వీడని చిక్కుముడి
సవాల్‌గా మారిన విద్యార్థిని మృతి కేసు
అనుమానిత వ్యక్తులను విచారిస్తున్న పోలీసులు
గొలుగొండ: విద్యార్థిని దివ్యశ్రీ మృతి మిస్టరీ వీడడం లేదు. ఈ సంఘటన పోలీసులకు అంతుచిక్కడం లేదు. ఈ నెల 4వ తేదీ రాత్రి గొలుగొండ మం డలం అప్పన్నపాలెంలో అనుమానాస్పదస్థితిలో విద్యార్థిని మృతి చెందిన సంగతి తెలిసిందే. 16 రోజులయినా ఎటువంటి వివరాలు, ఆధారాలు దొరకలేదు. దివ్యశ్రీది హత్యా, ఆత్మహత్యా అన్నది శేషప్రశ్నగానే మిగిలిపోయింది. అప్పట్లో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమేదు చేశారు. నర్సీపట్నం ఏఎస్పీ సత్యఏసుబాబు, రూరల్ సీఐ గపూర్, గొలుగొండ ఎస్‌ఐ జోగారావు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఊరుకి దూరంగా తోటలలో నివాసం ఉండటం వల్ల అక్కడ ఏమి జరిగిందన్నది ఎవరికీ తెలియడం లేదు. దివ్యశ్రీ చదివే కళాశాలలో కూడా విచారణ జరిపారు. మృతిచెందక ముందు విద్యార్థిని రాంబిల్లిలోని బంధువ ఇంటికి వెళ్లింది.
అక్కడా పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థినికి ఇంటిలో ఎటువంటి ఇబ్బందులు లేకపోవడం, ఎవరితోనూ శత్రుత్వం ఉండకపోవడం,ఆత్యహత్య చేసుకోడానికి బలమైన కారణాలు దొరకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కుమార్తె మృతిపై తల్లిదండ్రులకు కొన్ని కారణాలు తెలిసే ఉంటాయని, అయితే వారు నోరు విప్పకపోవడం వల్లే దర్యాప్తు ఆలస్యం అవుతోందన్న వాదన ఉంది. నెల రోజులు క్రితం కొత్తయల్లవరానికి చెందిన యువకుడోకరు ఈ ప్రాంతంలో కార్పెంటర్ పనులు చేసేవాడు. అనుమానం వచ్చిన పోలీసులు అతనితోపాటు మరోయువకుడ్ని కూడా విచారణ చేస్తున్నారు. అలాగే వివిధ కోణాలలో దర్యాప్తు మమ్మరం చేశారు. ఇప్పటి వరకు ఎటువంటి కీలక సమాచారం దొరకలేదు.