కార్పొరేట్ విద్యా వ్యాపారాలపై కన్నెర్ర student organisations fire on private schools | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ విద్యా వ్యాపారాలపై కన్నెర్ర

Published Fri, Jun 12 2015 4:45 PM

కార్పొరేట్ విద్యా వ్యాపారాలపై కన్నెర్ర

'సాక్షి' కథనంతో కదలిన విద్యార్థి సంఘాలు

అనంతపురం (గుంతకల్లు): విద్యా వ్యాపారానికి డోర్లు తెరిచిన కార్పొరేట్, ప్రైవేట్‌ విద్యాసంస్థలపై విద్యార్థి సంఘాలు కన్నెర్ర చేశాయి. శుక్రవారం 'సాక్షి' దినపత్రికలో 'ఫీజులుం' విద్యా వ్యాపారినికి డోర్లు తెరిచిన స్కూళ్లు' అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి ఎఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు స్పందించారు. అక్రమ డొనేషన్లు, విచ్చలవిడిగా ఫీజుల వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేయడాన్ని నిరసిస్తూ వారు శ్రీచైతన్య-2, భాష్యం, విజ్ఞాన్ స్కూళ్ల వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్న ఆయా పాఠశాలల యాజమాన్యాలతో వాదనకు దిగారు. ఆయా స్కూళ్ల ఫ్లెక్సీలను చించేశారు.

అనంతపురం పట్టణం ధర్మవరం గేట్ వద్దనున్న విజ్ఞాన్ స్కూల్ భవనంలో అనధికారికంగా నిర్వహిస్తున్న విఘ్నేశ్ బుక్స్‌కౌంటర్ సీజ్ చేయాలని బైఠాయించారు. మండల విద్యాధికారి కుళ్లాయప్ప విజ్ఞాన్ స్కూల్ వద్దకి చేరుకుని అక్రమంగా రప్పించి విఘ్నేశ్ బుక్‌స్టాల్‌ను సీజ్ చేయించారు. కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యలతో కుమ్మక్కయ్యారని ఎంఈఓ పై విద్యార్థి నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వానికి, విద్యాధికారులకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామాంజినేయులు, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు బాసిద్, రమేష్‌లు మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా వాటిని ఖాతరు చేయకుండా స్కూళ్లను తెరిచి అక్రమంగా అడ్మిషన్లను నిర్వహించడమేంటని ప్రశ్నించారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ప్రవేట్ పాఠశాలల్లోనే బుక్స్‌స్టాల్స్‌ను నిర్వహించడమే కాకుండా అత్యధిక ధరలను నిర్ణయించి పుస్తకాలను అమ్మే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. ఎల్‌కేజీ నుంచి 10వ తరగతి వరకు చేరే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి వేలకు వేలు డొనేషన్లు, వివిధ రకాల ఫీజులను వసూలు చేస్తున్నా విద్యాధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని వారు దుయ్యబట్టారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రూ.1 లక్షకు పైగా విలువ చేసే పుస్తకాలు కలిగిన విఘ్నేశ్ బుక్స్ కౌంటర్‌ను ఎంఈఓ సీజ్ చేశారు. వన్‌టౌన్ ఎస్‌ఐ నగేష్‌బాబు పోలీసుల జోక్యంతో విద్యార్థి నాయకులు ఆందోళన విరమించారు. కాగా భాష్యం స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఆ స్కూల్‌లో ఫర్నిచర్ ధ్వంసం చేసిన పలువురు విద్యార్థి నాయకులపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement