విద్యార్థుల ఆందోళనతో ఆగిన టీచర్ బదిలీ!
ఎస్.రాయవరం: విద్యార్థుల ఆందోళనతో టీచర్ బ దిలీ ఆగిన సంఘటన ఇది. గోకులపాడు ప్రాథమికోన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయురాలిని బదిలీ చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. ఉదయం పాఠశాలకు చేరుకున్న విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్లకుండా పాఠశాల ముందు ధర్నాకు దిగారు. పాఠశాలకు చేరుకున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు నచ్చచెప్పినా ఆందోళన విరమించలేదు.
విషయం తెలుసుకున్న ఎంఈవో పి.అప్పారావు పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. సర్దుబాటులో భాగంగా ఇక్కడి నుంచి ఉపాధ్యాయురాలిని చినగుమ్ములుకు బదిలీ చేశామని, 3 నెలల్లో కొత్త టీచర్ వస్తారని తెలిపారు. 6 నెలలుగా సైన్స్ పాఠాలు బోధిస్తున్న టీచర్‌ను హఠాత్తుగా బదిలీచేస్తే తమకు అన్యాయం జరుగుతుందని, ఆ టీచర్‌ను కొనసాగించాలని విద్యార్థులు ఎంఈవోను కోరారు. ఎంఈవో చేసేదిలేక సైన్స్ టీచర్‌ను ఇక్కడే కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు.