మృతదేహాల కోసం నదిలో గాలిస్తున్న జాతీయ విపత్తుల స్పందనా దళం
కృష్ణానదిలో గల్లంతైన విద్యార్థులు ఖగ్గా వెంకటేశ్వరరావు, రెడ్డి వెంకటేష్ మృతదేహాలు సోమవారం లభించాయి. అచ్చంపేట మండల సరిహద్దులోని పులిచింతల ప్రాజెక్టు దిగువలో ఇద్దరు విద్యార్థులు కృష్ణానదిలో గల్లంతయ్యారు. జాతీయ విపత్తుల స్పందనా దళం సభ్యులు గాలించి విద్యార్థుల మృతదేహాలను నది లోతుల్లో నుంచివెలికి తీశారు.
అచ్చంపేట / సత్తెనపల్లి: మండల సరిహద్దుల్లోని పులిచింతల ప్రాజెక్టు దిగువలో ఆదివారం గల్లంతైన ప్రత్తిపాడు మండలం చినకొండ్రుపాడు గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఖగ్గా వెంకటేశ్వరరావు ఆర్.వెంకటేష్ మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. అచ్చంపేట ఎస్‌ఐ పి.కిరణ్ ఆధ్వర్యంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందం సోమవారం ఉదయాన్నే కృష్ణానదిలో గాలింపు చర్యలు చేపట్టింది. విద్యార్థులు మునిగిపోయిన కొద్ది దూరంలో నది నుంచి వారి మృతదేహాలను వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు.
ముందే హెచ్చరించిన సాక్షి..
పులిచింతల ప్రాజెక్టు దిగువలో రాళ్లపై పాచి పేరుకోవడంతో ఈతకు, స్నానాలకు వెళ్లిన అనేక మంది విద్యార్థులు తరచూ గల్లంతవుతున్న నేపథ్యంలో ఈ నెల 23న ‘ప్రాజెక్టు వద్ద సందడి’ శీర్షికన అధికారుల నిర్లక్ష్యంపై సాక్షిలో కథనం ప్రచురితమైంది. సరిగ్గా వారం రోజుల్లోనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన జరిగింది. అధికారులు స్పందించకపోవడంతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయనే విమర్శలొస్తున్నాయి. ఇప్పటికైనా ప్రాజెక్టుకు దిగువలో ప్రమాద హెచ్చరిక బోర్డులు, పోలీసు పహారా ఉంచాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment