ఒంగోలు: రెండు పరీక్షలు ముగిసినా తనకు పరీక్ష హాల్‌టికెట్ ఇవ్వలేదంటూ సీనియర్ ఇంటర్ ఎంపీసీ విద్యార్థిని ఝాన్సీ, తన తండ్రి జాన్సన్‌తో కలిసి ఒంగోలులోని కళాశాల ఎదుట సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. వారికి మద్దతుగా ఎంఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు జలదంకి నరశింహారావు కూడా నిరసన తెలుపుతూ బాధితురాలికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ లింగసముద్రం మండలం ఆర్‌ఆర్ పాలేనికి చెందిన తనకు డీఆర్‌డీఏ ద్వారా మెరిట్ జాబితాలో తనకు సీటు వచ్చిందని తెలిపింది.
డీఆర్‌డీఏ నుంచి కాలేజీకి అందాల్సిన డబ్బులు రావడం లేదని, డబ్బులు కడితేనే కాలేజీకి రావాలని కంప్యూటర్ సార్ పేర్కొన్నారని ఆరోపించింది. హాల్‌టికెట్ ఇవ్వాలని తన తండ్రి వచ్చి బతిమాలినా అందుకు సార్ అనుమతించలేదని, డైరెక్టర్‌ను కలిసేందుకూ ఒప్పుకోలేదని కన్నీటి పర్యంతమైంది. ఎంఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు విషయాన్ని ఆర్‌ఐవో దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ఆయన నేరుగా కాలేజీకి చేరుకుని విద్యార్థినికి సంబంధించిన రికార్డులు పరిశీలించారు.
అనంతరం కాలేజీ డైరెక్టర్ బయటకు వచ్చి విద్యార్థిని తండ్రితో, ఎంఎస్‌ఎఫ్ నాయకులతో మాట్లాడారు. హాల్‌టికెట్ ఇప్పించడంతో పాటు వార్షిక ఫీజు కోసం కూడా విద్యార్థినిపై ఒత్తిడి తేవద్దని ఎంఎస్‌ఎఫ్ నాయకులు సూచించారు. దీనికి డైరెక్టర్ అంగీకరించడంతో సమస్య సద్దుమణిగింది.
పరీక్ష ఫీజు మేమే కట్టాం:
విద్యార్థిని పరీక్ష రాయకుండా చేయాలనే ఉద్దేశం మాకు లేదు. డీఆర్‌డీఏ నుంచి ఫీజు జమ కాకపోవడానికి కూడా కారణం మేము కాదు. మీసేవలో వారు దరఖాస్తు చేసే సమయంలో ఎస్సీ అని పేర్కొనాల్సిన చోట బీసీ డీ అని పడింది. దానిని సరిచేయడంలో జాప్యం జరుగుతుండడంతో ఫీజు జమకాలేదు. ఝాన్సీ అక్టోబరు 6వ తేదీ నుంచి కాలేజీకి రాలేదు. అయినా రెండుసార్లు యువతికి ఫోన్‌చేస్తే జ్వరం అంటూ సమాధానం వచ్చింది. దానినే తాము రిజిస్టర్‌లో కూడా నమోదు చేశాం. చివరకు విద్యార్థిని పరీక్ష ఫీజు సైతం చెల్లించకపోతే మేమే పరీక్ష ఫీజు కట్టాం. కనీసం ప్రాక్టికల్ పరీక్షలకు కూడా హాజరుకాలేదు. కాలేజీ వద్దకు వచ్చి బైఠాయించే వరకు నా దృష్టికి రాలేదు. హాల్‌టికెట్‌ను నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకొని సంబంధిత సెంటర్‌లో నేరుగా పరీక్ష రాసే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. ఈ నేపథ్యంలో మేము హాల్‌టికెట్ ఆపాల్సిన అవసరమే లేదు.
– కళాశాల కరస్పాండెంట్
హాల్‌టికెట్ ఇవ్వలేదంటూ విద్యార్థిని ఆందోళన
Published Wed, Mar 8 2017 12:02 AM | Last Updated on Fri, Nov 9 2018 4:19 PM
Advertisement
Advertisement