- కేబినెట్ భేటీలో విద్యుత్తు చార్జీల పైనా వ్యూహాత్మక ధోరణే
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. పంపిణీ సంస్థల ప్రతిపాదనపై ఎలాంటి స్పష్టమైన వైఖరినీ వెల్లడించలేదు. ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు ఎలాంటి దిశా నిర్దేశం చేయలేదు. పైగా చార్జీల పెంపు అనివార్యమన్న డిస్కమ్‌లనే ప్రజల ముందు విలన్‌గా చూపించే ప్రయత్నం చేసింది. డిస్కమ్‌లకు ప్రభుత్వంతో సంబంధం లేదన్నట్టుగా.. పేదలపై అవి విద్యుత్ భారం మోపుతుంటే మంత్రులు వ్యతిరేకించినట్టుగా వ్యూహాత్మకంగా వ్యహరించింది.
ఏతావాతా చార్జీల మోత తప్పదని తెలుస్తుండటంతో, తద్వారా వె ల్లువెత్తే ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోవడంపై దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలో డిస్కమ్‌లు రూ.7,716 కోట్ల లోటును పూడ్చుకునేలా ప్రతిపాదనలు ఈఆర్‌సీకి సమర్పించేందుకు సిద్ధమవుతున్నాయి. సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై కీలక చర్చ జరిగింది.
ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ పరిస్థితిని ప్రభుత్వానికి వివరించారు.విశ్వసనీయ సమాచారం మేరకు డిస్కమ్‌ల ప్రతిపాదనలపై పలువురు మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేకత రాకుండా ఏం చేయాలనే దానిపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే బదులు ప్రస్తుతానికి వేచి చూడటమే సరైన విధానమని మంత్రివర్గం భావించినట్టు తెలుస్తోంది.