ఇంత మోసమా!
సాక్షి ప్రతినిధి, కడప: జంకుబొంకు లేకుండా హామీలు ఇచ్చి, గద్దెనెక్కి మాటమార్చినా అడ్డుకునేందుకు చట్టాల్లేని దుస్థితి భారతదేశంలో ఉంది. ఇదేం న్యాయం, ఇంత ఘోరం ఎందుకు.. మాట తప్పిన రాజకీయపార్టీలను బహిష్కరించేలా పార్లమెంటులో చట్టాలు తీసుకరావాల్సిన ఆవశ్యకత ఉందని వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు.
రుణ మాఫీతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయంలో మాటమార్చిన తెలుగుదేశం ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కడప కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఆపార్టీ మహాధర్నా చేపట్టింది. కార్యక్రమంలో కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథరెడ్డి, అంజాద్‌బాష, కొరముట్ల శ్రీనివాసులు, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, జయరాములు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, జడ్పీ ఛైర్మన్ గూడూరు రవి, పార్టీ పరిశీలకుడు జంగా కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, నగర మేయర్ సురేష్‌బాబు తదితరులు ప్రసంగించారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రైతులు, డ్వాక్రామహిళలు, పెద్ద ఎత్తున పాల్గొని మహాధర్నాను విజయవంతం చేశారు. ఈసందర్భంగా ప్రభుత్వ తీరు తెన్నులు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకపక్ష, నియంతృత్వ ధోరణులపై ధ్వజమెత్తారు.
సొంతమామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు రైతుల్ని, మహిళల్ని నిలువునా ముంచడం పెద్ద విశేషమేమి కాదని పలువురు ఎమ్మెల్యేలు విమర్శించారు.
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పచ్చిగా మోసాలకు పాల్పడుతోన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు చేసిన ప్రసంగాలకు పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. వారి ప్రసంగాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్లు ఉచ్చరించగానే ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించడం విశేషం. ఈ క్రమంలో భాగంగా లింగాలకు చెందిన రఘునాథరెడ్డి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలవాలిని చేసిన ప్రసంగానికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అచ్చతెలుగు మాండలికంలో తెలుగుదేశం నాయకులు తీరుతెన్నులను ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి వివరించడాన్ని ఆసక్తిగా ఆలకించారు. రుణమాఫీపై ప్రజలల్లో వ్యతిరేకత లేదు, వైఎస్సార్‌సీపీ ధర్నా చేపట్టడడం విడ్డూరం అంటున్నారు, అయితే ‘చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం’ అన్నట్లుగా ప్రజలు ఉన్నారని వివరించారు. అలాగే కపట నిద్రలో ఉన్న చంద్రబాబును మేల్కోలపాలంటే ‘కర్రు కాల్చి ముడ్డిమీద వాత పెట్టితేనే’ చలనం ఉంటుందన్నారు. అలాగే డిల్లీలో యువతిపై మానభంగం జరిగితే నిర్భయ చట్టం చేశారని, అదే రీతిలో మాట భంగం చేసినా నాయకులుకూ శిక్షలు ఉండాలన్నారు.
రూ.లక్ష రుణం తీసుకున్న రైతన్న ఆస్తులు జప్తు చేయడం, లేదంటే జైలుకు పంపుతున్నారని, రూ.లక్షకోట్లు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబును జపాన్‌కు పంపుతారా? ఇదెక్కడి న్యాయమని ధ్వజమెత్తారు. ఏరుదాటాక తెప్పతగిలేసినట్లుగా చంద్రబాబు తీరు నిలుస్తోందని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు మాట ఇస్తే తర్వాత ఎన్నిరకాల కత్తెర్లు అయినా పెట్టగలరని ఆయన తెలిపారు. అందుకే బ్యాంకుల్లో కోటి పైచిలుకు అకౌంట్లును కత్తిరించి 22లక్షల అకౌంట్లు మాత్రమే అర్హులని తేల్చాడన్నారు. సింగపూర్, జపాన్‌లను తీసుకువస్తా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారని, పాశ్చాత్య సాంప్రదాయాలు అవసరం లేదని తెలుగు సాంప్రదాయల్ని ఉండనిస్తే చాలని బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు హితబోద చేశారు.
చంద్రబాబుకు ధీటైన సవాల్...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనపై నిత్యం ఆరోపణలు చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు తన హయాంలో చోటుచేసుకున్న ఐఎంజీ భూముల కుంభకోణంపై విచారణ చేయించుకోగలరా? అని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సవాల్ విసిరారు. కల్లిబొల్లి కబుర్లు కాకుండా ప్రజలకు అండగా నిలిచేందుకు చేపట్టాల్సిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆరాధించిన వ్యక్తి నందమూరి తారక రామారావు, అలాంటి వ్యక్తిని సొంత మామ అనుకోకుండా వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబేనని, ఆయన ప్రజల్ని సైతం క్రమం తప్పకుండా వెన్నుపోటు పొడుస్తున్నారని కడప ఎమ్మెల్యే అంజాద్‌బాష తెలిపారు. నిష్ణాతులైన నిపుణులను విదేశీ పర్యటనలకు పంపితే ప్రయోజనం ఉంటుందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి తెలిపారు. ప్రజలు చైతన్య వంతులైతేనే రుణమాఫీ సాధ్యమౌతుందన్నారు. పుట్టుకతో వచ్చిన బుద్దులు చచ్చేంత వరకూ ఉంటాయని అందుకే చంద్రబాబులో ఎలాంటి మార్పు లేదని పార్టీ పరిశీలకుడు జంగా కృష్ణమూర్తి తెలిపారు. కడప జిల్లాలో మొలకెత్తిన మొక్క మహావృక్షమై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేద ప్రజానీకానికి నీడలా నిలిచిందన్నారు. అందుకే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేద ప్రజల మదిలో అమరుడుగా నిలిచారన్నారు. మహిళా నేతలు, డ్వాక్రా సభ్యులు, వృద్ధులు ప్రత్యక్షంగా చంద్రబాబు తీరుపై విరుచకబడ్డారు. అవకాశం వస్తే బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి, డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్లు తిరుపాలురెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ డీసీసీబీ అధ్యక్షుడు కొల్లం బ్రహ్మనందరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే తనయుడు నాగిరెడ్డి, జడ్పీ ైవె స్ ఛేర్మెన్ సుబ్బారెడ్డి, డిప్యూటి మేయర్ అరిఫుల్లా యువజన, మహిళా, సేవాదళ్, విద్యార్థి, ఎస్సీ సెల్ ఇతర అనుబంధ సంఘాల నాయకులు పాల్గోన్నారు. కాగా జమ్మలమడుగు, మైదుకూరు ఎమ్మెల్యేలు వ్యక్తిగత పనులు కారణంగా అందుబాటులో లేని కారణంగా మహాధర్నాకు హాజరు కాలేదని పార్టీ వర్గాలు తెలిపారుు.