విద్యాపరిరక్షణ యాత్ర ర్యాలీలో పాల్గొన్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు
ఒంగోలు టౌన్: తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా ఇస్తానంటూ వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చిన నరేంద్రమోదీ రాష్ట్రాన్ని నట్టేట ముంచారని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కస్యాపురం రమేష్ ధ్వజమెత్తారు. కేంద్రం రాష్ట్రాన్ని మోసగిస్తే, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులను నయవంచనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా పరిరక్షణ యాత్ర బుధవారం సాయంత్రం ఒంగోలు చేరుకొంది. స్థానిక లాయర్‌పేటలోని ప్రకాశం పంతులు విగ్రహం వద్ద విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్ని కేంద్రంలోని బీజేపీ అమలు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక హోదాపట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
నాలుగేళ్లపాటు బీజేపీతో అంటకాగిన సమయంలో ప్రత్యేక హోదా అప్పుడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కావాలని ఉంటే ప్రత్యేక ప్యాకేజీ ఎలా తీసుకున్నావని నిలదీశారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్షలతో ప్రజలను వంచిస్తున్నారని విమర్శించారు. 30 సార్లు ఢిల్లీ వెళ్లాను, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందంటూ పదేపదే చెప్పుకొస్తున్న చంద్రబాబుకు ప్రత్యేక హోదా సాధించేందుకు ఆ అనుభవం సరిపోదా అని ఎద్దేవా చేశారు.
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి వై. రాము మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను చంద్రబాబు ప్రభుత్వం పతనం చేస్తోందని విమర్శించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 4000 ప్రభుత్వ పాఠశాలలు, 1020 వసతి గృహాలను మూసివేసిందని, మరికొన్నింటిని మూసివేసేందుకు రంగం సిద్దం చేస్తోందన్నారు. విద్యారంగాన్ని పరిరక్షించేవరకు ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పవన్, సీహెచ్ సుధాకర్, ప్రసన్న, జిల్లా కార్యదర్శి సీహెచ్ వినోద్, నాయకులు చిన్నపరెడ్డి, విజయ్, ఓబుల్‌రెడ్డి, మహేంద్ర, అరుణ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment