మా అమ్మ ఇంటింటికి వెళ్లి కూరగాయలు అమ్మేది. ఆ డబ్బులో రోజూ రూ.10 ఇచ్చేది. టికెట్ కొంటే డబ్బు అయిపోతుందని ఇసుక ట్రాక్టర్ల వారిని బతిమాలి కడపకు వెళ్లేవాడిని. కొద్దిసేపు జాగింగ్, మరికొద్దిసేపు నడకతో స్టేడియం చేరుకునేవాడిని. అలా కఠోర శ్రమ చేసి 2004లో అండర్-22 జట్టుకు ఎంపికయ్యా. ఆ తరువాత రంజీతో పాటు ఐపీఎల్ పోటీలలో పాల్గొన్నా.
-నందలూరులో శిక్షణ పొందుతున్న క్రీడాకారులతో
క్రికెటర్ పైడికాల్వ విజయకుమార్ అన్న మాటలు ఇవి.
నందలూరు, న్యూస్‌లైన్ :తపన ఉంటే ఏరంగంలోనైనా రాణించవచ్చని క్రీడాకారుడు పైడికాల్వ విజయ్‌కుమార్ అన్నారు. కూలిపనులు చేసుకునే తాను క్రమశిక్షణతో, పట్టుదలతో కష్టపడి రంజీ క్రికెట్‌లో స్థానం సంపాదించానని తెలిపారు. నందలూరులోని రైల్వే టెన్నిస్ కోర్టులో శుక్రవారం క్రికెట్ శిక్షణ పొందుతున్న వారికి ఆయన క్రికెట్‌లో మెలకువలు, సూచనలు , సలహాలు ఇచ్చారు.
మొదటగా తనగూర్చి క్రీడాకారులకు పరిచయం చేసుకుంటూ తన తల్లి ఇంటింటికి వెళ్లి కూరగాయలు అమ్మేదని.. అందులో వచ్చిన డబ్బులో రోజుకు 10 రూపాయలు ఇచ్చేదన్నారు. ఆ డబ్బుతో టికెట్‌కొని కడపకు వెళితే డబ్బు అయిపోతుందని.. తమ గ్రామంనుంచి కడపకు వెళ్లే ఇసుకట్రాక్టర్ వద్దకు వె ళ్లి వారిని బతిమాలి ఆట్రాక్టర్‌లో కడపలోని బిల్టప్ వద్ద దిగి, అక్కడినుంచి కొద్దిసేపు జాగింగ్ మరికొద్దిసేపు నడక ద్వారా స్టేడియంకు చేరుకునేవాన్నని తెలిపారు.
అలా ప్రతిరోజూ కఠోర శ్రమ, సాధన వల్ల 2004 సంవత్సరంలో అండర్ 22కి కడప జట్టుకు ఎంపికయ్యానన్నారు. ఆ తరువాత 2006 లో బరోడాలో జరిగే రంజీ క్రికెట్ పోటీలకు ఆడానని.. 2008 మొదటి ఐపీఎల్ లో తన ప్రతిభ చాటానని పేర్కొన్నారు. నేటికీ రంజీలో రాణిస్తున్నాని తెలిపారు. ఈ సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నిబద్ధత గురించి ఆయన వివరించారు. సమయం దొరికితే నందలూరుకు వచ్చి క్రీడాకారులకు శిక్షణ ఇస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సీనియర్ క్రికెటర్ జవహార్ బాష, ట్రైనర్ ఫైరోజ్‌ఖాన్‌లోడి, గౌస్‌మొహిద్దీన్, అబుబకర్ తదితరులు విజయ్‌కుమార్‌ను ఘనంగా సత్కరించారు.
కష్టపడితేనే విజయం
Published Sat, Jan 25 2014 3:38 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM
Advertisement
Advertisement