ఈ భోజనం తినలేం
రోడ్డెక్కిన విద్యార్థులు
ఆదోని టౌన్ : ఉడికి ఉడకని అన్నం, నీళ్లసాంబారు, చప్పటి భోజనం తినలేమంటూ విద్యార్థులు గురువారం రోడ్డెక్కెరు. ఆదోని మున్సిపల్ హై స్కూల్ నుంచి భోజనం పేట్లతో భీమాస్ సర్కిల్ చేరుకొని కొంతసేపు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఇసాక్, రవి మాట్లాడారు. భోజనం తయారీ ఏజెన్సీ నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భోజనం చేయలేక కొంతమంది విద్యార్థులు ఇళ్లకు వెళ్తున్నారన్నారు. ఈ విషయాన్ని హై స్కూల్ హెచ్‌ఎం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు.
మెనూ.. ప్రకారం భోజనం వడ్డించడం లేదని, ఉపాధ్యాయులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉడకని అన్నం తినలేక పక్కనే ఉన్న కాలువలో పారవేస్తున్నారని చెప్పారు. భీమాస్ సర్కిల్‌లో ఆందోళన చేస్తున్న విద్యార్థులను త్వరగా ఆందోళన ముగించాలని పోలీసులు ఒత్తిడి చేయడంతో వారు భోజనం ప్లేట్లతో తిరిగి స్కూల్‌కు వెళ్లారు. ఆందోళనలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వీరేష్, రామాంజనేయులు, సజ్జాద్, వీరన్న, మల్లి, సంజు పాల్గొన్నారు.