Gokulapadu
-
పిచ్చికుక్కల స్వైర విహారం..15 మందికి గాయాలు
కర్నూలు జిల్లా : నగర శివారులోని గోకులపాడులో శుక్రవారం పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. కనపడిన ప్రతీ వ్యక్తిని కండలూడేలా కరిచాయి. ఈ ఘటనలో 15 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో చిన్నారులు, వృద్దులే అధికంగా ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిచ్చికుక్కుల గురించి అధికారులకు తెలియజేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, గ్రామంలో తిరగాలంటేనే హడలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గోకులపాడు ఘటనలో మరో వ్యక్తి మృతి
విశాఖపట్నం : గోకులపాడు బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరుకుంది. బాణాసంచా పేలుడులో గాయపడ్డ లక్ష్మీ అనే మహిళ సెవన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం గోకులపాడులోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించిన ఘటనలో ఎనిమిదిమంది మృతి చెందిన విషయం తెలిసిందే. -
రాజమండ్రి బయల్దేరిన వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి బయల్దేరారు. హైదరాబాద్ నుంచి ఆయన విమానంలో మధురపూడి చేరుకుంటారు. ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గంలో వైఎస్ జగన్ జగ్గంపేట మీదుగా ఇర్రిపాకకు వెళ్తారు. సోదరుని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఇటీవల నెహ్రూ సోదరుడు సత్తిబాబు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. జ్యోతులను పరామర్శించిన అనంతరం జగన్మోహన్రెడ్డి తుని మీదుగా విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలం గోకులపాడు వెళ్తారు. అక్కడ ఇటీవల బాణసంచా పేలుడు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. -
ఈ తప్పెవరిది..!
{పాణాలు తీస్తున్న బాణసంచా పేలుళ్లు జరుగుతున్నా పట్టని పాలకులు రెండు నెలల క్రితం ఇలాగే జరిగినా కళ్లు తెరవలేదు పరిహారంలోనూ కరుణ చూపని ప్రభుత్వం వెలుగుల చిమ్మే బాణసంచా బతుకుల్ని బుగ్గి చేస్తోంది. బతుకుపోరాటంలో పనికి వెళ్లిన వారి ప్రాణాలను హరిస్తోంది. అధికారుల అలక్ష్యం, నిబంధనల్లోని లొసుగులతో దీనికి కారకులెవరు..శిక్ష అనుభవిస్తున్నదెవరన్నది శేషప్రశ్నగా మిగిలిపోతున్నది. గోకులపాడు సంఘటనపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు ఏ చిరుద్యోగిపైనో చర్యలు తీసుకుని పెద్దలను వదిలేస్తారు. తమ వారిని కోల్పోయి అనాథలైన అభాగ్యులను తర్వాత కన్నెత్తి కూడా చూడరు. ఇలాంటి మరో సంఘటన చోటుచేసుకోదని ఈ ప్రభుత్వం హామీ ఇవ్వలేదు. కానీ బాధితులకు న్యాయం జరిగేలా పాలకులను నిలదీసే బాధ్యతలను ప్రతిపక్షం తీసుకుంది. వారి కన్నీళ్లు తుడిచేందుకు ముందుకు వస్తోంది. విశాఖపట్నం: ఎస్రాయవరం మండలం గోకులపాడు బాణసంచా పేలుడు ఘటన పాలకుల నిర్లక్ష్యానికి ప్రబల తార్కాణంగా నిలుస్తోంది. ఏటేటా ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నా..