ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ | Admission Notification in IIIT | Sakshi
Sakshi News home page

ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్

Published Fri, May 29 2015 12:52 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

Admission Notification in IIIT

భైంసా: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక ట్రిపుల్‌ఐటీ బాసరలో ప్రవేశాల ప్రక్రియకు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. మన రాష్ట్రంలో మొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో గురువారం నుంచి దరఖాస్తుల స్వీక రణ ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైన పల్లె విద్యార్థులకు అత్యుత్తమ ఐటీ విద్యనందించే లక్ష్యంతో ఆర్‌జేయూకేటీ ట్రిపుల్‌ఐటీలో విద్యార్థుల ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేసిం ది. తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక బాసర ట్రిపుల్‌ఐటీలో 1000 సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి గురువారం నుంచి జూన్ 19 వరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని ఇప్పటికే యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు రాష్ట్రపతి, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 85 శాతం సీట్లు, 15శాతం అన్‌రిజర్డ్వ్ సీట్లను కేటాయించారు.
 
 దరఖాస్తు చేసుకునే విధానం...
 ట్రిపుల్‌ఐటీలో చేరాలనుకునే విద్యార్థులు ఆన్‌లైన్ ప్రక్రియలో ఆర్‌జీయూకేటీకి దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్ www.rgujt.inÌZ admissions 2015.rgukt.in లింక్ ద్వారా అప్లికేషన్‌లను నమోదు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రతి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. అందులోని కాలంలో అడిగే వివరాలు పూర్తి చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. బాసర ట్రిపుల్‌ఐటీ క్యాంపస్ పేరును నమోదు చేయాలి. అనంతరం ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తు ప్రింట్ తీసుకుని పదో తరగతి ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలు, రూ.150 విలువ గల బ్యాంకు డిమాండ్ డ్రాఫ్ట్‌ను ఒరిజినల్ జత పరిచి, రిజిస్ట్రార్ ట్రిపుల్‌ఐటీ క్యాంపస్ గచ్చిబౌలి హైదరాబాద్ చిరునామాకు రిజిస్ట్రార్ ద్వారా లేదా స్పీడ్ పోస్టు ద్వారా పంపాలి. వెనుకబడిన విద్యార్థులు రూ.100 డిమాండ్ డ్రాఫ్ట్ జత చేస్తే సరిపోతుంది.
 
 ప్రవేశానికి అర్హతలు...
 పదో తరగతి లేదా దానికి సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. 2015 సంవత్సరంలో రెగ్యూలర్ విద్యార్థులుగా మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులు కావాలి. డిసెంబర్ 31, 2015 నాటికి 18 ఏళ్ల వయసు దాటకూడదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 21 సంవత్సరాల వరకు మినహాయింపు ఉంది.
 
 ఎంపిక ప్రక్రియ...
 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివిన వారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వెనుకబాటు సూచి కింద 0.4 జీపీఏ అదనంగా కలుపుతారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివిన వారికి వెనుకబాటు సూచి పాయింట్లు ఉండవు. వచ్చిన దరఖాస్తుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల వడపోతను ఆరంభిస్తారు. అనంతరం పదో తరగతి జీపీఏ ఆధారంగా రిజర్వేషన్‌లను పాటిస్తూ విద్యార్థులను ఎంపిక చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనూ అన్ని మండలాలకు ప్రాతినిధ్యం ఉండేలా అధికారులు ఎంపిక ప్రక్రియ చేపడుతారు. ఎంపికైన విద్యార్థులకు ఉత్తరాలు, సెల్‌ఫోన్ ద్వారా సమాచారం అందజేస్తారు.
 
 జీపీఏ సమానంగా ఉంటే...
 దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జీపీఏ సమానంగా ఉంటే గ్రేడ్ పాయింట్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఒకేరకమైన పాయింట్లు ఉన్న వారు వేలల్లో ఉంటారు. అలాంటప్పుడు గణితంలో ఎక్కువ మార్కులు ఉన్నవారికి మొదటిప్రాధాన్యం ఇస్తారు. అక్కడ కూడా సమానంగా ఉంటే భౌతికశాస్త్రం.. అప్పు డూ సమానమైతే రసాయనశాస్త్రం చివరగా ఆంగ్లం మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. అప్పటికీ ఎక్కువ మంది సమానంగా ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసు ఉన్న వారికి ప్రవేశం కల్పిస్తారు.
 
 ప్రవేశం తర్వాత...
 ట్రిపుల్‌ఐటీలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆరేళ్ల కోర్సు ఉంటుంది. మొదటి రెండేళ్లు ప్రీ యూనివర్సిటీ కోర్సు(పీయూసీ) ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్‌తో సమానం. రెండేళ్ల కోర్సు తర్వాత ఇక్కడ చదివే విద్యార్థులకు అవకాశాలు వస్తే బయటకు వెళ్లిపోవచ్చు. వారికి పీయూసీ ఉత్తీర్ణత పత్రం ఇస్తారు. మిగిలిన నాలుగేళ్లు ఇంజినీరింగ్ విద్య ఉంటుంది. నాలుగేళ్ల బీటెక్ కోర్సును సెమిస్టార్ విధానం ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది. బీటెక్‌లో ఆర్‌జీయూకేటీ సివిల్, కెమికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఈసీఈ, ఎంఎంఈ కోర్సులు అందిస్తోంది. పీయూసీలో సాధించిన మార్కులే బీటెక్‌లో కోర్సుల కేటాయింపునకు కీలకం అవుతాయి. ట్రిపుల్‌ఐటీల ప్రధాన లక్ష్యం ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కావడంతో ఎక్కువ మంది విద్యార్థులు కోర్సు ఇక్కడే పూర్తిచేసేందుకు ఆసక్తి కనబరుస్తారు.
 
 బోధన రుసుము..
 గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఇంజినీరింగ్ విద్యను అందించే ఉద్దేశంతో ప్రారంభించిన ట్రిపుల్‌ఐటీల్లో కుటుంబ ఆదాయం రూ.లక్షలోపు ఉంటే ప్రభుత్వమే ఉచితంగా విద్యా, వసతి కల్పిస్తుంది. లక్షలోపు ఆదాయం ఉన్న విద్యార్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం రూ.3 వేలు కాషన్ డిపాజిట్ చెల్లించాలి. కోర్సు పూర్తయ్యాక అది విద్యార్థులకే తిరిగి ఇచ్చేస్తారు. లక్ష ఆదాయం దాటిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఏడాదికి రూ.36 వేలు బోధన రుసుము చెల్లించాలి.
 
 మేజర్‌తోపాటు మైనర్ సబ్జెక్టు...
 బీటెక్‌లో ప్రవేశించాక విద్యార్థులు ఆరు శాఖల్లో ఒక దానిని ప్రధాన(మేజర్) సబ్జెక్టుగా ఎంచుకుంటారు. దీంతోపాటు తప్పని సరిగా విద్యాంతర నైపుణ్యాలు పొందేందుకు మైనర్ సబ్జెక్టును ఎంచుకోవాలి. ఇందులో సంగీతం, నృత్యం, హ్యూమానిటిస్, గణితం, ఇంజినీరింగ్ సైన్స్ వంటి వాటిలో ఒకదానిని ఎంచుకోవచ్చు. మేజర్ డిగ్రీతోపాటు అదనంగా యూనివర్సిటీ మైనర్ డిగ్రీని విద్యార్థులకు ప్రదానం చేస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement