
సాక్షి ప్రతినిధి – కడప : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు మైదుకూరు నియోజక వర్గంలో మరో ప్రయోగానికి తెర లేపబోతున్నారు.టీడీపీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న పుట్టా సుధాకర్ యాదవ్‌ను తప్పించి మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని నియోజక వర్గ నాయకున్ని చేయాలని నిర్ణయించుకున్నారు. పుట్టాను బుజ్జగించడం కోసం ఆయనకు తిరుమల–తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి చైర్మన్ పదవి ఆశ చూపారు. నేడో, రేపో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. దీంతో మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడానికి మార్గం సుగమమైంది. అయితే చంద్రబాబు నిర్ణయంపై పుట్టా సుధాకర్‌యాదవ్‌తోపాటు రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి తీవ్రంగా రగలిపోతున్నారు.
ఎన్నికల్లో ఓడిపోయిన పుట్టాను గానీ, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ నియోజక వర్గంలో పార్టీనే నమ్ముకుని రాజకీయం చేస్తున్న రెడ్యం వెంకటసుబ్బారెడ్డిని గానీ సంప్రదించకుండా సీఎం తీసుకున్న ఈ నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ పాత కార్యకర్తలు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే వరలో మూడు కత్తులు ఇమడ్చేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం వికటించి అక్కడ మూడు ముక్కలాట రాజకీయానికి తెర లేవబోతోందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పుట్టా వ్యతిరేకం
కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి పనిచేసిన తనను పక్కన పెట్టి డీఎల్ రవీంద్రారెడ్డికి పార్టీ పెత్తనం ఇవ్వడాన్ని పుట్టా సుధాకర్‌యాదవ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కోట్ల రూపాయల ఆదాయం వచ్చే కాంట్రాక్టులు, వ్యాపారాలు వదులుకుని తాను పార్టీ కోసం పనిచేస్తున్నానని ఆయన చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో ఓడినా 2019 ఎన్నికల్లో నైనా గెలవాలనే పట్టుదలతో తాను పనిచేసుకుంటుంటే డీఎల్‌ను తీసుకు రావాలనుకోవడం ఏమిటని ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో డీఎల్ తనకు మద్దతు ఇచ్చినట్లు చెబుతున్నా ఆయన సొంత బూత్‌లోనే వైఎస్సార్‌సీపీకి మెజారిటీ వచ్చిందని ఆయన చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న నేతలు డీఎల్‌తో ఇమడలేరనే వాదన ఆయన లేవదీశారు. తనకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినా అవసరం లేదని, ఎమ్మెల్యే కావాలనే గోల్‌తోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తెగేసి చెబుతున్నారు. డీఎల్‌ను పార్టీలోకి తీసుకునే విషయంపై కనీసం తన అభిప్రాయం కూడా తీసుకోకుండా నిర్ణయం తీసుకోవడాన్ని అవమానంగా భావిస్తున్నారు. డీఎల్‌ను ఎలాంటి పరిస్థితుల్లో పార్టీలోకి తీసుకోరాదని హై కమాండ్‌తోనే తేల్చుకోవాలని ఆయన భావిస్తున్నారు. మొదటి నుంచి పార్టీనే నమ్ముకుని ఉన్న నాయకులు, కేడర్‌తో డీఎల్‌తో ఇమడలేరనే వాదన ఆయన లేవదీశారు.
రగులుతున్న రెడ్యం వర్గం
ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన రెడ్యం కుటుంబం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశంనే నమ్ముకుని ఉంది. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రరెడ్డితో 35 సంవత్సరాలుగా ఫ్యాక్షన్ రాజకీయం నడుపుతోంది. ఈ కుటుంబం తరపున రెడ్యం వెంకటసుబ్బారెడ్డి నియోజక వర్గంలో పార్టీని నడిపించే దిక్కులేని సమయంలో కూడా డీఎల్‌ను ఎదుర్కొని పనిచేశారు. ఈ క్రమంలో ఆయన మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద అనేక కేసులు పెట్టారు. 2014 ఎన్నికల్లో మైదుకూరు టికెట్ కోసం రెడ్యం వెంకటసుబ్బారెడ్డి కూడా పోటీ పడ్డారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో బీసీలకు టికెట్ ఇస్తున్నామని, పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర స్థాయి పదవి ఇస్తానని చంద్రబాబు అప్పట్లో హామీ ఇచ్చారు. రెడ్యంకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని జిల్లా తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్ర నాయకత్వానికి పంపి రెండేళ్లు గడుస్తున్నా ఇంత వరకు దిక్కు లేదు.
అయినా పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న తమను కాదని తమ బద్ధ శత్రువు డీఎల్‌ను పార్టీలోకి తీసుకునే ప్రతిపాదనను రెడ్యం కుటుంబం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ విషయం గురించి కనీసం తమ అభిప్రాయం తీసుకోక పోవడంపై తీవ్రంగా రగిలిపోతున్నారు. డీఎల్ పార్టీలోకి వస్తే మొదటి నుంచి పార్టీనే నమ్ముకుని ఉన్న నాయకులను, కేడర్‌ను అణగదొక్కే రాజకీయం చేస్తారని, దీని వల్ల నిజమైన కార్యకర్తలు, నాయకులు పార్టీకి దూరం కావాల్సిన పరిస్థితి వస్తుందని రెడ్యం, పుట్టా వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తాను టీడీపీలోకి వస్తున్నానని డీఎల్ ఇప్పుడు అధికారులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, తాము ప్రతిపాదించిన అభివృద్ధి పనులను కూడా అడ్డుకునే ప్రయత్నాలు ప్రారంభించారని మైదుకూరు టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో డీఎల్ ఆగమనం మైదుకూరు టీడీపీని ఏ తీరానికి చేరుస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.
డీఎల్ షరతులు
తాను పార్టీలో చేరాలంటే నియోజక వర్గ ఇన్‌చార్జ్‌గా ప్రకటించి, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని డీఎల్ రెండు షరతులు విధించారు. ఈ షరతులకు సీఎం చంద్రబాబు అంగీకరించడంతో డీఎల్ టీడీపీలో చేరడానికి నిర్ణయించుకున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. డీఎల్ వారం, పది రోజుల్లో అమరావతిలో సీఎంను కలిసి పార్టీలో చేరే విషయం ప్రకటిస్తారని చెబుతున్నారు.