ఉపకారం.. గోల్‌మాల్ | students scholarships are mis used | Sakshi
Sakshi News home page

ఉపకారం.. గోల్‌మాల్

Published Wed, Aug 21 2013 3:22 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM

students scholarships are mis used

 తుర్కపల్లి, న్యూస్‌లైన్: పేద విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం వివిధ పథకాల కింద ఉపకార వేతనాలు అందిస్తున్నది. లక్ష్యం మంచిదే అయినా అమలులో తప్పుదారి పడుతోంది. ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న మూడో తరగతి విద్యార్థి, డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులు ఉపకార వేతనాలు పొందుతున్నారు. ఇదీ..తుర్కపల్లి మండలంలో వెలుగు చూసిన ఉపకార వేతనాల భాగోతం. ఎన్‌ఆర్‌ఈజీఎస్ కూలీల, ఆమ్‌ఆద్మీ బీమా, వైఎస్సార్ అభయహస్తం పథకాల్లో సభ్యుల పిల్లల చదువుకు తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం ఉపకార వేతనాలు అందిస్తోంది. తొమ్మిది, 10వ వతరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ, ఐటీఐ విద్యార్థులకు ఈ ఉపకార వేతనాలు ఇస్తుంది. వీరికి ఏడాదికి 1200 రూపాయలు అందిస్తుంది. తుర్కపల్లి మండలంలో  1237 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరయ్యాయి. వీటిలో ఆమ్ ఆద్మీ బీమా  కింద 335, ఎన్‌ఆర్‌ఈజీయస్‌లో 119, అభయహస్తం 511, కొత్త ఎన్‌ఆర్‌ఈజీయస్ కింద 272 ఉన్నాయి.
 
 ఒక్క పాఠశాలలోనే..
 తిర్మాలపురం పాఠశాలకు  68 ఉపకార వేతనాలు మంజూరయ్యాయి. గ్రామస్తులు ఆ జాబితా చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన వారి పేర్లు కూడా ఉపకార వేతనాల జాబితాలో ఉన్నాయి.   డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల పేర్లూ ఉన్నాయి. దీంతో గ్రామస్తులు తుర్కపల్లి వెలుగు కార్యాలయానికి వెళ్లి ఆరా తీశారు. కానీ వారికి అక్కడ ఎటువంటి సమాచారమూ దొరకలేదు. దీంతో విలేకరులకు జాబితా అందించి అవకతవకలను బయటపెట్టారు. ఒక్కగ్రామంలోనే ఇన్ని అవకతవకలు జరిగాయంటే మండలంలోని మిగతా పాఠశాలల్లో పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉందని మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
 
 మరికొన్ని ఉదాహరణలు..
     తిర్మలాపురం గ్రామానికి చెందిన తలారి రేణుక ప్రస్తుతం చదువు మానేసింది, ఈమె 9వ తరగతి చదువుతున్నట్టుగా ఉపకార వేతనాల జాబితాలో పేరు ఉంది. నల్ల కరుణాకర్ అనే బాలుడు కూడా చదవడం లేదు ఇతను 9తరగతి చదువుతున్నట్టు పేరు నమోదై ఉంది.
     వట్టిపల్లి పాండు డీగ్రీ ఫైనలియర్ , డొంకెన భాగ్య డిగ్రీ చదువుతున్నారు. వీరికి ఉపకార వేతనం మంజూరైంది.
     నాంసాని సుచిత అనే యువతి పెళ్లి అయ్యింది. ఈమెకు కూడా ఉపకార వేతనం మంజూరైంది.
 ఉపకార వేతనాలు పొందాలంటే..
 విద్యార్థులు ఉపకార వేతనాలు పొందాలంటే సంఘబంధం అధ్యక్షులు విద్యార్థుల జాబితాను ప్రాథమికంగా సేకరించాలి. ఆ సమయంలో విద్యార్థుల నుంచి సంబంధిత పాఠశాలలో చదువుతున్నట్టు బోనఫైడ్ సర్టిఫికెట్ తీసుకోవాలి. అనంతరం ఆయా విద్యార్థులు పాఠశాలలో చదువుతున్నది లేనిదీ విచారణ జరపాలి. తుది జాబితాను వీబీకేలకు అందిస్తారు. వీబీకేలు బోనఫైడ్ సర్టిఫికెట్లను పరిశీలించి కంప్యూటర్‌లో నమోదుచేస్తారు. ఏపీఎం కార్యాలయంలో వీటిపై దర్యాప్తు నిర్వహించాలి. అనుమానం వచ్చిన వాటిపై ఏపీఎం ఆయా పాఠశాలలకు వెళ్లి పునః విచారణ జరిపిన తర్వాత ఉపకార వేతనాలకు విద్యార్థులను ఎంపిక చేయాలి.
 
 తప్పు ఎక్కడ జరుగుతుందంటే..
 బోనఫైడ్ సర్టిఫికెట్ ఆధారంగా ఉపకార వేతనాల ఎంపిక ఉంటుంది.  పాఠశాలకు సం బంధం లేని వారికి, తక్కువ వయస్సు ఉన్న విద్యార్థులకు ఈ సర్టిఫికెట్లు ఏ విధంగా జారీ అవుతున్నది ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకే తెలియాలి. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే అనర్హుల జాబితా చాంతాడంత ఉండే అవకాశం ఉంది.
 
 ఉపకార వేతనాల అవకతవకలపై విచారణ జరిపించాలి
 మండలంలో జరిగిన ఉపకార వేతనాల అవకతవకలపై విచారణ జరిపి దోషులను వెంటనే శిక్షించాలని తుర్కపల్లి ఉపసర్పంచ్ ఉపేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ తిర్మాలపురంలో 68 మందికి ఉపకార వేతనాలు రాగా అందులో ఎనిమిది మంది తప్పుడు బోనఫైడ్‌లు సమర్పిం చి పేర్లు రాయించారని తేటతెల్లమైందన్నారు.  3వ తరగతి విద్యార్థికి ఆ పాఠశాలతో ఎటువంటి సంబంధమూ లేకున్న 10వ తరగతి చదివినట్లు ఉపకార వేతనాల లిస్ట్‌లో పేరు ఉందని, డిగ్రీ విద్యార్థులు పేర్లు జాబితాలో ఏ విధంగా నమోదవుతాయని ప్రశ్నించారు.  దీనిపై ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిపి తప్పుడు బోనఫైడ్‌లు ఇచ్చిన వారిపై చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement