ఈ తప్పెవరిది..!
{పాణాలు తీస్తున్న బాణసంచా పేలుళ్లు జరుగుతున్నా పట్టని పాలకులు
రెండు నెలల క్రితం ఇలాగే జరిగినా కళ్లు తెరవలేదు
పరిహారంలోనూ కరుణ చూపని ప్రభుత్వం
వెలుగుల చిమ్మే బాణసంచా బతుకుల్ని బుగ్గి చేస్తోంది. బతుకుపోరాటంలో పనికి వెళ్లిన వారి ప్రాణాలను హరిస్తోంది. అధికారుల అలక్ష్యం, నిబంధనల్లోని లొసుగులతో దీనికి కారకులెవరు..శిక్ష అనుభవిస్తున్నదెవరన్నది శేషప్రశ్నగా మిగిలిపోతున్నది. గోకులపాడు సంఘటనపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు ఏ చిరుద్యోగిపైనో చర్యలు తీసుకుని పెద్దలను వదిలేస్తారు. తమ వారిని కోల్పోయి అనాథలైన అభాగ్యులను తర్వాత కన్నెత్తి కూడా చూడరు. ఇలాంటి మరో సంఘటన చోటుచేసుకోదని ఈ ప్రభుత్వం హామీ ఇవ్వలేదు. కానీ బాధితులకు న్యాయం జరిగేలా పాలకులను నిలదీసే బాధ్యతలను ప్రతిపక్షం తీసుకుంది. వారి కన్నీళ్లు తుడిచేందుకు ముందుకు వస్తోంది.
విశాఖపట్నం: ఎస్‌రాయవరం మండలం గోకులపాడు బాణసంచా పేలుడు ఘటన పాలకుల నిర్లక్ష్యానికి ప్రబల తార్కాణంగా నిలుస్తోంది. ఏటేటా ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నా..పాలకుల్లో కదిలిక కానరావడం లేదు. సంఘటన జరిగినప్పుడల్లా కంటితుడుపు చర్యలతో, నామ మాత్రపు పరిహారంతో బాధితులను ఓదార్చడం పరిపాటవుతోంది. జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలు కేవలం 12 మాత్రమేనని అగ్నిమాపకశాఖ అధికారులు చెబుతున్నారు. అనధికార కేంద్రాలు ఎన్ని అన్నది తెలియదంటున్నారు. రాంబిల్లి మండలం నారాయణపురంలో ఈ ఏడాది జనవరిలో అనధికార బాణసంచా కేంద్రంలో పేలుడు చోటుచేసుకుంది. నలుగురు చనిపోయారు. అప్పట్లోనూ పాలకులు కొద్ది రోజులు ఇలాగే హాడావిడి చేశారు. బాణాసంచా కేంద్రాలపై దాడులకు ఆదేశించారు. అధికారులు తనిఖీలు చేపట్టారు. రెండు నెలలకే అదేరీతిలో మరో ఆరుగురు బలైపోయారు.
జిల్లాలోని రాంబిల్లి, గోకులపాడు, పాయకరావుపేట, అనకాపల్లి మండలం పిసినికాడ, గవరపాలెం, కొప్పాక, సబ్బవరం మండలం మొగళిపురం, గుళ్లేపల్లి, సబ్బవరం, పరవాడ, పెందుర్తి మండలం పినగాడిలో ఎక్కువగా బాణసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ అనధికారికంగా నిర్వహిస్తున్నవే. ఆయా కేంద్రాల్లో కాగడా పెట్టి వెదికినా నిబంధనలు కానరావు. ఇక అధికారికంగా నడుపుతున్నామని చెప్పుకునే వాటిల్లోనూ అనుమతి పొందిన దానికంటే ఎక్కువగా బాణసంచా నిల్వలు ఉంచుతున్నారు. గోకులపాడు ప్రమాద తీవ్రతను ఇది స్పష్టం చేస్తోంది. కేవలం 15 కిలోల మందుగుండు సామాగ్రి నిల్వకు అనుమతి తీసుకుని వందల కిలోలకు పైగా నిల్వ ఉంచడం వల్లనే ఇంతటి దారుణం చోటుచేసుకుందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
మరో విచిత్రమేమిటంటే ఇదే కేంద్రాన్ని కొద్ది రోజుల క్రితమే అధికారులు తనిఖీ చేసి అన్నీ సక్రమంగా ఉన్నాయని ధ్రువీకరించారు. ఇప్పుడు వారే నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిల్వలు ఉంచారని పేర్కొంటున్నారు. అంటే తప్పెవరిది. అప్పట్లో గుర్తించిన అధికారులు నిర్వాహకులను హెచ్చరించి ఉంటే ఇన్ని ప్రాణాలు బుగ్గిపాలయ్యేవి కావు.