ఉపకారం
ఉపకార వేతనాల కోసం విద్యార్థుల అగచాట్లు
అందని ధ్రువీకరణ పత్రాలు
నేడు ముగియనున్న స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు
నష్టపోనున్న వేలాది మంది విద్యార్థులు
అధికారుల నిర్లక్ష్యం వల్ల జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ దక్కకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. గత నెలలో భారీ వర్షాలకు తోడు చాలాచోట్ల ఆన్‌లైన్ ఇబ్బందులు, రెవెన్యూ అధికారులు అందుబాటులో లేకపోవడంతో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సకాలంలో మంజూరు కాలేదు. ఫలితంగా వేల మంది విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను అందివ్వలేకపోయా రు. శనివారంతో గడువు ముగుస్తుండడంతో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చిత్తూరు (గిరింపేట): పాలకుల అలక్ష్యం.. అధికారుల నిర్లక్ష్యంతో జిల్లాలోని అర్హులైన వేల మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఆన్‌లైన్ ఇబ్బందులు, రెవెన్యూశాఖ లోపాల వల్ల సర్టిఫికెట్లు మంజూరు కావడం ఆలస్యమౌతోంది. ఈ కారణంగా చాలామంది విద్యార్థులు ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. దీంతో కళాశాల విద్యార్థుల కిచ్చే పోస్టుమెట్రిక్, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తు నమో దుకోసం పడరానిపాట్లు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని రకాల ఉపకార వేతనాలకు అర్హులైన విద్యార్థులు కనీసం 80 వేల మంది ఉన్నారు. ఈ ఏడాది ఇంటర్, డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు, డిప్లొమో విద్యార్థులు ఉపకార వేతనాల కోసం నవంబర్ మొదటి వారంలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీరిలో ఇప్పటికీ 25 వేల మందికిపైగా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేదు. శనివారం ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువు ముగియనుంది. ఇప్పటికే రెండుసార్లు గడువు పెంచిన నేపథ్యంలో మళ్లీ పెంచేందుకు ప్రభుత్వం సముఖంగా లేదు. దీనికితోడు ఇప్పటి వరకు డైట్ సెట్, ఎడ్‌సెట్, బీ-ఫార్మసీ ఇలా 10 సెట్ల వరకు కౌన్సెలింగ్ పూర్తిచేయకపోవడంతో చాలామంది విద్యార్థులు స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేయాలో.. వద్దో అన్న సందేహంలో ఉన్నారు.
ఈ పాపం సర్కారుదే..
ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా నమోదు చేయాలంటూ ప్రభుత్వం షరతులు విధించింది. వాటిని జారీ చేయడంలో రెవెన్యూ శాఖ తీవ్ర ఆలస్యం చేస్తోంది. ఇక నవంబర్‌లో కురిసిన వర్షాలకు పదిరోజులకు పైగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. వరద ఉద్ధృతికి విద్యార్థులు ఇంటి నుంచి భయటకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో అర్హులైన వారు సకాలంలో ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారంతో గడవు ముగుస్తుండడంతో ఏంచేయాలో పాలుపోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థులు మీ- సేవా, తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా సర్టిఫికెట్లు మాత్రం ఇవ్వడం లేదని వాపోతున్నారు.
సర్టిఫికెట్ల కోసం అక్రమ వసూళ్లు
నిబంధనల ప్రకారం మీ-సేవా కేంద్రాల్లో ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వద్ద రూ.35 మాత్రమే తీసుకోవాలి. కానీ చాలా చోట్ల రూ.100 వరకు వసూలు చేస్తూ విద్యార్థులను దోచుకుంటున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోకుంటే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.