బకాయిల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ శనివారం రైతులు షుగర్ ఫ్యాక్టరీని ముట్టడించారు. దాదాపు 400 మంది బాధిత రైతులు స్థానిక అయ్యలూరు మెట్ట వద్ద ఉన్న ఫ్యాక్టరీకి చేరుకుని సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను బయటకు పంపారు. కోపోద్రిక్తులైన కొందరు ఆఫీసు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.
నంద్యాలరూరల్, న్యూస్‌లైన్: బకాయిల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ శనివారం రైతులు షుగర్ ఫ్యాక్టరీని ముట్టడించారు. దాదాపు 400 మంది బాధిత రైతులు స్థానిక అయ్యలూరు మెట్ట వద్ద ఉన్న ఫ్యాక్టరీకి చేరుకుని సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను బయటకు పంపారు. కోపోద్రిక్తులైన కొందరు ఆఫీసు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం ఫ్యాక్టరీ, ఆఫీసు, క్వార్టర్స్‌కు తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నంద్యాల డివిజన్‌లో 2011-12లో చెరకు పంట సాగు చేసినట్లు తెలిపారు. 2013 జనవరి 20 వరకు సాగైన చెరకును నంద్యాల ఫ్యాక్టరీ యాజమాన్యం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట ఫ్యాక్టరీకి పంపి సొమ్ము చేసుకుందన్నారు.
ఫిబ్రవరి 3 వరకు జరిగిన చెరకు క్రస్సింగ్‌కు సంబంధించి మొత్తం రూ.6.70 కోట్ల బకాయిలు 545 మంది రైతులకు ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే యాజమాన్యం వాటిని చెల్లించకుండా ఇప్పుడు.. అప్పుడు అంటూ రైతులను మభ్యపెడుతూ వస్తోందన్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని బకాయిలు చెల్లించాలని చెప్పినా ఫలితం కనిపించలేదని అన్నారు. అందుకే అందోళన చేపట్టాల్సి వచ్చిందని అన్నారు. బకాయిలు చెల్లించకపోతే ఫ్యాక్టరీ మేనేజింగ్ డెరైక్టర్ మధుసూదన్‌గుప్త ఇంటి వద్ద రైతు కుటుంబాలు మొత్తం దీక్షలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆందోళనలో రైతులు సాగేశ్వరరెడ్డి, పాపిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, ఈశ్వరరెడ్డి, రవికుమార్‌రెడ్డి, ఎల్లయ్య, మురళీ, సర్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.