పాలకుల్లో కదిలిక కానరావడం లేదు. సంఘటన జరిగినప్పుడల్లా కంటితుడుపు చర్యలతో, నామ మాత్రపు పరిహారంతో బాధితులను ఓదార్చడం పరిపాటవుతోంది. జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలు కేవలం 12 మాత్రమేనని అగ్నిమాపకశాఖ అధికారులు చెబుతున్నారు. అనధికార కేంద్రాలు ఎన్ని అన్నది తెలియదంటున్నారు. రాంబిల్లి మండలం నారాయణపురంలో ఈ ఏడాది జనవరిలో అనధికార బాణసంచా కేంద్రంలో పేలుడు చోటుచేసుకుంది. నలుగురు చనిపోయారు. అప్పట్లోనూ పాలకులు కొద్ది రోజులు ఇలాగే హాడావిడి చేశారు. బాణాసంచా కేంద్రాలపై దాడులకు ఆదేశించారు. అధికారులు తనిఖీలు చేపట్టారు. రెండు నెలలకే అదేరీతిలో మరో ఆరుగురు బలైపోయారు. జిల్లాలోని రాంబిల్లి, గోకులపాడు, పాయకరావుపేట, అనకాపల్లి మండలం పిసినికాడ, గవరపాలెం, కొప్పాక, సబ్బవరం మండలం మొగళిపురం, గుళ్లేపల్లి, సబ్బవరం, పరవాడ, పెందుర్తి మండలం పినగాడిలో ఎక్కువగా బాణసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ అనధికారికంగా నిర్వహిస్తున్నవే. ఆయా కేంద్రాల్లో కాగడా పెట్టి వెదికినా నిబంధనలు కానరావు. ఇక అధికారికంగా నడుపుతున్నామని చెప్పుకునే వాటిల్లోనూ అనుమతి పొందిన దానికంటే ఎక్కువగా బాణసంచా నిల్వలు ఉంచుతున్నారు. గోకులపాడు ప్రమాద తీవ్రతను ఇది స్పష్టం చేస్తోంది. కేవలం 15 కిలోల మందుగుండు సామాగ్రి నిల్వకు అనుమతి తీసుకుని వందల కిలోలకు పైగా నిల్వ ఉంచడం వల్లనే ఇంతటి దారుణం చోటుచేసుకుందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మరో విచిత్రమేమిటంటే ఇదే కేంద్రాన్ని కొద్ది రోజుల క్రితమే అధికారులు తనిఖీ చేసి అన్నీ సక్రమంగా ఉన్నాయని ధ్రువీకరించారు. ఇప్పుడు వారే నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిల్వలు ఉంచారని పేర్కొంటున్నారు. అంటే తప్పెవరిది. అప్పట్లో గుర్తించిన అధికారులు నిర్వాహకులను హెచ్చరించి ఉంటే ఇన్ని ప్రాణాలు బుగ్గిపాలయ్యేవి కావు. -
విద్యార్థుల ఆందోళనతో ఆగిన టీచర్ బదిలీ!
ఎస్.రాయవరం: విద్యార్థుల ఆందోళనతో టీచర్ బ దిలీ ఆగిన సంఘటన ఇది. గోకులపాడు ప్రాథమికోన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయురాలిని బదిలీ చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. ఉదయం పాఠశాలకు చేరుకున్న విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్లకుండా పాఠశాల ముందు ధర్నాకు దిగారు. పాఠశాలకు చేరుకున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు నచ్చచెప్పినా ఆందోళన విరమించలేదు. విషయం తెలుసుకున్న ఎంఈవో పి.అప్పారావు పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. సర్దుబాటులో భాగంగా ఇక్కడి నుంచి ఉపాధ్యాయురాలిని చినగుమ్ములుకు బదిలీ చేశామని, 3 నెలల్లో కొత్త టీచర్ వస్తారని తెలిపారు. 6 నెలలుగా సైన్స్ పాఠాలు బోధిస్తున్న టీచర్ను హఠాత్తుగా బదిలీచేస్తే తమకు అన్యాయం జరుగుతుందని, ఆ టీచర్ను కొనసాగించాలని విద్యార్థులు ఎంఈవోను కోరారు. ఎంఈవో చేసేదిలేక సైన్స్ టీచర్ను ఇక్కడే కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు.