సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో జరిగిన హింసాత్మక ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ప్రధానంగా దేశం దృష్టిని ఆకర్షించింది మాత్రం వర్సిటీ విద్యార్థిసంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్. బెంగాల్‌కు చెందిన ఆమె ప్రతిష్టాత్మక జేఎన్‌యూలో పీహెచ్‌డీ అభ్యసిస్తూ తాజా ఘటనతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. కమ్యూనిస్టుల పురిటిగడ్డ బెంగాల్ నుంచి వచ్చింది కాబట్టి వామపక్ష భావజాలాన్ని తన బలంగా మలుచుకున్నారు. హక్కుల సాధన కోసం విద్యార్థి దశలోనే సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘమైన ఎస్‌ఎఫ్‌ఐ తరపున అనేక పోరాటాలు చేశారు. ఆ తెగువే ఆమెను ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక ‘జేఎన్‌యూ’ స్టూడెంట్ యూనియన్‌కు ప్రెసిడెంట్‌ను చేసింది. పదవి చేపట్టి మూడునెలలు కూడా కాకుండానే ఇటీవల ‘జేఎన్‌యూ’లో జరిగిన సంఘటనతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.
వామపక్ష భావజాలానికి కంచుకోట అయిన పశ్చిమబెంగాల్‌లోని పారిశ్రామిక ప్రాంతం దుర్గాపూర్ ఆయిషీ సొంతూరు. న్యూఢిల్లీలోని దౌలత్ రామ్ కాలేజీలో రాజనీతిశాస్త్రంలో డిగ్రీ చేసే రోజుల్లోనే విద్యార్థి రాజకీయాల దిశగా ఆమె తొలి అడుగులు పడ్డాయి. ఆ తరువాత జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో పీజీ అవగానే అంతర్జాతీయ సంబంధాల మీద ఆసక్తితో ఎంఫిల్‌లో అదే సబ్జెక్టు ఎంచుకున్నారు. ఎంఫిల్ అయ్యాక అక్కడే పీహెచ్‌డీలో చేరారు. జేఎన్‌యూ క్యాంపస్‌కు చేరిన తరువాత విద్యార్థి రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొనడం మొదలెట్టారు ఆయిషీ. ఈ క్రమంలోనే లెఫ్ట్‌వింగ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అయిన ‘స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎస్‌ఎఫ్‌ఐ)లో చేరారు. పోరాట స్వభావానికి తోడు విషయపరిజ్ఞానం, తూటాల్లాంటి మాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ప్రసంగాలు తోటి విద్యార్థుల్లో ఆలోచనబీజాలను నాటడమే కాదు... పోరాటస్ఫూర్తిని కూడా నింపేవి. ఈ నాయకత్వ లక్షణాలే ఆమెను దేశంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయానికి విద్యార్థి నాయకురాలిని చేశాయి.
13 ఏళ్ల్ల తరువాత జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఎస్‌ఎఫ్‌ఐ జయకేతనం ఎగురవేయడంలో ఆయిషీ కీలకంగా వ్యవహరించారు. ప్రెసిడెంట్ అయ్యాక క్యాంపస్ సమస్యల మీద దృష్ట పెట్టారు. హాస్టల్ ఫీజు తగ్గించాలని, ఆ తరువాతే రెండో సెమిస్టర్ రిజిస్ట్రేషన్ నిర్వహించాలని విద్యార్థులకు మద్దతుగా పోరాటానికి దిగారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కూడా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో క్యాంపస్‌లో నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆమె ఉంటున్న జెఎన్‌యూలోని సబర్మతీ హాస్టల్‌లోకి జనవరి 5న కొందరు ఆగంతుకుల చొరబడి కర్రలతో దాడిచేసి ఆమెతో సహా దాదాపు 36మందిని గాయపరిచారు.
అయితే వర్సిటీలో చెలరేగిన హింసకు ఆయిషీతో పాటు మరో తొమ్మిది మంది విద్యార్థులను అనుమానితులుగా భావిస్తున్నామంటూ ఢిల్లీ పోలీసులు ఫోటోలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే విచారణ అనంతరం రుజువైతే వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ ప్రకటించారు. ఘోష్ నాయకత్వాన క్యాంపస్‌లోని సర్వర్ రూమ్‌ను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ ఆదివారం రాత్రే ఢిల్లీ పోలీసులు వారిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా ఘోష్ వివాదంపై ఆమె తల్లీదండ్రులు స్పందించారు. తన కూతురిని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment