కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించుకున్నారు. అయితే, కళాశాలకు వెళ్లిన కుమారుడు ఇంటికి రాకపోవడంతో గంగాదుర్గారావు తండ్రి శ్రీనివాసరావు బంధువులు, తెలిసిన వారిని ఆరా తీశారు. కళాశాలకు చెందిన విద్యార్థులను, రామానగరం, చల్లపల్లి, యార్లగడ్డ తదితర గ్రామాలలో వెతికనా కనబడలేదు. దీంతో మంగళవారం కూడా కోసూరు తదితర గ్రామాల్లో వెతుకుతున్నారు. కాగా చిట్టూర్పు పరిధిలో గొర్రెలు మేపుకుంటూ డొంక రోడ్డుకు వచ్చిన కాపరి వెంట ఉన్న కుక్క చెరుకు తోట వద్ద మొరగడంతో అటువైపు వెళ్లి చూశాడు.
డొంక రోడ్డు వద్ద చెరుకు పొలాల్లో యువకుడి మృతదేహం ఉన్నట్లు గుర్తించి గ్రామస్తులకు ఫోన్‌లో సమాచారం అందించాడు. దీంతో విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. అవనిగడ్డ డీఎస్పీ వి.పోతురాజు, చల్లపల్లి సీఐ ఎన్.వెంకటనారాయణ, ఎస్‌ఐ ఎంవీకే షణ్ముఖసాయితో కలిసి మృతదేహాన్ని పరిశీలించారు. మెడ, బుజాలపై ఉన్న గాయాలను బట్టీ హత్యకు గురయ్యాడని పోలీసులు నిర్థారించారు. దుర్గారావు మెడ వెనక భాగంపై కత్తితో బలంగా వేటు వేయడంతో పాటు భుజాలపై కూడా కత్తి గాయాలు ఉన్నాయి. ఘటనా ప్రాంతంలో కారంపొడి కూడా ఉండటంతో కళ్లల్లో కారం కొట్టి ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని అంచనా వేస్తున్నారు. క్లూస్ టీమ్‌కు సమాచారం అందించడంతో వారు వచ్చి వివరాలను సేకరిస్తున్నారు.
వివాహేతర సంబంధమే హత్యకు కారణమా?...
విద్యార్థి హత్య వెనుక వివాహేతర సంబంధం కారణంగా ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలియవచ్చింది. అయినా అన్ని కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు. వక్కలగడ్డకు చెందిన ఆంజనేయులు అనే యువకుడితో కలిసి గంగాదుర్గారావు దీపావళికి విజయవాడలో టపాసులు అమ్మే ప్రాంతంలో సేల్స్‌బాయ్‌గా వెళ్లాడు. ఇద్దరికి వివాహేతర సంబంధం ఉన్న ఓ అమ్మాయి విషయంలో అక్కడ ఘర్షణ జరిగినట్లు తెలిసింది. ఈ వివాదం గ్రామ పెద్ద వద్ద పరిష్కరించుకున్నారు. అయినా, అనుకోని విధంగా దుర్గారావు హత్యకు గురవడం ఆ ప్రాంతవాసులను దిగ్భ్రాంతికి గురి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment