విద్యార్థుల పాట్లు
ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తుకు 10న ఆఖరు
సమయం లేకపోవడంతో మీ సేవ,
రెవెన్యూ కార్యాలయాల వద్ద పడిగాపులు
80 వేల మందికి 21 వేల మంది విద్యార్థులే రెన్యువల్
ఓ వైపు కళాశాలల్లో వేలకు వేలు ఫీజులు.. మరో వైపు తీవ్ర కరువు.. ఆర్థిక ఇబ్బందుల నడుమ పేద విద్యార్థుల చదువు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో గట్టెక్కుతోంది. అయితే ప్రభుత్వ నిర్ణయం వీరి పాలిట శాపంగా మారుతోంది. రీయింబర్స్‌మెంట్ రెన్యువల్‌కు కేవలం 14 రోజులు మాత్రమే గడువు ఇచ్చారు. ఈ లోపు జన్మభూమి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు అందక పడరాని పాట్లు పడుతున్నారు.
తిరుపతి తుడా: ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 10న చివరి తేదీ కావడంతో విద్యార్థులు కుల, ఆదాయ, నేటివిటీ సర్టిఫికెట్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మీ సేవ, రెవెన్యూ కార్యాలయాల్లో పడిగాపులు కాస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అక్టోబర్ 28 నుంచి ఈనెల 10వ తేదీ వరకు కేవలం 14 రోజులు మాత్రమే గడువు ఇచ్చింది. కుల ధ్రువీకరణ పత్రం పొందాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీ సేవలో ఆన్‌లైన్‌లో రశీదు పొందిన తరువాత 15 రోజుల సమయం పడుతుంది. రీయింబర్స్‌మెంట్ తేదీల ప్రతిపాదనలను గత నెల 27న అన్ని కళాశాలలకు పంపించారు. ‘ఈ పాస్’ లాగిన్లో అందుబాటులో ఉంచారు. కళాశాలల యజమానులు రీయింబర్స్ మెంట్ తేదీలను నోటీస్ బోర్డులో ఉంచడంతో పాటు తరగతి గదులకు పంపాల్సిఉంది. నూటికి తొంభై శాతం కళాశాలలు ఈ నోటీసులను సరైన సమయంలో విద్యార్థుల దృష్టికి తీసుకెళ్లలేదనే ఆరోపణలు ఉన్నా యి. రీయింబర్స్‌మెంట్ తేదీలపై విద్యార్థులకు సమాచారం లేకపోవడంతో ఇప్పటి వరకు 80 వేల మందికి గాను, 21వేల మంది విద్యార్థులు మాత్రమే రెన్యువల్‌కు నమోదు చేసుకున్నారు. చివరి తేదీకి మూడు రోజు లు గడువు ఉన్నా శని, ఆదివారాలు సెలవు కావడం తో ఇక సోమవారం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉం టుంది. దీంతో విద్యార్థులు రెవెన్యూ కార్యాలయాల నుంచి సర్టిఫికెట్లు అందక, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోలేక కంటతడి పెడుతున్నారు. రీయింబర్స్‌మెంట్‌కు రెన్యువల్ గడువును పెంచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థుల పడిగాపులు
నిబంధనల ప్రకారం మీ సేవలో కుల ధ్రువీకరణకు-15 రోజులు, ఆదాయం, నేటివిటీ, ఇంటిగ్రేట్ సర్టిఫికెట్లకు-10 రోజులు సమయం పడుతుంది. రీయింబర్స్‌మెంట్ తేదీ ప్రకారం కేవలం 14 రోజులు గడువిచ్చారు. విద్యార్థులు తెలుసుకుని వాటికి దరఖాస్తు చేసుకునే లోపు 10 రోజులు పట్టింది. మిగిలిన నాలుగు రోజుల్లో ధ్రువీకరణ పత్రాలు పొందడానికి వీలు కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు జన్మభూమి రావడంతో రె వెన్యూ అధికారులు కార్యక్రమాలకే పరిమితమయ్యారు. తిరుపతి అర్బన్ రెవెన్యూలో ఇందుకోసం ప్రత్యేకంగా ఇద్దరిని ఏర్పాటు చేసినా ఫలితం లేకుం డా పోయింది.