చక్కెర ఫ్యాక్టరీల గొంతులోచేదు గుళిక
- ధర, విక్రయాలు లేక చక్కెర పరిశ్రమలు దిగాలు
- భారీగా పేరుకుపోయిన పంచదార నిల్వలు
- మార్కెట్‌లో దిగుమతులే కారణం
గతేడాది పంచదార ఉత్పత్తి ఆశాజనకంగా వచ్చింది. అయితే ధర లేదు. డిమాండ్ అంతకన్నా లేదు. ఫలితం విక్రయాలు నిలిచిపోయాయి. లక్షలాది పంచదార బస్తాలు గోడౌన్లలో మూలుగుతున్నాయి. జిల్లాలోని సుగర్ ఫ్యాక్టరీల పరిస్థితి ఇది.
చోడవరం : ఓవైపు పంచదారకు ధర లేక.. మరోవైపు విక్రయాలు జరగక చక్కెర కర్మాగారాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. లక్షలాది బస్తాల పంచదార నిల్వలు గోడౌన్లలో మూలుగుతున్నాయి. జిల్లా చోడవరం, ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి సుగర్ ఫ్యాక్టరీల్లోనూ ఇదే పరిస్థితి. గత ఏడాది పంచదారపై లెవీ ఎత్తేయడంతో ప్యాక్టరీలు ఆర్థికంగా బాగుపడతాయని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా పంచదార ధర ఘోరంగా పడిపోయింది.
గత ఏడాది మొదట్లో క్వింటాలు రూ. 3300వరకు విక్రయించగా, తర్వాత క్రమేణా ధర తగ్గుకుంటూ వచ్చింది. ఒక దశలో క్వింటాలు రూ.2600కు పడిపోయింది. ఈ ఏడాది సీజన్ మొదట్లో అయినా ఈ ధర పెరుగుతుందని భావించినా ఆశించినమేర పెరగలేదు. జులై, ఆగస్టు నెలల్లో మాత్రం క్వింటా రూ. 3100కు వెళ్లినప్పటికీ, పరిస్థితి తారుమారై ప్రస్తుతం రూ. 2900 వద్దే ఉంది. కనీసం ఈ ధరకైనా విక్రయించాలని ఫ్యాక్టరీ అనుకున్నా మార్కెట్‌లో డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది.
ఇదీ కారణం!
ఇతర రాష్ట్రాల నుంచి పంచదార దిగుమతి అవుతుండడమే ఇందుకు కారణంగా ఫ్యాక్టరీ యాజమాన్యాలు భావిస్తున్నాయి. దీనికి తోడు వ్యాపారులు సిండికేట్ అయిపోవడం వల్ల కూడా ధర పెరగడం లేదనే వాదన వినిపిస్తోంది. జిల్లాలో చక్కెర కొనుగోలుకు ఎప్పట్నుంచో ఉంటున్న ‘ఆ ముగ్గురే’ తప్ప, మరెవ్వరూ రాకపోవడం కూడా ధర పెరగడానికి, అమ్మకాలకు విఘాతం కలుగుతున్నట్టుగా తెలుస్తోంది. ధర తగ్గినప్పుడు తప్ప ధర పెరిగినప్పుడు బయ్యర్లు ముందుకు రావడం లేదు. దీనివల్ల గత నెలరోజులుగా జిల్లాలో అన్ని ఫ్యాక్టరీల్లోనూ పంచదార విక్రయాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం రూ.2900 ధరకైనా కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో అన్ని ఫ్యాక్టరీల్లోనూ లక్షలాది క్వింటాళ్ల పంచదార నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి.
‘గోవాడ’కు అద్దెభారం...
పాత యంత్రాలైనప్పటికీ ఆపసోపాలు పడి క్రషింగ్ చేయగా, తీరా నిల్వలు పేరుకుపోవడంతో ఫ్యాక్టరీలు దిక్కుతోచని స్థితిలో గిలగిలా కొట్టుకుంటున్నాయి. గోవాడ ఫ్యాక్టరీ అయితే పంచదార నిల్వలకు అదనంగా ప్రైవేటు గోడౌన్లను అద్దెకు కూడా తీసుకుంది. ఈ పరిస్థితుల్లో అద్దె అదనపు భారంగా మారింది. వచ్చేది పండగల సీజన్ కావడంతో ధర, డిమాండ్ కూడా పెరగొచ్చని గోవాడ ఫ్యాక్టరీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, మేనేజింగ్ డెరైక్టర్ వి.వి.రమణారావు ఆశాభావం వ్యక్తం చేశారు.