హాస్టల్ సమస్యలపై ఆందోళన
విద్యార్థి నాయకులను అడ్డుకున్న పోలీసులు
కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత
ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ నాయకుల అరెస్టు
కడప సెవెన్‌రోడ్స్ : హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూల ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం కలెక్టరేట్ ఎదుట వేర్వేరుగా ఆందోళనలు నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో తరలివచ్చిన విద్యార్థులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇరువురి మధ్య తీవ్రమైన తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. కొందరు విద్యార్థులు గేటు పైకి ఎక్కి లోనికి ప్రవేశించారు.
దీంతో పోలీసులు వారిపై విరుచుకుపడ్డారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, కార్యదర్శి సుబ్బరాయుడు, నగర కార్యదర్శి ఓబులేశు, పీడీఎస్‌యూ జాయింట్ సెక్రటరీ సురేష్‌రెడ్డి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ హాస్టళ్లను మూసి వేయాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మెస్ ఛార్జీలను పెంచాలన్నారు. మెస్ విభాగాలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే పద్ధతికి ప్రభుత్వం స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోతే ఆందోళనల ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కె.రమేష్, ప్రధాన కార్యదర్శి లక్ష్మి గురవయ్య, పి.మనోహర్ తదితరులు పాల్గొన్నారు.