ఒంగోలు టౌన్: జిల్లాకు ట్రిపుల్ ఐటీ ప్రకటించిన మూడేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పేరు పెట్టడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా శాఖ తీవ్రంగా ఆక్షేపించింది. ట్రిపుల్ ఐటీ మంజూరు చేసిన తర్వాత ప్రకటించాల్సిన పేరును మూడేళ్ల తర్వాత ప్రభుత్వం ప్రకటించడాన్ని చూస్తుంటే ఉన్నత విద్య పట్ల పాలకులకు ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని పేర్కొంది. ఆదివారం స్థానిక ఎల్‌బీజీ భవన్‌లో నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి సీహెచ్ సుధాకర్ మాట్లాడుతూ జిల్లాకు ట్రిపుల్ ఐటీ ప్రకటించి మూడేళ్లు అవుతున్నా దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయకుండా అబ్దుల్ కలాం పేరు పెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జిల్లాకు యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో వాటిపై ఆధారపడిన విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఒకవైపు కామన్ పరీక్షలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో వాటిని చెల్లించాలంటూ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నాయన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున విద్యార్థులను సమీకరించి ఉద్యమిస్తామని సుధాకర్ హెచ్చరించారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు ఆర్.చంద్రశేఖర్, కె.చిన్నపరెడ్డి, జి.ఆదిత్య, పి.విజయ్, ఎం.రవికుమార్, ఎస్.ఓబుల్‌రెడ్డి, సుబ్బారావు, వందనం, రాజయ్య, పి.వెంకట్రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment