కుమార్తె పరిస్థితిపై దిగులు చెందుతున్న తల్లిదండ్రులు భాస్కరరావు, సరోజిని
రాజాం సిటీ/రూరల్: ఇద్దరు పిల్లలు కళ్ల ముందే చనిపోయారు. ఉన్న ఒక్కగానొక్క కుమార్తెకేమో రక్త హీనత. ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రం. చికిత్స కోసం ప్రయత్నిస్తున్న ప్రతిసారీ అప్పులు పెరిగాయి గానీ వ్యాధి తగ్గలేదు. 45 రోజులకు ఒకసారి అమ్మాయికి తప్పనిసరిగా రక్తం ఎక్కించాలి. ఈ తంతు పూర్తి చేయడమే ఆ తల్లిదండ్రులకు తలకు మించిన భారమవుతోంది. ఇక పూర్తిస్థాయి లో వైద్యం అందించాలంటే సాధ్యం కావడం లేదని వారు తడి కళ్లతో అంటున్నారు. దాతలు సాయం చేస్తే తమకు మిగిలిన కుమార్తెను కాపాడుకుంటామని ఆశపడుతున్నారు.
రాజాం మండలం గురవాం గ్రామానికి చెందిన కుప్పిలి భాస్కరరావు, కుప్పిలి సరోజినిల దుస్థితి ఇది. వీరి కుమార్తె కుప్పిలి స్రవంతి డోలపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈమె ఐదో ఏట అనారోగ్యానికి గురవడంతో పచ్చకామెర్లు అనుకుని నాటు మందులు వాడారు. అయినా తగ్గుముఖం పట్టకపోవడంతో స్థానిక కేర్ ఆస్పత్రిలో చేరి్పంచారు. అక్కడి వైద్యులు చిన్నారిని పరీక్షించడంతో అసలు విషయం బయటపడింది. సికెల్‌సెల్ ఎనీమియా వ్యాధి ఉందని నిర్ధారించారు. అప్పటి నుంచి ప్రతి నెలా రక్తమారి్పడి చేసుకుంటూ కుమార్తెను కాపాడుకుంటూ వస్తున్నారు.
బెంగళూ రు వద్ద నర్సాపూర్‌లో, చెన్నై సమీపంలో రాయివెల్లూరు తదితర చోట్లకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. రూ. 5 లక్షల వరకు అప్పులు చేసి వైద్యం కోసం ఖర్చు చేశారు. ఎప్పటికప్పుడు రాయివెళ్లూరు వెళ్తుండటంతో వైద్యం కూడా తలకు మించిన భా రంగా మారింది. దీంతో గ్రామస్తులు, బంధువులు సహాయ సహకారాలు అందించారు. భారీ మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులకు ఏమీ పాలుపోవడం లేదు. అప్పులు చేసే స్థితి కూడా దాటిపోయామని, కన్నపేగు ఇలా అయిపోతుంటే చూడలేకపోతున్నామని దాతలే ఆదుకోవాలని వారు కోరుతున్నారు. సాయం చేయదలచుకున్న వారు 8985481872 నంబర్‌ను సంప్రదించాలని కోరుతున్నారు.
మేనరిక వివాహంతో..
కుప్పిలి భాస్కరరావు, సరోజిని మేనరిక వివాహం చేసుకున్నారు. వీరికి మొదటగా కుమార్తె జన్మించి మూడేళ్ల వయసులో అనారోగ్యంతో మృతిచెందింది. తర్వాత కుమారుడు, మరో కుమార్తె పుట్టడంతో ఎంతో సంబరపడ్డారు. వీరిద్దరితో సరదాగా కాలం నెట్టుకొస్తున్న తరుణంలో మరోమారు విధి కన్నెర్రజేసింది. కుమారుడు కూడా చనిపోయాడు. ఉన్న ఒక్క కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఇంతలో వ్యాధి సోకడంతో వారి బాధ వర్ణణాతీతంగా మారింది.
ఒక్కసారి రక్తం ఎక్కించిన తర్వాత ఒక్కో సారి 45 రోజులకు, ఒక్కోసారి నెలలోపే మరలా రక్తం ఎక్కించాల్సి వస్తుందని తల్లిదండ్రులు ‘సాక్షి’ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాధికి చికిత్స చేయించడం తమ వల్ల కావడం లేదని, రేపటి రోజును తలచుకుంటేనే భయం వేస్తోందని అంటున్నారు. ప్రభుత్వం, దాతలు ఆదుకుంటే తమ చిన్నారి బతుకుతుందని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment