సాక్షి, అమరావతి: పేదలకు అందాల్సిన సబ్సిడీ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోతోంది. అయినా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, అధికారులు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ బియ్యం వ్యాపారంలో అధికార పార్టీకి చెందిన నేతలు, వారి అనుచరుల పాత్ర ఉండటంతోనే చర్యలకు వెనకడుగు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బస్టాండ్‌లు, సినిమా థియేటర్లలో తినుబండారాలను ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారంటూ తనిఖీలు చేస్తూ హంగామా చేసే అధికారులు పేదలకందాల్సిన సబ్సిడీ బియ్యం విదేశాలకు అక్రమంగా తరలిపోతున్నా తనిఖీలు మాత్రం నిర్వహించడం లేదు. సబ్సిడీ బియ్యాన్ని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు, మిల్లర్లు నేరుగా రేషన్ షాపులకు వెళ్లి లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు.
మరోవైపు కొందరు డీలర్లు కూడా లబ్ధిదారులకు బియ్యం ఇచ్చే సమయంలో ఈ–పాస్ మిషన్‌పై రెండు నుంచి ఐదు కిలోల బరువున్న రాయిని ఉంచి బియ్యాన్ని అక్రమంగా సేకరిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 1.44 కోట్ల తెల్లరేషన్ కార్డుదారులకు ప్రతి నెలా దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయి. వీటిలో ప్రతి నెలా 50 వేల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యాన్ని నేరుగా వ్యాపారులు కొనుగోలు చేసి వాటిని మిల్లుల్లో దాచిపెడుతున్నారు. బియ్యం ఎగుమతులకు కాకినాడ నౌకాశ్రయం అనువుగా ఉండటంతో అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ఎగుమతిదారులతో చేతులు కలిపి ప్రతి నెలా నల్లబజారుకు తరలించే సబ్సిడీ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్న నిల్వల్లో కలిపేస్తున్నారు. కాకినాడ నౌకాశ్రయం నుంచి భారీగా బియ్యం ఎగుమతులు అవుతున్నా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు, విజిలెన్స్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.
ఈ జిల్లాల నుంచే ఎక్కువ
ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల నుంచి ఎక్కువగా సబ్సిడీ బియ్యం అడ్డదారిన ఎగుమతి అవుతున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందించినా పట్టించుకునేవారే కరువయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కరప మండలం ఉప్పలంకలోని ఎగుమతిదారులకు సంధించిన మిల్లులో సబ్సిడీ బియ్యాన్ని పాలిష్ చేస్తున్నారనే సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించారు. పలు జిల్లాలకు చెందిన 11 లారీలను స్వాధీనం చేసుకొని అందులో ఉన్న బియ్యం బస్తాల నుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపారు. అందులో సబ్సిడీ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అయితే పట్టుబడ్డ వ్యక్తులకు వెంటనే బెయిల్ వచ్చేలా చిన్న చిన్న కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తే కాకినాడ నౌకాశ్రయం కేంద్రంగా జరుగుతున్న అక్రమ వ్యాపారం బహిర్గతమవుతుంది. కాకినాడ నౌకాశ్రయం నుంచి ఏటా 22 నుంచి 25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం విదేశాలకు ఎగుమతి అవుతున్నట్లు అధికారులు నిర్థారించారు. వీటిపై కూడా నిఘా పెట్టాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment