SFI leaders
-
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వద్ద ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ మెరుపు ముట్టడికి ఎస్ఎఫ్ఐ నేతలు, విద్యార్థులు యత్నించారు. 100 మందికి పైగా విద్యార్థులు ఒక్కసారిగి అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనకు దిగిన మహిళలను సైతం ఈడ్చిపడేశారు. దీంతో అసెంబ్లీ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్లు ►మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియింబర్స్‌మెంట్ రూ. 5,177 కోట్ల బకాయిలు తక్షణమే విడుదల చేయాలి. ► పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ►హై స్కూల్స్, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్‌లోకి విద్యార్థి సంఘాలను అనుమతించవద్దని సెక్యులర్ పేరుతో విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఇచ్చిన ఆదేశాలు వెనక్కి తీసుకోవాలి. ►తక్షణమే అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలు కేజీబీవీ సంక్షేమ హాస్టల్ లను సొంత భవనాలు నిర్మించాలి. ► నూతన జాతీయ విద్యా విధానం 2020 తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీ తీర్మానం చేయాలి. -
ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా సాను
సాక్షి, హైదరాబాద్: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జాతీయ అధ్యక్షుడిగా వీపీ సాను, ప్రధాన కార్యదర్శిగా మయూక్ బిశ్వాస్ తిరిగి ఎన్నికయ్యారు. మొత్తం 83 మందితో కొత్త కమిటీ ఎన్నిక కాగా, వారిలో 19 మందితో కార్యదర్శి వర్గం (ఆఫీస్ బేరర్స్) ఎన్నికైంది. జాతీయ కమిటీలో తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీ నుంచి నలుగురికి అవకాశం వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో మంగళవారం ప్రారంభమైన ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహాసభలు, శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నేషనల్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఉపాధ్యక్షుడు, ప్రెసిడెంట్లుగా నితీశ్ నారాయణ్ (ఢిల్లీ సెంటర్), ప్రతికుర్ రహమన్ (బెంగాల్), తాళ్ల నాగరాజు (తెలంగాణ), అశోక్ (ఏపీ), అనుశ్రీ (కేరళ), సంగీతాదాస్ (అసోం), సహాయ కార్యదర్శులుగా దినిత్ డెంట, దీప్సితాధర్ (ఢిల్లీ సెంటర్), శ్రీజన్ భట్టాచర్య (బెంగాల్), పీఎం అశ్రో (కేరళ), సందీపన్ దాస్ (త్రిపుర), ఆదర్శ్ ఎం.సాజీ (సెంటర్) ఎన్నికయ్యారు. కార్యదర్శి వర్గ సభ్యులుగా నిరుబన్ చక్రవర్తి (తమిళనాడు), ఐషీఘోష్ (ఢిల్లీ), సుభాష్ జక్కర్ (రాజస్థాన్), అమత్ ఠాకూర్ (హిమాచల్‌ప్రదేశ్)ను ఎన్నుకున్నారు. తెలంగాణ నుంచి నాగరాజు, ఆర్.ఎల్.మూర్తి, ఎం.పూజ, మమత, శివదుర్గారావు (హెచ్‌సీయూ)లకు కమిటీలో చోటు లభించింది. (చదవండి: ఇప్పుడేం చేద్దాం? ఢిల్లీ వెళ్లాలా? లేఖ రాయాలా) -
ఎవరీ ఆయిషీ ఘోష్?
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో జరిగిన హింసాత్మక ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ప్రధానంగా దేశం దృష్టిని ఆకర్షించింది మాత్రం వర్సిటీ విద్యార్థిసంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్. బెంగాల్‌కు చెందిన ఆమె ప్రతిష్టాత్మక జేఎన్‌యూలో పీహెచ్డీ అభ్యసిస్తూ తాజా ఘటనతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. కమ్యూనిస్టుల పురిటిగడ్డ బెంగాల్ నుంచి వచ్చింది కాబట్టి వామపక్ష భావజాలాన్ని తన బలంగా మలుచుకున్నారు. హక్కుల సాధన కోసం విద్యార్థి దశలోనే సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘమైన ఎస్ఎఫ్ఐ తరపున అనేక పోరాటాలు చేశారు. ఆ తెగువే ఆమెను ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక ‘జేఎన్‌యూ’ స్టూడెంట్ యూనియన్‌కు ప్రెసిడెంట్‌ను చేసింది. పదవి చేపట్టి మూడునెలలు కూడా కాకుండానే ఇటీవల ‘జేఎన్‌యూ’లో జరిగిన సంఘటనతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. వామపక్ష భావజాలానికి కంచుకోట అయిన పశ్చిమబెంగాల్లోని పారిశ్రామిక ప్రాంతం దుర్గాపూర్ ఆయిషీ సొంతూరు. న్యూఢిల్లీలోని దౌలత్ రామ్ కాలేజీలో రాజనీతిశాస్త్రంలో డిగ్రీ చేసే రోజుల్లోనే విద్యార్థి రాజకీయాల దిశగా ఆమె తొలి అడుగులు పడ్డాయి. ఆ తరువాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో పీజీ అవగానే అంతర్జాతీయ సంబంధాల మీద ఆసక్తితో ఎంఫిల్‌లో అదే సబ్జెక్టు ఎంచుకున్నారు. ఎంఫిల్ అయ్యాక అక్కడే పీహెచ్‌డీలో చేరారు. జేఎన్‌యూ క్యాంపస్‌కు చేరిన తరువాత విద్యార్థి రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొనడం మొదలెట్టారు ఆయిషీ. ఈ క్రమంలోనే లెఫ్ట్‌వింగ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అయిన ‘స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎస్ఎఫ్ఐ)లో చేరారు. పోరాట స్వభావానికి తోడు విషయపరిజ్ఞానం, తూటాల్లాంటి మాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ప్రసంగాలు తోటి విద్యార్థుల్లో ఆలోచనబీజాలను నాటడమే కాదు... పోరాటస్ఫూర్తిని కూడా నింపేవి. ఈ నాయకత్వ లక్షణాలే ఆమెను దేశంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయానికి విద్యార్థి నాయకురాలిని చేశాయి. 13 ఏళ్ల్ల తరువాత జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఎస్ఎఫ్ఐ జయకేతనం ఎగురవేయడంలో ఆయిషీ కీలకంగా వ్యవహరించారు. ప్రెసిడెంట్ అయ్యాక క్యాంపస్ సమస్యల మీద దృష్ట పెట్టారు. హాస్టల్ ఫీజు తగ్గించాలని, ఆ తరువాతే రెండో సెమిస్టర్ రిజిస్ట్రేషన్ నిర్వహించాలని విద్యార్థులకు మద్దతుగా పోరాటానికి దిగారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కూడా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో క్యాంపస్‌లో నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆమె ఉంటున్న జెఎన్‌యూలోని సబర్మతీ హాస్టల్లోకి జనవరి 5న కొందరు ఆగంతుకుల చొరబడి కర్రలతో దాడిచేసి ఆమెతో సహా దాదాపు 36మందిని గాయపరిచారు. అయితే వర్సిటీలో చెలరేగిన హింసకు ఆయిషీతో పాటు మరో తొమ్మిది మంది విద్యార్థులను అనుమానితులుగా భావిస్తున్నామంటూ ఢిల్లీ పోలీసులు ఫోటోలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే విచారణ అనంతరం రుజువైతే వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ ప్రకటించారు. ఘోష్ నాయకత్వాన క్యాంపస్‌లోని సర్వర్ రూమ్‌ను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ ఆదివారం రాత్రే ఢిల్లీ పోలీసులు వారిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా ఘోష్ వివాదంపై ఆమె తల్లీదండ్రులు స్పందించారు. తన కూతురిని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ: ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. వేసవి సెలవుల సమయంలోనూ కొన్ని కార్పొరేట్ కళాశాలలు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నేతలు, శ్రేణులు ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారులు కలిసేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. ఎస్ఎఫ్ఐ నేతలను, శ్రేణులను అడ్డుకున్నారు. అధికారులను వారు కలువకముందే అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థి సంఘం నేతలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా వేసవి సెలవుల్లోనూ తరగతులు నిర్వహిస్తున్న పలు ప్రైవేటు కళాశాలల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా ఆర్ఐవోపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్పొరేట్ కళాశాలకు ఇంటర్ బోర్డు అధికారులు అమ్ముడు పోయారంటూ ఆరోపించారు. -
