ప్రభగిరిపట్నం షుగర్ ఫ్యాక్టరీ బకాయిల ఊబిలో ఇరుక్కుంది. దీంతో రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి.
పొదలకూరు, న్యూస్‌లైన్ : ప్రభగిరిపట్నం షుగర్ ఫ్యాక్టరీ బకాయిల ఊబిలో ఇరుక్కుంది. దీంతో రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. దేశంలో చక్కెర కర్మాగారాల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మండలంలోని ప్రభగిరిపట్నం ఎన్‌సీఎస్ షుగర్ ఫ్యాక్టరీపై రెండు పర్యాయాలు వరుసగా ఆర్‌ఆర్ యాక్ట్ అమలు కావడంతో పాటు ఎండీ, డెరైక్టర్, సీఈఓలపై పోలీసు కేసు నమోదైంది. రైతులకు రూ.13.80 కోట్లు బకాయిలు చెల్లించని కారణంగా కలెక్టర్ ఆదేశాలతో ఏసీసీ జీవీవీ సత్యనారాయణ ఫారం-3 ప్రకారం ఆగస్టులో సీజ్ చేసిన నాలుగు ఫ్యాక్టరీ వాహనాలు, రూ.24 లక్షల విలువైన 200 టన్నుల మొలాసిస్‌కు ఈ నెల 21న వేలం పాట నిర్వహిం చనున్నారు.
అనంతరం అసిస్టెంట్ కేన్ కమిషనర్ ఫ్యాక్టరీలోని యంత్రాలను, భూమిని స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యంపై ఫిర్యాదు చేసేందుకు చెరకు రైతులు మంగళవారం కలెక్టర్ వద్దకెళ్లారు. ఫ్యాక్టరీ ప్రారంభం నుంచి ఇదే పరిస్థితి ఉన్నా ప్రస్తుత దుస్థితిని గతంలో ఏ యాజమాన్యం ఎదుర్కోలేదని తెలుస్తోంది. 1994లో టి.సుబ్బరామిరెడ్డి గాయత్రి షుగర్స్ పేరుతో పొదలకూరుకు పది కిలోమీటర్ల దూరంలో ప్రభగిరిపట్నం పంచాయతీ పరిధిలో ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత మాగుంట సుబ్బరామిరెడ్డి కొనుగోలు చేసి నిర్మాణాన్ని పూర్తి చేసి 1996లో క్రషింగ్ ప్రారంభించారు. మాగుంట కుటుంబం నుంచి నాగార్జున ఫర్టిలైజర్స్ వారు టేకోవర్ చేశారు. వారి నుంచి గ్రంధి ఈశ్వరరావు కొనుగోలు చేసి సరితా షుగర్స్‌గా నామకరణం చేశారు. సరితా షుగర్స్ ఒక ఏడాది క్రషింగ్ నిలిపివేయడంతో క్రెప్స్ సంస్థ క్రషింగ్ వరకు లీజుకు తీసుకున్నారు. తర్వాత రెండు కంపెనీల మధ్య న్యాయపరమైన పోరాటం జరిగి రైతులు సైతం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరిగి ఈశ్వరరావు నుంచి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి కొనుగోలు చేసి వీడీబీ షుగర్స్‌గా నామకరణం చేశారు. ఆయన నుంచి నాగేశ్వరరావు టేకోవర్ చేసి ఎన్‌సీఎస్ షుగర్స్‌గా పేరును మార్చారు. ఈయనకు విజయనగరంలో కూడా షుగర్ ఫ్యాక్టరీ ఉంది. అయితే ఎన్‌సీఎస్ ఆధ్వర్యంలో 2011-12 సంవత్సరం మొదటి క్రషింగ్ సీజనే తీవ్ర వివాదాస్పదంగా మారింది.
రైతులకు రూ.22 కోట్ల బకాయిలు నిలిపివేయడంతో వారు సుమారు నెలరోజుల పాటు ఫ్యాక్టరీ వద్ద ధర్నాలు, నిరసన దీక్షలు, వంటావార్పు చేపట్టారు. రెండో క్రషింగ్ సీజన్ 2012-13లో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. అయితే ఫ్యాక్టరీ ఎండీ నాగేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు రైతుల బకాయిలను డిసెంబర్ 16న రూ.5 కోట్లు, జనవరి 16న రూ.5 కోట్లు, ఫిబ్రవరి 16న మిగిలిన రూ.4 కోట్లు చెల్లించమని ఆదేశించింది. అయితే యాజమాన్యం డిసెంబర్ 16న రూ.5 కోట్లు రైతులకు చెల్లించకపోవడంతో కలెక్టర్ మండిపడ్డారు. వెంటనే వారిపై పోలీసు కేసు నమోదు చేయించాల్సిందిగా ఆదేశించారు.
ఫ్యాక్టరీ జోన్ పరిధి 12 మండలాలు ఉండగా నాన్ జోన్ పరిధి కడప జిల్లాలోని కొంతప్రాంతం ఉంది. ఆ ప్రాంత రైతులు సైతం తమకు రూ.6 కోట్లు బకాయిలు ఇవ్వాలని ఫ్యాక్టరీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రారంభంలో 4 లక్షల టన్నుల చెరకు క్రషింగ్ చేసిన ఫ్యాక్టరీ ఇపుడు లక్ష టన్నులకు పడిపోయింది. జోన్‌పరిధిలో 6వేల ఎకరాల్లో చెరకు సాగుచేపట్టే 3వేల మంది రైతులు సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించారు. ప్రస్తుతం రైతు కమిటీ ద్వారా క్రషింగ్‌ను ప్రారంభించినట్టు యాజమాన్యం ప్రచారం చేసుకుంటోంది.
రైతులు తీవ్రంగా నష్టపోయారు:
చెరకు రైతులు ఎన్‌సీఎస్ ఫ్యాక్టరీ వైఖరి వల్ల తీవ్రంగా నష్టపోయారు. కోలుకోలేని విధంగా అప్పుల్లో కూరుకుపోయారు. చెరకు సాగుపై ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది.
- పి.పోలిరెడ్డి, రైతు, తాటిపర్తి
వెంటనే చర్యలు తీసుకోవాలి:
యాజమాన్యంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని రైతుల బకాయిలను చెల్లిం చాలి. వరిసాగు చేసేం దుకు పెట్టుబడులు లేక రైతులు అప్పులు చేసుకుంటున్నారు. ఫ్యాక్టరీకి చెరకు తోలి నష్టపోయాం.
-కె.రమణారెడ్డి, రైతు, మహ్మదాపురం