సాక్షి, సంగారెడ్డి: డబ్బు లేదన్న కారణంతో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదన్న సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం అసలు లక్ష్యం చేరుకోవడం లేదు. ఇక ‘ఉపకార’ం కోసం కూడా విద్యార్థులకు వెతలు తప్పడం లేదు. ఈ రెండు పథకాల కింద నిధులు మంజూరైనా పంపిణీ చేయడంలో అధికారులు కొర్రీలు పెడుతున్నారు. చిన్నచిన్న పొరపాట్లను సాకుగా చూపి విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటున్నారు. దీంతో ఫీజురీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలనే నమ్ముకుని ఉన్నత చదువులు చదువుకున్న చాలా మంది విద్యార్థులు ఫీజులు కట్టలేక పడరాని పాట్లు పడుతున్నారు.
గత విద్యా సంవత్సరం జిల్లాలో 7,592 మంది మైనారిటీ విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం బడ్జెట్ విడుదలలో తీవ్ర జాప్యం చేయడంతో విద్యా సంవత్సరం ముగిసినా విద్యార్థులు ఉపకారవేతనాలు, బోధన ఫీజుల కు నోచుకోలేకపోయారు. గత విద్యా సంవత్సరానికి సంబంధించి బకాయిలను ప్రభుత్వం మూడు విడతల్లో రూ.8.80 కోట్లను ఈ విద్యా సంవత్సరంలో విడుదల చేసింది. దీంతో 6,575 మంది విద్యార్థులకు ఉపకారవేతనా లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందుకున్నారు. కళాశాలలు, అధికారుల నిర్లక్ష్యం వల్ల 1,017 మంది విద్యార్థులు నిధులు పొందలేకపోయారు.
దీంతో విడుదలైన నిధుల్లో ఇంకా రూ.20 లక్షలకు పైగా నిధులు మైనారిటీ కార్పొరేషన్ ఖాతాలో మూలుగుతున్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రింట్ కాపీ(హార్డ్ కాపీ)లు కళాశాలల నుంచి కార్పొరేషన్ కార్యాలయానికి చేరకపోవడంతో వీరిలో 5,75 మం ది విద్యార్థులు ఈ పథకాన్ని పొందలేకపోయా రు. విద్యార్థుల బ్యాంక్ ఖాతాల సంఖ్య, వారి పేర్లు సరిపోక పోవడంతో మరో 375 మంది విద్యార్థులు ప్రయోజనానికి దూరమయ్యారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తెరుచుకోకపోవడంతో మరో 100 మంది విద్యార్థులు సైతం స్కాలర్‌షిప్పులు, బోధన ఫీజులు పొందలేకపోయారు. ఇక గతంలో మంజూరు చేసిన స్కా లర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సంబంధిత విద్యార్థులకు అందినట్లు ధ్రువీకరిస్తూ కళాశాలల యాజమాన్యాలు కార్పొరేషన్‌కు అక్విటెన్స్ సర్టిఫికేట్లు సమర్పించకపోవడంతో ఆయా కళాశాలల విద్యార్థుల దరఖాస్తులను పక్కన పెట్టినట్లు సమాచారం.
ప్రీ మెట్రిక్‌కు గ్రహణం
గత విద్యా సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్పుల కోసం దరఖాస్తు చేసుకున్న మైనారిటీ విద్యార్థులకు పభుత్వం ఇంకా నిధులను విడుదల చేయలేదు. జిల్లాలో 12,319 మంది విద్యార్థులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుని ఏడాదికి పైగా ఎదురు చూస్తున్నా, బడ్జెట్ విడుదల చేయకపోవడంతో ఇంత వరకు ఒక్క విద్యార్థికి కూడా స్కాలర్‌షిప్పు అందలేదు. అదే విధంగా 6,562 మంది ప్రీమెట్రిక్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్పులు అందాల్సి ఉండగా.. అందులో 4,802 మందికే అవి దక్కాయి. ఇప్పటికే తీవ్ర ఆలస్యం జరిగిపోయిన నేపథ్యంలో తక్షణమే నిధులు విడుదల చేయాలని విద్యార్థులు కోరుకుంటున్నారు.
ఉపకార‘వెతలు’
Published Thu, Dec 12 2013 12:05 AM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM
Advertisement
Advertisement