వైఎస్ఆర్ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం SFI నేతల పాదయత్ర
-
రాష్ట్రాన్ని నట్టేట ముంచిన నరేంద్రమోదీ
ఒంగోలు టౌన్: తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా ఇస్తానంటూ వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చిన నరేంద్రమోదీ రాష్ట్రాన్ని నట్టేట ముంచారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కస్యాపురం రమేష్ ధ్వజమెత్తారు. కేంద్రం రాష్ట్రాన్ని మోసగిస్తే, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులను నయవంచనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా పరిరక్షణ యాత్ర బుధవారం సాయంత్రం ఒంగోలు చేరుకొంది. స్థానిక లాయర్‌పేటలోని ప్రకాశం పంతులు విగ్రహం వద్ద విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్ని కేంద్రంలోని బీజేపీ అమలు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక హోదాపట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నాలుగేళ్లపాటు బీజేపీతో అంటకాగిన సమయంలో ప్రత్యేక హోదా అప్పుడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కావాలని ఉంటే ప్రత్యేక ప్యాకేజీ ఎలా తీసుకున్నావని నిలదీశారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్షలతో ప్రజలను వంచిస్తున్నారని విమర్శించారు. 30 సార్లు ఢిల్లీ వెళ్లాను, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందంటూ పదేపదే చెప్పుకొస్తున్న చంద్రబాబుకు ప్రత్యేక హోదా సాధించేందుకు ఆ అనుభవం సరిపోదా అని ఎద్దేవా చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వై. రాము మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను చంద్రబాబు ప్రభుత్వం పతనం చేస్తోందని విమర్శించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 4000 ప్రభుత్వ పాఠశాలలు, 1020 వసతి గృహాలను మూసివేసిందని, మరికొన్నింటిని మూసివేసేందుకు రంగం సిద్దం చేస్తోందన్నారు. విద్యారంగాన్ని పరిరక్షించేవరకు ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పవన్, సీహెచ్ సుధాకర్, ప్రసన్న, జిల్లా కార్యదర్శి సీహెచ్ వినోద్, నాయకులు చిన్నపరెడ్డి, విజయ్, ఓబుల్‌రెడ్డి, మహేంద్ర, అరుణ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
విభజన హామీలపై 25న మానవహారం
వైవీయూ : విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా కోటిమందితో మానవహారం నిర్వహిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. బుధవారం నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి. దస్తగిరి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొమ్మద్ది ఈశ్వరయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహలు మానవహారంపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేకహోదాతో పాటు రాయలసీమకు ప్రత్యేకప్యాకేజి, గిరిజన, సెంట్రల్, మైనింగ్ యూనివర్సిటీల ఏర్పాటు, పోలవరం పూర్తి, ఎయిమ్స్, మెట్రోలైన్స్, రాజధాని నిధులు తదితర హామీలను నెరవేర్చాలంటూ మానవహారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు శివ, మధు, శివకుమార్, పుల్లయ్య, రాజేంద్ర, ప్రసాద్ పాల్గొన్నారు. కడప వైఎస్సార్ సర్కిల్ : విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని కోరు తూ ఈనెల 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందితో మానవహారాన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ దీక్షలు చేయడం అధికారాన్ని దుర్విని యోగం చేయడమేనన్నారు. జూలై 1 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు సదస్సులు, చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు మొదటి వారంలో మైదుకూరులో సీపీఐ జిల్లా మహాసభలు జరుగుతాయని తెలిపారు. ఈ సభల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కార్యదర్శి వర్గ సభ్యులు ఓబులేశు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కృష్ణమూర్తి, నాగసుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
క్యాంపస్‌లో ఘర్షణ.. ఎస్ఎఫ్ఐ విద్యార్థి హత్య
తిరువనంతపురం : రెండు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ విద్యార్థి నేత హత్యకు గురైయ్యాడు. ఈ ఘటన కేరళలోని ఎర్నాకులం మహారాజ్ కాలేజీలో సోమవారం చోటుచేసుకుంది. ఫ్రెషర్స్ డే సందర్భంగా సీపీఎంకు చెందిన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) విద్యార్థులు కాలేజీ ఆవరణలో పోస్టర్ పెట్టినందుకు క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఎస్ఎఫ్ఐకు చెందిన విద్యార్థినేత అభిమన్యు కత్తిపోట్లకు గురై మృతి చెందగా, ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చెరుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. పాపులర్ ఫ్రెంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), క్యాంపస్ ఫ్రెంట్‌కు చెందిన వ్యక్తులే ఈ ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు. ఘటనకు కారణమైన వారిలో కేవలం ఒక్కరు మాత్రమే కాలేజీకి చెందిన వారని, మిగిలిన వారంతా బయటి వ్యక్తులుగా గుర్తించామని తెలిపారు. ఘటనను కేరళ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు పీ. రాజీవ్ తీవ్రంగా ఖండించారు. ప్రగతిశీల వాదులంతా ఇలాంటి ఘటనలను ఖండించాలని కోరారు. విద్యార్థి నేత హత్యకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంఘాల బంద్‌కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. -
మతోన్మాదంపై పోరాటం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం : దేశంలో బీజేపీ ప్రభుత్వం విద్యారంగంలో మతోన్మాద భావాలను పెంపొందిస్తుందని ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు వీపీ సాను అన్నారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ్ పరివార్ ఎజెండాను వ్యతిరేకించిన వారిపై దాడులు చేస్తుందన్నారు. దేశంలో ప్రజాతంత్ర భావాలు, అభ్యుదయ వాదులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. యూజీసీ నిబంధనల పేరుతో జేఎన్‌యూ తదితర విశ్వవిద్యాలయాల్లో కోర్సులను తగ్గించాలని చూస్తుందన్నారు. అచ్చే దిన్ అంటున్న మోదీ ఎవరికి మంచి రోజులు తెచ్చారో చెప్పాలన్నారు. కార్పొరేట్ శక్తులు పన్నులు ఎగవేసి దేశాలు దాటిపోతున్నా మాట్లాడని ప్రధాని, అన్నదాతలకు రుణమాఫి, ఉన్నత విద్యకు నిధులు కేటాయించడం లేదన్నారు. దేశంలో బీజేపీ విధానాలను ఎదుర్కోవాలంటే మాస్ పోరాటాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. త్వరలో విద్యారంగ సమస్యలపై దేశవ్యాప్తంగా జాతా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన రాష్ట్ర అధ్యక్షులుగా తిరుపతి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్, అధ్యక్షులు ఎం. నాగేశ్వర్, సహాయ కార్యదర్శులు మహేష్, రవి, శ్రీధర్, హైదరాబాద్ నగర అధ్యక్ష, కార్యదర్శులు అశోక్‌రెడ్డి, జావేద్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న విపి సాను -
మూడేళ్ల తర్వాత పేరు పెడతారా?
ఒంగోలు టౌన్: జిల్లాకు ట్రిపుల్ ఐటీ ప్రకటించిన మూడేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పేరు పెట్టడాన్ని ఎస్ఎఫ్ఐ జిల్లా శాఖ తీవ్రంగా ఆక్షేపించింది. ట్రిపుల్ ఐటీ మంజూరు చేసిన తర్వాత ప్రకటించాల్సిన పేరును మూడేళ్ల తర్వాత ప్రభుత్వం ప్రకటించడాన్ని చూస్తుంటే ఉన్నత విద్య పట్ల పాలకులకు ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని పేర్కొంది. ఆదివారం స్థానిక ఎల్బీజీ భవన్లో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి సీహెచ్ సుధాకర్ మాట్లాడుతూ జిల్లాకు ట్రిపుల్ ఐటీ ప్రకటించి మూడేళ్లు అవుతున్నా దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయకుండా అబ్దుల్ కలాం పేరు పెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జిల్లాకు యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో వాటిపై ఆధారపడిన విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఒకవైపు కామన్ పరీక్షలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో వాటిని చెల్లించాలంటూ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నాయన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున విద్యార్థులను సమీకరించి ఉద్యమిస్తామని సుధాకర్ హెచ్చరించారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఆర్.చంద్రశేఖర్, కె.చిన్నపరెడ్డి, జి.ఆదిత్య, పి.విజయ్, ఎం.రవికుమార్, ఎస్.ఓబుల్‌రెడ్డి, సుబ్బారావు, వందనం, రాజయ్య, పి.వెంకట్రావు పాల్గొన్నారు. -
ముస్లిం యువకుడితో ఫొటో దిగిందని..
సాక్షి, బెంగళూరు: ముస్లిం యువకుడితో కలిసి దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిందనే కారణంగా ఎస్ఎఫ్ఐ మహిళా కార్యకర్తను బెదిరించిన ఘటనలో ఆదివారం మంగళూరు పోలీసులు ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ఎస్ఎఫ్ఐ కార్యరకర్త మాధురి.. ముస్లిం మతానికి చెందిన స్నేహితుడితో కలిసి దిగిన సెల్ఫీని తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది గమనించిన బెళ్తంగడి తాలూకా కక్కిరిచి ప్రాంతానికి చెందిన హరీశ్ దేవాడిగ అనే యువకుడు మాధురిని బెదిరిస్తూ ఆమె ఫేస్బుక్ ఖాతాలో సందేశాలు పంపాడు. యువతి ఫిర్యాదు మేరకు పాండేశ్వర పోలీసులు యువకుడు హరీశ్‌ను అరెస్ట్ చేశారు. అతడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చట్టప్రకారం నిందితుడిపై చర్య తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ‘ఐ లవ్ ముస్లిమ్స్’ అని వాట్సాప్‌లో మెసేజ్ చేసినందుకు 20 ఏళ్ల అమ్మాయిని వేధించి ఆత్మహత్యకు పాల్పడేలా చేసిన ఘటన చిక్‌మంగుళూరులో ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నేపథ్యంలో మాధురి కేసుపై పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అరెస్ట్ చేశారు. -
‘ఎస్ఎఫ్ఐ... ఇదేం పని’
సాక్షి, న్యూఢిల్లీ: కేరళ ప్రచారంలో ఎస్ఎఫ్ఐ వాడిన గాజా ఘర్షణల్లో గాయపడ్డ బాలిక ఫోటోనే కాశ్మీర్లో పెల్లెట్ గన్లకు గాయపడ్డ బాలికగా ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో పాక్ ప్రదర్శించిందని బీజేపీ ఆరోపించింది. ఐరాసలో పాక్ శాశ్వత రాయబారి మలీహ లోథికి ఎస్ఎఫ్ఐ ఈ ఫోటోను అందించిందా అని ఆ పార్టీ సందేహం వ్యక్తం చేసింది. ఎస్ఎఫ్ఐ తీరును ఆక్షేపిస్తూ బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిట్ పాత్రా ట్వీట్ చేశారు. ఐరాస సాధారణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పాక్ రాయబారి లోథి గాజా ఘర్షణల్లో గాయపడ్డ బాలిక ఫోటోను చూపుతూ ఆ ఫోటో కాశ్మీర్లో పెల్లెట్ గన్ బాధితురాలిగా పేర్కొంది. అయితే ఆ ఫోటో ఇజ్రాయిల్ దాడుల్లో గాయపడ్డ 17 ఏళ్ల గాజా బాలిక రవ్యా అబు జోమాగా ఆ తర్వాత వెల్లడైంది. అవార్డు గ్రహీత అమెరికన్ ఫోటో జర్నలిస్ట్ హైదీ లెవిన్ 2014 జులైలో ఈ ఫోటోను తీసినట్టు తేలింది. -
సంక్షేమ హాస్టళ్ల మూసివేత దారుణం : ఎస్ఎఫ్ఐ
విజయనగరం: సంక్షేమ హాస్టళ్లను మూసివేయాలనుకోవడం దారుణమైన చర్యని, తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని అంబేడ్కర్ భవనంలో ఆదివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. 2016-17 విద్యా సంవత్సరంలో పిల్లలు లేరన్న కారణంతో ఎస్సీ 13, బీసీ 14 హాస్టళ్లను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారన్నారు. ఇది దళిత, గిరిజన, బడుగు బలహీనవర్గాల పిల్లలను విద్యకు దూరం చేయడమేనని ఆరోపించారు. విద్యా హక్కుచట్టం ప్రకారం 14 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ ఉచిత నిర్భంద విద్యను అందించాలని, అవసరమైతే ప్రయాణ, భోజన వసతి కల్పించాలన్నారు. ఈ చట్టం వచ్చి ఆరు సంవత్సరాలు పూర్తయినా దీన్ని అమలు చేయాల్సిన పాలకులకు చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారు. తక్షణమే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 24న కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టనున్నామని చెప్పారు. అదే విధంగా ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు, సంతకాల సేకరణ, మండల కేంద్రాల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించనున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె.సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు యు.రాంబాబు, ఏయూ రిటైర్డ్ ప్రొఫెసర్ బి.రామకృష్ణారావు, అంబేడ్కర్ అశోక్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కోట అప్పన్న, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గోకా రమేష్‌బాబు, ప్రచార కార్యదర్శి ఆనందరావు, ఎస్ఎఫ్ఐ నాయకులు ఎం.చింతయ్య, రామ్మోహన్ తదితరులు పాల్కొన్నారు. -
హాస్టల్ సమస్యలపై ఆందోళన
విద్యార్థి నాయకులను అడ్డుకున్న పోలీసులు కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ నాయకుల అరెస్టు కడప సెవెన్‌రోడ్స్ : హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూల ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం కలెక్టరేట్ ఎదుట వేర్వేరుగా ఆందోళనలు నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తరలివచ్చిన విద్యార్థులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇరువురి మధ్య తీవ్రమైన తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. కొందరు విద్యార్థులు గేటు పైకి ఎక్కి లోనికి ప్రవేశించారు. దీంతో పోలీసులు వారిపై విరుచుకుపడ్డారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, కార్యదర్శి సుబ్బరాయుడు, నగర కార్యదర్శి ఓబులేశు, పీడీఎస్‌యూ జాయింట్ సెక్రటరీ సురేష్‌రెడ్డి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ హాస్టళ్లను మూసి వేయాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మెస్ ఛార్జీలను పెంచాలన్నారు. మెస్ విభాగాలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే పద్ధతికి ప్రభుత్వం స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోతే ఆందోళనల ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కె.రమేష్, ప్రధాన కార్యదర్శి లక్ష్మి గురవయ్య, పి.మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ భోజనం తినలేం
రోడ్డెక్కిన విద్యార్థులు ఆదోని టౌన్ : ఉడికి ఉడకని అన్నం, నీళ్లసాంబారు, చప్పటి భోజనం తినలేమంటూ విద్యార్థులు గురువారం రోడ్డెక్కెరు. ఆదోని మున్సిపల్ హై స్కూల్ నుంచి భోజనం పేట్లతో భీమాస్ సర్కిల్ చేరుకొని కొంతసేపు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఇసాక్, రవి మాట్లాడారు. భోజనం తయారీ ఏజెన్సీ నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భోజనం చేయలేక కొంతమంది విద్యార్థులు ఇళ్లకు వెళ్తున్నారన్నారు. ఈ విషయాన్ని హై స్కూల్ హెచ్ఎం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. మెనూ.. ప్రకారం భోజనం వడ్డించడం లేదని, ఉపాధ్యాయులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉడకని అన్నం తినలేక పక్కనే ఉన్న కాలువలో పారవేస్తున్నారని చెప్పారు. భీమాస్ సర్కిల్లో ఆందోళన చేస్తున్న విద్యార్థులను త్వరగా ఆందోళన ముగించాలని పోలీసులు ఒత్తిడి చేయడంతో వారు భోజనం ప్లేట్లతో తిరిగి స్కూల్‌కు వెళ్లారు. ఆందోళనలో ఎస్ఎఫ్ఐ నాయకులు వీరేష్, రామాంజనేయులు, సజ్జాద్, వీరన్న, మల్లి, సంజు పాల్గొన్నారు.